ఆ సీటు మీద టీడీపీ కన్ను !
విశాఖ జిల్లాలో ఉన్న పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం రాజకీయంగా చాలా కీలకమైనది. 1979లో ఏర్పాటు అయిన పెందుర్తి అసెంబ్లీ సీటు నుంచి దిగ్గజ నేతలు అంతా ఎమ్మెల్యేగా గెలిచి ప్రాతినిధ్యం వహించారు.
By: Satya P | 17 July 2026 10:03 AM ISTవిశాఖ జిల్లాలో ఉన్న పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం రాజకీయంగా చాలా కీలకమైనది. 1979లో ఏర్పాటు అయిన పెందుర్తి అసెంబ్లీ సీటు నుంచి దిగ్గజ నేతలు అంతా ఎమ్మెల్యేగా గెలిచి ప్రాతినిధ్యం వహించారు. ద్రోణం రాజు సత్యనారాయణ వంటి వారు కూడా ఇక్కడ నుంచే ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళ్లారు. ఇక అసెంబ్లీ సీట్ల పునర్ విభజనలో పరవాడ మండలం పెందుర్తిలో కలిసింది. దాంతో అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పెందుర్తికి షిఫ్ట్ అయ్యారు. ఆయన 2014లో గెలిచారు. 2009, 2019లలో ఓటమి చెందారు. 2024లో ఆయనను మాడుగుల అసెంబ్లీ సీటుకు షిఫ్ట్ చేసి పొత్తులో భాగంగా జనసేనకు ఈ సీటుని కేటాయించారు. అలా పంచకర్ల రమేష్ బాబు ఇక్కడ నుంచి గెలిచారు.
వారసుడి కోసం :
ఇక బండారు సత్యనారాయణమూర్తి తన వారసుడు బండారు అప్పలనాయుడు కోసం పెందుర్తి సీటుని కోరుకుంటున్నారు. తమకు మొదటి నుంచి బలం ఉన్న ప్రాంతం రాజకీయ స్థావరం అయిన పెందుర్తి నుంచే కుమారిడిని రాజకీయ అరంగేట్రం చేయించాలని ఆయన చూస్తున్నారు. 2029 ఎన్నికల్లో తన వారసుడికి టికెట్ దక్కించుకుని తాను రాజకీయంగా విరమించుకోవాలని ఆయన చూస్తున్నారు. దాని కోసం ఆయన పెందుర్తి రాజకీయాల్లో తన వర్గాన్ని కాపాడుకుంటున్నారు. ఎక్కువగా ఆయన పెందుర్తి మీదనే ఫోకస్ పెడుతున్నారు. తరచూ అక్కడ ఆయన మకాం వేసి రాజకీయాలను తన కనుసన్నలలో జరిగేలా చూసుకుంటున్నారు అని ప్రచారం సాగుతోంది.
గండి కొడుతున్నది ఆయనే :
అయితే బండారుకు సొంత పార్టీలోనే ప్రత్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ఉన్నారు అని అంటున్నారు. ఆయన కూడా ఇదే సీటుని ఆశిస్తున్నారు. ఆయన 2014లో ఇదే సీటు నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. ఆ తరువాత ఆయన వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు. ఆయన 2019, 2024లలో రెండు సార్లూ ఇదే సీటు కోసం ప్రయత్నించి విఫలం అయ్యారు. ఇక తనకు 2029 ఎన్నికలు అత్యంత కీలకం అని ఆయన భావిస్తున్నారు. ఆయనను పార్టీ పెందుర్తి అసెంబ్లీ ఇంచార్జిగా నియమించింది. దాంతో పాటు నామినేటెడ్ పదవి కూడా కట్టబెట్టింది. దాంతో ఆయన తన వర్గాన్ని బలోపేతం చేసుకుంటున్నారు. ఈసారి సీటు తమకే అన్న ధీమా గండి బాబ్జీతో పాటు ఆయన వర్గం కూడా వ్యక్తం చేస్తోంది. దీంతో బండారు గండి బాబ్జీల మధ్య సొంత పార్టీలోనే వర్గ పోరు సాగుతోంది అని అంటున్నారు.
జనసేన అడ్డాగా :
ఇదిలా ఉంటే జనసేన కూడా ఎట్టి పరిస్థితిల్లోనూ ఈ సీటు వదులుకోకూడదని భావిస్తోంది. ఈ సీటుని ప్రజారాజ్యం పార్టీ సమయంలోనే తొలిసారి గెలుచుకున్నారు. ఇక 2024లో మళ్లీ జనసేన గెలిచింది. ఈ రెండు సార్లూ ఎమ్మెల్యే అయింది పంచకర్ల రమేష్ బాబు. ఆయన తన సొంత నియోజకవర్గంగా పెందుర్తిని చేసుకున్నారు. దాంతో వచ్చే ఎన్నికల్లో మరోసారి పోటీకి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. ఈ విధంగా చూస్తే టీడీపీ జనసేనల మధ్య అలాగే ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక మాజీ ఎమ్మెల్యే మధ్యన పెందుర్తి సీటు అయితే కూటమిలో పోటీగా మారింది అని అంటున్నారు. ఎవరి బలాలను వారు పరిరక్షించుకుంటూ ముందుకు సాగుతూండడంతో పెందుర్తి రాజకీయం రసకందాయంలో పడుతోంది. మరి 2029లో ఈ సీటు నుంచి ఏ పార్టీ పోటీ చేస్తుంది ఎవరు అభ్యర్ధిగా ఉంటారు అన్నది ఇప్పటికి అయితే ఒక చర్చగానే ఉంది.
