స్టాక్ మార్కెట్ లో పెట్టుబడుల పేరుతో రూ.100 కోట్ల మోసం
మీ పెట్టుబడికి రెట్టింపు లాభం ఇస్తామంటూ నమ్మకంగా మాటలు చెప్పిన వారి మాటల్ని నమ్మి మోసపోయిన దారుణ ఉదంతం ఒకటి హైదరాబాద్ లో చోటు చేసుకుంది
By: Tupaki Desk | 31 May 2025 10:21 AM ISTమీ పెట్టుబడికి రెట్టింపు లాభం ఇస్తామంటూ నమ్మకంగా మాటలు చెప్పిన వారి మాటల్ని నమ్మి మోసపోయిన దారుణ ఉదంతం ఒకటి హైదరాబాద్ లో చోటు చేసుకుంది. అంతేకాదు నమ్మకం కలగటం కోసం రూ.100 బాండ్ పేపర్ మీద రాసి మరీ ఇవ్వటంతో భారీ సంఖ్యలో పెట్టుబడులు పెట్టిన వారు.. ఇప్పుడు సదరు సంస్థ బోర్డు తిప్పేయటంతో లబోదిబో అంటున్న పరిస్థితి. హైదరాబాద్ లోని జీడిమెట్ల ప్రాంతంలో ‘ది పెంగ్విన్ సెక్యూరిటీస్ సంస్థ’ చేసిన మోసంతో వందలాది మంది మోసపోయినట్లుగా చెబుతున్నారు.
మూడు నెలలుగా లాభాల్ని ఇవ్వని నేపథ్యంలో పలువురు ఆ సంస్థ ప్రతినిధులను నిలదీసేందుకు వెళ్లగా.. అక్కడ వచ్చిన సమాధానంతో జీడిమెట్ల పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు బాధితులు చేసిన ఫిర్యాదుల ప్రకారం చూస్తే రూ.6.5 కోట్ల వరకు మోసం జరిగినట్లు చెబుతున్నారు. అయితే.. ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టిన వారు వందల్లో ఉంటారని.. మొత్తం రూ.100 కోట్లకు పైనే మోసం జరిగి ఉంటుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
మూడేళ్ల క్రితం గిరి నగర్ కు చెందిన బాలాజీ.. మెదక్ జిల్లాకు చెందిన స్వాతిలు కలిసి చింతల్ లో ‘ది పెంగ్విన్ సెక్యూరిటీస్’ పేరుతో ఒక ఆఫీసస్ ఓపెన్ చేశారు. తమ సంస్థలో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు ఇస్తామని ప్రచారం చేశారు. పెట్టుబడి పెట్టిన వారికి రూ.100 స్టాంప్ పేపర్ పై నోట్ రాసి ఇవ్వటంతో వారిని చాలామంది నమ్మారు. కొందరు వీరి వద్ద పెట్టిన పెట్టుబడికి 20 నెలల వ్యవధిలో రెట్టింపు డబ్బులు ఇచ్చారు. చిన్న మొత్తాలు పెట్టుబడి పెట్టినా లాభాలు ఇస్తున్నారని నమ్మి పెద్ద ఎత్తున డబ్బులు పెట్టటంతో పాటు తమకు తెలిసిన వారి చేత కూడా డబ్బులు పెట్టించారు.
ఇతరులతో పెట్టుబడులు పెట్టించిన వారికి ఐదు శాతం కమిషన్ ఇచ్చేవారు. దీంతో.. వీరి వ్యాపారం అనతి కాలంలోనే భారీగా విస్తరించింది. హైదరాబాద్ తో పాటు ఇతర జిల్లాలకు చెందిన వారు సైతం ఇందులో పెట్టుబడులు పెట్టారు. అయితే.. మూడు నెలలుగా ఈ సంస్థ లాభాల చెల్లింపుల్ని ఆపేసింది. కొద్ది రోజుల క్రితం పలువురు సంస్థ కార్యాలయం వద్దకు వచ్చి ప్రశ్నించగా.. షేర్ మార్కెట్ బాగోలేదని.. శుక్రవారం చెల్లింపులు జరుపుతామని చెప్పారు.
తీరా వచ్చి చూస్తే.. తాళాలు వేసి ఉండటంతో తాము మోసపోయినట్లుగా గుర్తించి జీడిమెట్ల పోలీసుల్ని సంప్రదించారు. ఒక అంచనా ప్రకారం దాదాపు 1500 మంది రూ.100 కోట్ల వరకు పెట్టుబడి పెట్టినట్లుగా తెలుస్తోంది. నిందితుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. లాభాల పేరాశ చూపే వారిని నమ్మి మోసపోకూడదన్న విషయం తాజా ఉదంతం మరోసారి స్పష్టం చేస్తుందని చెప్పాలి.
