Begin typing your search above and press return to search.

పెందుర్తిలో అరుదైన రికార్డు ఎవరిది ?

విశాఖ జిల్లా పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడ్డాక ఒక ఎమ్మెల్యే అభ్యర్ధి రెండవసారి గెలిచిన దాఖలాలు అయితే లేవు.

By:  Tupaki Desk   |   30 April 2024 3:53 AM GMT
పెందుర్తిలో అరుదైన రికార్డు ఎవరిది ?
X

విశాఖ జిల్లా పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడ్డాక ఒక ఎమ్మెల్యే అభ్యర్ధి రెండవసారి గెలిచిన దాఖలాలు అయితే లేవు. 1978లో ఈ నియోజకవర్గం ఏర్పాటు అయింది. ఈ రోజున వైసీపీ మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాధ్ తాత గుడివాడ అప్పన్న పెందుర్తి తొలి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన మధ్యలో మరణిస్తే 1980లో వచ్చిన ఉప ఎన్నికల్లో ద్రోణం రాజు సత్యనారాయణ ఎమ్మెల్యే అయ్యారు. ఈ ఇద్దరూ కాంగ్రెస్ నుంచి గెలిచిన వారే.

ఇక 1983లో టీడీపీ తరఫున పెతకం శెట్టి అప్పల నరసింహం గెలిచారు. 1985లో ఆళ్ళ రామచంద్రరావు టీడీపీ నుంచి గెలిస్తే 1989లో గుడివాడ గురునాధరావు గెలిచారు. 1994లో సీపీఐ తరఫున మానం ఆంజనేయులు విజయం సాధించగా 1999లో పీవీజీఅర్ నాయుడు టీడీపీ నుంచి గెలిచారు.

అదే విధంగా 2004లో కాంగ్రెస్ నుంచి తిప్పల గురుమూర్తి రెడ్డి గెలిచారు. 2009లో ప్రజారాజ్యం నుంచి పంచకర్ల రమేష్ బాబు గెలిస్తే 2014లో టీడీపీ నుంచి బండారు సత్యనారాయణ మూర్తి గెలిచారు. 2019లో వైసీపీ నుంచి అదీప్ రాజ్ గెలిచారు. ఇలా చూసుకుంటే కనుక ఒకసారి గెలిచిన వారు రెండవసారి గెలవలేదు అన్నది స్పష్టంగా అర్ధం అవుతోంది.

కానీ ఈసారి ఆ రికార్డు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. 2009లో గెలిచిన పంచకర్ల రమేష్ బాబు జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజుకు మరోసారి పార్టీ అవకాశం ఇచ్చింది. అదీప్ రాజు 2019లో ఏకంగా 29 వేల భారీ మెజారిటీతో మాజీ మంత్రి బండారుని ఓడించారు.

ఈసారి కూడా తనదే విజయం అని ఆయన ధీమాగా ఉన్నారు. పెందుర్తిలో కాపులు వెలమలు బలమైన సామాజిక వర్గాలుగా ఉంటారు. రెండు లక్షల డెబ్బై వేల పై చిలుకు జనాభా ఉన్న పెందుర్తిలో రాజకీయం ఎపుడూ రంజుగానే సాగుతూ ఉంటుంది. కాపుల మద్దతు మొత్తం తమకే అని జనసేన భావిస్తోంది. అలాగే బండారు వర్గం కూడా గట్టిగా పనిచేస్తోంది కాబట్టి వెలమల మద్దతు కూడా తమకే దక్కుతుందని ధీమగా ఉంది.

దీనికి తోడు ప్రజారాజ్యం నాటి పరిచయాలు అలాగే తనకు ఉన్న సొంత బలం కూడా గెలుపును శాసిస్తాయని పంచకర్ల విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇక జగన్ అనకాపల్లి సభలో జనాలకు పరిచయం చేసినట్లుగా పొట్టివాడే కనీ గట్టి వాడు అదీప్ రాజ్ అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఆయనకు పెందుర్తిలో గట్టి పట్టుంది.

మూడున్నర పదుల వయసులోనే రెండవసారి ఎమ్మెల్యేగా పోటీలో ఉన్నారు. వైసీపీ అధినాయకత్వం అండడండలు ఉన్నాయి. కాపుల మద్దతు వైసీపీకి కూడా బాగానే ఉందని నియోజకవర్గానికి పదేళ్ళ పాటు దూరమైన ఇపుడు ఎన్నికల ముందు వచ్చిన నాన్ లోకల్ పంచకర్లను జనాలు గెలిపించరు అని వైసీపీ అంటోంది. పైగా పైకి మద్దతు ఇచ్చినట్లుగా ఉన్నా బండారు వర్గంలో అసంతృప్తి ఉందని జనసేనలో టికెట్ దక్కని వారు కూడా నిరాశగా ఉన్నారని అంటోంది.

ఈ ఇద్దరిలో ఎవరి లెక్కలు వారికి ఉన్నా గెలిచేది మాత్రం వీరిలో ఒకరు ఖాయం. వారే పెందుర్తి చరిత్రను తిరగరాసిన వారు అవుతారు. పెందుర్తి నుంచి రెండోసారి ఎమ్మెల్యే అయి సరికొత్త రికార్డుని సృష్టించబోయేది ఏవ్రో జూన్ 4న ఫలితాలే చెబుతాయని అంటున్నారు.