Begin typing your search above and press return to search.

"పవర్" మాటల వెనుక ప్రధాని పీఠంపై కన్ను?

పవార్ వంటి సీనియర్ నాయకులు చేసే వ్యాఖ్యలను తేలిగ్గా కొట్టిపారేయలేం. ఓ విధంగా తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిత్వానికి అడ్డంకిగానూ భావించవచ్చు.

By:  Tupaki Desk   |   28 Dec 2023 7:54 AM GMT
పవర్ మాటల వెనుక ప్రధాని పీఠంపై కన్ను?
X

మరొక్క నాలుగు నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాని మోదీ సారథ్యంలోని బీజేపీ ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టింది. ఎన్డీఏ రూపంలో ఆ పార్టీ ఇప్పటికే కూటమితో ఉంది. అయితే, ప్రతిపక్షాలు మాత్రం ఇంకా కూటమి బాలారిష్ఠాల్లో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్రతో "ఇండియా" కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించింది. అయితే, రాష్ట్రాల్లో ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న పార్టీలు ఈ కూటిమిలో భాగస్వాములు కావడం పెద్ద చిక్కుతెచ్చి పెడుతోంది. ఉదాహరణకు కేరళలో అధికారం సీపీఎంతో తలపడుతోంది కాంగ్రెస్. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ టీఎంసీకి సీపీఎం ప్రధాన ప్రత్యర్థి. ఈ అభిప్రాయ బేధాలనువదిలేస్తే.. ఇండియా కూటమి "ప్రధాని" అభ్యర్థి ఎవరనేది సందేహం కలుగుతోంది. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీనే ప్రధాని అభ్యర్థిగా సరైనవారు అని మెజారిటీ ప్రజలు, ఇండియా కూటమిలోని చిన్న పార్టీలు భావిస్తున్నా.. పెద్ద పార్టీలు మాత్రం ఒప్పుకొనేలా లేవు. సరిగ్గా ఈ పాయింట్ నే పట్టుకున్న ప్రధాని మోదీ.. బీజేపీ మళ్లీ గెలిస్తే ప్రధాని తానేనని ప్రకటిస్తూ ప్రతిపక్షాలకు సవాల్ విసురుతున్నారు.

1977లో ఏం జరిగిదో చెప్పిన పవార్

కాలం కలిసి వస్తే ఇండియా కూటమి గెలిస్తే ప్రధాని కావాలనేది నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ కల. సోనియా గాంధీ విదేశీయతను ప్రశ్నిస్తూ 1999లో బయటకు వచ్చిన పవార్.. మళ్లీ అదే కాంగ్రెస్ పార్టీతో మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం. అలాంటి పవార్ జీవితాశయం ప్రధాని కావడం. కానీ, అది నెరవేరలేదు. ఇప్పుడు జీవిత చరమాంకంలో "పవర్ ఆశలు" పెట్టుకున్నారాయన. కానీ, ఇండియా కూటమిలోని పార్టీలన్నీ అందుకు అంగీకరిస్తాయా? అనేదే ప్రశ్నం. ఈ నేపథ్యంలోనే 1977లో జరిగిన ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిని ప్రకటించకుండానే పోరాడామని, విజయం సాధించామని, ఆ తరవాతే మొరార్జీ దేశాయ్‌ ను ప్రధానిగా ఎన్నుకున్నామని శరద్‌ పవార్‌ వ్యాఖ్యానించారు. ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిపై చర్చ వేళ ఆయన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.

ఆ వ్యాఖ్యల అర్థం అంతరార్థం అదే..

పవార్ వంటి సీనియర్ నాయకులు చేసే వ్యాఖ్యలను తేలిగ్గా కొట్టిపారేయలేం. ఓ విధంగా తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిత్వానికి అడ్డంకిగానూ భావించవచ్చు. ప్రధాని ఎవరో తర్వాత తేలుద్దాం.. ముందు కలిసి పోరాడదాం అనే విధంగానూ చూడొచ్చు. రాహుల్ ప్రధాని అభ్యర్థిగా ఫోకస్ అయి.. ఇండియా కూటమికి మెజారీటీ సీట్లు దక్కితే పవార్ కు దేశ అత్యున్నత పీఠం అందనట్లే. అందుకే ముందుజాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది.