Begin typing your search above and press return to search.

బాలయ్య ఇలాకాలో సిట్టింగేసిన పెద్దిరెడ్డి... హ్యాట్రిక్ కి బ్రేకులేనా...?

హిందూపురంలో ద్వితీయ తృతీయ శ్రేణి క్యాడర్ తో మంత్రి పెద్దిరెడ్డి భేటీ అయి పార్టీ పరిస్థితితో పాటు టీడీపీ గురించి వాకబు చేశారని అంటున్నారు.

By:  Tupaki Desk   |   25 Aug 2023 5:20 PM GMT
బాలయ్య ఇలాకాలో సిట్టింగేసిన పెద్దిరెడ్డి... హ్యాట్రిక్ కి బ్రేకులేనా...?
X

వైసీపీ ఆ రెండు సీట్ల మీద కన్నేసింది. వై నాట్ 175 అంటూ వస్తోంది కూడా అందుకే. ఆ రెండు సీట్లను ఇప్పటిదాకా టీడీపీ తప్ప మరే పార్టీ గెలుచుకోలేదు. అవే మాజీ సీఎం చంద్రబాబు ఏడు సార్లు గెలిచి వస్తున్న కుప్పం, మరొకటి నందర్మూరి వంశీకులకు కట్టుబడిన సీటుగా ఉన్న హిందూపురం. ఇక్కడ నుంచి ఎన్టీయార్, హరిక్రిష్ణ గెలిచారు. బాలయ్య కూడా రెండు సార్లు గెలిచారు.

ముచ్చటగా మూడవసారి ఆయన గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. అయితే రాజకీయ మంత్రాంగంలో ఆరితేరిన మంత్రి, వైసీపీ రాయలసీమ రీజనల్ కో ఆర్డినేటర్ అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇపుడు బాలయ్య సొంత సీటు హిందూపురంలో సిట్టింగ్ వేశారు. అక్కడ రాజకీయాన్ని పూర్తిగా వైసీపీకి అనుకూలం చేయడానికి మంత్రి గారు హిందూపురంలో మకాం పెట్టారని అంటున్నారు.

హిందూపురంలో ద్వితీయ తృతీయ శ్రేణి క్యాడర్ తో మంత్రి పెద్దిరెడ్డి భేటీ అయి పార్టీ పరిస్థితితో పాటు టీడీపీ గురించి వాకబు చేశారని అంటున్నారు. ఆ తరువాత ఆయన 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిన నవీన్ నిశ్చల్ నింటికి వెళ్లారు. ఇక నవీన్ కి ఏపీ ఆగ్రోస్ ఛైర్మన్ చైర్మన్ పదవిని వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చారు.

అయితే వచ్చే ఎన్నికలలో ఆయన హిందూపురం నుంచి టికెట్ ఆశిస్తున్నారు. 2019లో ఇక్బాల్ కి టికెట్ ఇచ్చింది పార్టీ. నాడు కూడా అసంతృప్తిగానే పార్టీ కోసం ఆయన పనిచేశారు. ఇక ఇక్బాల్ కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అయితే ఆయన 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీకి తయారు అంటున్నారు.

మరో వైపు నిశ్చల్ కూడా రెడీ అంటున్నారు. ఇలా హిందూపురం వైసీపీలో రెండు గ్రూపులూ యాక్టివ్ గానే ఉన్నాయి. అయితే మధ్యే మార్గంగా మహిళా అభ్యర్ధిని దింపాలని వైసీపీ చూస్తోంది. దీపిక అనే మహిళకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తారని ప్రచారం సాగుతోంది. హిందూపురం ఏర్పడ్డాక ఇప్పటివరకూ మహిళ ఎవరూ ఎమ్మెల్యేగా గెలిచింది లేదు.

దాంతో నియోజకవర్గంలో యాభై శాతం పైగా ఉన్న మహిళా ఓట్లు కొల్లగొట్టడానికి సామాజిక న్యాయంతో పాటు ఇతర అంశాలను కూడా వాడుకోవడానికి వైసీపీ సిద్ధంగా ఉంది. అందుకే దీపిక పేరుని తెర మీదకు తెచ్చారని అంటున్నారు. దీపిక అభ్యర్ధి అయితే అటు నిశ్చల్, ఇటు ఇక్బాల్ వర్గాలు సహకరిస్తాయా అన్నది సందేహంగా ఉంది.

అందుకే పెద్దిరెడ్డి రెండు వర్గాలను ఒకటి చేయడం ద్వారా బాలయ్య బాబుకి హ్యాట్రిక్ లేకుండా చూడాలని పట్టుదలగా ఉన్నారని అంటున్నారు. బాలయ్య ఇటీవల కాలంలో వైసీపీ విమర్శల జోరు పెంచారు. దాంతో వైసీపీ ఆయనను టార్గెట్ చేసింది అని అంటున్నారు.

ఇదిలా ఉంటే మీడియాతో మాట్లాడిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే ఈసారి కుప్పం తో పాటు హిందూపురం వైసీపీ ఖాతాలో పడతాయని జోస్యం చెప్పారు. మేము సింగిల్ గా వస్తున్నామంటే మాకు ధైర్యం ఉంది, ప్రజల మద్దతు ఉంది అదే టీడీపీ అధినేత చంద్రబాబుకు మాత్రం పొత్తుల మీద తాపత్రయం ఉందని ఆయన ఒంటరి పోరుకు రెడీ కాలేరని ఎద్దేవా చేశారు. మొత్తానికి బాలయ్య ఇలాకాలో పెద్దిరెడ్డి బిగ్ సౌండ్ చేస్తునారు. హ్యాట్రిక్ విజయం బాలయ్యదేనా లేక వైసీపీ చెప్పినట్లుగా ఫస్ట్ టైం గెలిచి తీరుతుందా అన్నది వేచి చూడాల్సిందే.