రెడ్డి గారి కుటుంబం సైలెంట్ వెనక ?
ఇదిలా ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నుంచి ఎమ్మెల్యేగా ఉంటే ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి తంబాళ్ళపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.
By: Satya P | 23 Feb 2026 9:26 AM ISTఏపీ రాజకీయాల్లో కీలకమైన కుటుంబంగా వారు ఉన్నారు. దశాబ్దాల రాజకీయ అనుభవం ఆ కుటుంబం సొంతం. జిలా స్థాయిలో రాజకీయంగా తమ ఆధిపత్యం చాటుకుంటూ వస్తున్నారు. ఆ కుటుంబమే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి ఫ్యామిలీది రాజకీయంగా కీలకమైనది. కాంగ్రెస్ లో మొదట ఆ తరువాత వైసీపీలో తమ హవా చాటుకుంటూ వచ్చారు. వైఎస్సార్ కి జగన్ కి అత్యంత సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నారు. ఇక వైసీపీలో వారు అగ్ర స్థానంలో ఉన్న నేతలుగా చెప్పుకుంటారు. జగన్ కోటరీలో అతి ముఖ్యులు అని అంటారు. అలాంటి రెడ్డి గారి కుటుంబం అయితే గత కొంతకాలంగా సైలెంట్ గా ఉంటోంది. దీని వెనక ఏమి జరిగింది, ఏమి అయి ఉంటుంది అన్నది చర్చగా ఉందిపుడు.
వైసీపీలో అలజడి రేగినా :
ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో వైసీపీలో తీవ్ర అలజడి రేగింది. ఒక విధంగా రాజకీయ ప్రకంపనలే పుట్టాయి. ఒకేసారి మాజీ మంత్రుల ఇళ్ల మీద దాడులు జరిగాయి. అందులో అంబటి రాంబాబు ఇంటి మీద అయితే గంటల తరబడి దాడి జరిగింది అని ఆయన వాపోయారు. ఆస్తులు ద్వంశమయ్యాయని కూడా చెప్పారు. జోగి రమేష్ ఇంటి మీద పెట్రో బాంబులతో దాడులు జరిగాయి. ఇక ఏపీలో చూస్తే లడ్డూ కల్తీ విషయంలో కూడా కూటమి వర్సెస్ వైసీపీ నేతల మీద డైలాగ్ వార్ ఒక స్థాయిలో జరుగుతోంది. మరి ఇంత జరుగుతున్నా పెద్దిరెడ్డి ఫ్యామిలీ అయితే పెదవి విప్పడం లేదు అని అంటున్నారు. ఒక విధంగా దీని మీద ఆశ్చర్యం వ్యక్తం చేసే వారు కూడా ఉన్నారు.
టార్గెట్ అయ్యారా :
ఇదిలా ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నుంచి ఎమ్మెల్యేగా ఉంటే ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి తంబాళ్ళపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి రాజం పేట నుంచి హ్యాట్రిక్ ఎంపీగా ఉన్నారు. లోక్ సభలో పార్టీ లీడర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. మరి వైసీపీలో ఇంత జరుగుతున్నా కీలకమైన నాయకులుగా ఉంటూ స్పందించకపోవడం మెద అంతా ఆలోచిస్తున్నారు. అయితే దీనికి అనేక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి లిక్కర్ స్కాం కేసులో ఆ మధ్యన జైలుకి వెళ్ళి ఏకంగా 45 రోజుల పాటు రాజమండ్రి లో ఉన్నారు. ఆ మీదట బెయిల్ మీద ఆయన విడుదల అయ్యారు. నాటి నుంచి ఆయన సైలెంట్ గానే ఉంటున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీ మీద అటవీ భూముల ఆక్రమణల ఆరోపణలు ఉన్నాయి. ఇక కూటమి పెద్దలు అయితే పెద్దిరెడ్డి ఫ్యామిలీని టార్గెట్ చేశారు అన్నది కూడా ఉంది. దీంతో ఎందుకైనా మంచిది అని మౌనమే పాటిస్తున్నారు అని అంటున్నారు.
బాబు సొంత జిల్లా :
మరో వైపు చంద్రబాబు సొంత జిల్లా కావడంతో పెద్దిరెడ్డి ఫ్యామిలీ మీద ఇంకా ఫోకస్ ఉందని అంటున్నారు. అదే విధంగా అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయన సైతం పెద్దిరెడ్డి ఫ్యామిలీ అటవీ భూముల ఆక్రమణ ఆరోపణల మీద సీరియస్ గానే ఉన్నారని అంటున్నారు. ఇరవై నెలల కూటమి పాలన పూర్తి అయింది చేతిలో ఇంకా నలభై నెలలు ఉంది. ఇప్పటి నుంచే సౌండ్ చేస్తే మరిన్ని ఇబ్బందులు వస్తాయని వ్యూహాత్మకంగానే ఇలా వ్యవహరిస్తున్నారని ఒక వెర్షన్ ఉంది. మరో వైపు చూస్తే వైసీపీ అధినాయకత్వం మీద అసంతృప్తితోనే గ్యాప్ వచ్చిందని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారాలలో ఏ మేరకు నిజం ఉందో.
