Begin typing your search above and press return to search.

‘మావిగన్’ అందరికీ ఆమోదయోగ్యం.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాజధాని అమరావతికి బదులుగా మాజీ సీఎం జగన్మోహనరెడ్డి ప్రతిపాదించిన ‘మావిగన్’ వల్లే అభివృద్ధి సాధ్యమని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు.

By:  Tupaki Political Desk   |   8 July 2026 3:00 PM IST
‘మావిగన్’ అందరికీ ఆమోదయోగ్యం.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
X

రాజధాని అమరావతికి బదులుగా మాజీ సీఎం జగన్మోహనరెడ్డి ప్రతిపాదించిన ‘మావిగన్’ వల్లే అభివృద్ధి సాధ్యమని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన పెద్దిరెడ్డి రాజధాని అమరావతితోపాటు మావిగన్ పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మావిగన్ వల్ల వెనుకబడిన ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుందని పెద్దిరెడ్డి అన్నారు. అందుకే మావిగన్ ప్రతిపాదనకు తమ పార్టీ సంపూర్ణంగా ఆమోదిస్తుందని చెప్పారు. ప్రజలు కూడా మావిగన్ కు అనుకూలంగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో రాజధాని అమరావతిపైన మాజీ మంత్రి పెద్దిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డబ్బులు అన్నీ తెచ్చి నీళ్లలో పడేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజధానిగా అమరావతిని కేంద్రం గుర్తిస్తూ చట్టం చేసిన తర్వాత కూడా వైసీపీ నేతలు ‘మావిగన్’పై ప్రకటనలు చేస్తుండటం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. రాజధాని చట్టం చేసిన రోజే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మావిగన్ ప్రతిపాదన తెరపైకి తీసుకురాగా, వైసీపీ నేతలు అంతర్గతంగా భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారని చర్చ జరుగుతున్న సమయంలో సీనియర్ నేత పెద్దిరెడ్డి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారని అంటున్నారు.

మావిగన్ పై భిన్నాభిప్రాయాలు ఏవీ లేవని, పార్టీ నేతలు అంతా మావిగన్ ను ఆమోదిస్తున్నారని పెద్దిరెడ్డి వెల్లడించారు. దీంతో మావిగన్ విషయంలో వైసీపీ స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుందని స్పష్టమవుతోందని అంటున్నారు. కొద్దిరోజుల క్రితం మావిగన్ వర్సెస్ అమరావతి అన్న అజెండాతోనే ఎన్నికలకు వెళతామని మాజీ సీఎం జగన్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రకటనను బలపరుస్తూ సీనియర్ నేత పెద్దిరెడ్డి సైతం మావిగన్ పై మాట్లాడటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుందని అంటున్నారు.

వైసీపీలో సీనియర్లు సైతం రాజధాని అమరావతిని వ్యతిరేకిస్తున్నట్లు ఈ ప్రకటనతో స్పష్టమైందని అంటున్నారు. రాజధాని అమరావతిలో వేల కోట్ల రూపాయల పనులు జరుగుతుండగా, ఆ డబ్బు అంతా నీళ్లలో పోసేస్తున్నారని వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. అమరావతికి బదులుగా మూడు నగరాలతో కూడిన రాజధానికి తాము కట్టుబడినట్లు వైసీపీ చెబుతుండటంతో మరోసారి రాజధానిపై హాట్ టాపిక్ జరుగుతోంది. విపక్షం మావిగన్ అంటూ గట్టిగా మాట్లాడతుండటం వ్యూహాత్మర రాజకీయ ఎత్తుగడగా పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. వేల కోట్లు అప్పు తెచ్చి ప్రభుత్వం నిర్మాణాలు జరుగుతుండగా, ప్రైవేటు పెట్టుబడిదారులను గందరగోళానికి గురిచేసి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వైసీపీ మావిగన్ పై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోందని అంటున్నారు.