మంత్రి ఇలాకా: విశాఖలో ఏం జరుగుతోంది?
దీంతో పాయకరావుపేటలో టీడీపీ తరఫున పెద్దగా కార్యక్రమాలు కూడా నిర్వహించడం లేదు.
By: Tupaki Desk | 19 July 2025 10:00 PM ISTరాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత సొంత జిల్లా విశాఖ. మరి ఇక్కడ రాజకీయంగా ఎలాంటి పరిస్థితి నెలకొంది..? ముఖ్యంగా ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట రాజకీయాలు ఎలా ఉన్నాయి? వంటి అంశాలు ఆసక్తిగా మారాయి. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం.. పాయకరావుపేటలో వన్ మ్యాన్ షోనే నడుస్తోంది. అంటే.. పార్టీ తరఫున బలమైన గళాలు ఉన్నప్పటికీ.. పాయకరావు పేట నియోజకవర్గం లో ఎవరూ ముందుకు రావడం లేదు. ఏం చేయాలన్నా మంత్రిగారి అనుమతి తప్పనిసరి అని టాక్.
దీంతో పాయకరావుపేటలో టీడీపీ తరఫున పెద్దగా కార్యక్రమాలు కూడా నిర్వహించడం లేదు. ఏం చేయాలన్నా.. మంత్రి ఆఫీసులో అనుమతి తీసుకోవాల్సి వస్తోందని.. అంత అవసరం కూడా తమకు లేదని స్థానిక నాయకులు తెగేసి చెబుతున్నారు అని అంటున్నారు. ఇక, అధికారుల తీరు కూడా ఇలానే ఉంది. మంత్రి గారి కనసన్న ల్లో ఉన్న కొద్దిమంది చెబుతున్న పనులకు మాత్రమే ప్రాధాన్యం లభిస్తోందని అంటున్నారు. సాధారణంగా మంత్రిగా ఉన్నవారికి జిల్లాపై పట్టు ఉండడం తప్పుకాదు.
కానీ, ఆ 'పట్టు'కోసమని.. ఇతర నాయకులను, లేదా పార్టీ వ్యవస్థలను పక్కన పెట్టేలా వ్యవహరించడం మాత్రం వివాదానికి దారితీస్తోంది. ఇది సరైన విధానం కాదని.. పొరుగు నియోజకవర్గాలకు చెందిన నాయ కులు కూడా అభిప్రాయపడుతున్నారు. కానీ, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఆశీస్సులు పుష్క లంగా ఉండడంతో మంత్రిమాటే ఇక్కడ వినిపిస్తోందని పార్టీవర్గాలే చెబుతున్నాయి. ఇక, వైసీపీ విషయా నికి వస్తే.. ఇతర నియోజకవర్గాల్లో ఉన్న దూకుడు ఇక్కడ లేదు. కనీసం.. వైసీపీ తరఫున వాయిస్ వినిపించే నాయకులు కూడా లేరు.
దీని కి కూడా కొన్ని కారణాలు ఉన్నాయన్నది పొలిటికల్‌గా వినిపిస్తున్న మాట. తమకు పనులు అయిపోతున్నాయని.. ఇప్పుడు చెడు చేసుకోవడం ఎందుకన్నది వారి వాదనగా ఉంది. ఈ క్రమంలోనే నాయకులు.. మౌనంగా ఉన్నారు. ఎన్నికల సమయానికి చూసుకోవచ్చన్నది వారి ఆలోచనగా ఉంది. అంటే.. ఇటు వైసీపీ సైలెంట్. అటు టీడీపీలో ఉన్న నాయకులు కూడా మంత్రివర్గంలో ఉన్నవారు మాత్రమే మీడియా ముందుకు వస్తున్నారు. లేని వారు సైలెంట్‌గా ఉన్నారు. దీంతో రాజకీయంగా విశాఖ జిల్లాలో మంత్రి మాటే వినిపిస్తోందని పరిశీలకులు సైతం చెబుతున్నారు.
