Begin typing your search above and press return to search.

అవనిగడ్డ సభలో పవన్ ప్రసంగాన్ని విన్నారా?

ఎప్పటిలానే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనను తీవ్రంగా తప్పు పట్టిన ఆయన.. తన ఆగ్రహాన్ని యథావిధిగా ప్రదర్శించారు.

By:  Tupaki Desk   |   2 Oct 2023 4:19 AM GMT
అవనిగడ్డ సభలో పవన్ ప్రసంగాన్ని విన్నారా?
X

వారాహి విజయయాత్రలో భాగంగా అవనిగడ్డలో నిర్వహించిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఎప్పటిలానే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనను తీవ్రంగా తప్పు పట్టిన ఆయన.. తన ఆగ్రహాన్ని యథావిధిగా ప్రదర్శించారు. కాకుంటే.. గతంలో తాను ఒక్కడే టార్గెట్ చేసినట్లుగా మాట్లాడే ఆయన.. తాజాగా మాత్రం పొత్తుకు తగ్గట్లు.. టీడీపీ ప్రస్తావన తీసుకొస్తూ మాట్లాడారు. జగన్ మీద పోరు చేసేందుకు తమ రెండు పార్టీలు పని చేస్తాయన్న విషయాన్ని పదే పదే ప్రస్తావించటం కనిపించింది.

"ప్రజల దాహం తీర్చే గ్లాసు.. ఆ ప్రజల్ని గమ్యం చేర్చే సైకిల్ ఒక్కటయ్యాయి. కరెంటు ఛార్జీల దెబ్బకు ఫ్యాన్ తిరగటం ఆగిపోయింది. రాష్ట్ర అభివృద్ధి ఆ ఆగిపోయిన ఫ్యానుకు ఉరి వేసుకుంది. రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న వైసీపీ మహమ్మారికి జనసేన- తెలుగుదేశం పార్టీలే వ్యాక్సిన్ గా పని చేస్తాయి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం జనసేన, తెలుగుదేశం కూటమిని ప్రజలు ఆశీర్వదించాలి" అని వ్యాఖ్యానించారు. ఆయన ప్రసంగం మొత్తాన్ని ఒక్క లైన్ లో చెప్పాలంటే.. మూడు పొత్తు ముచ్చట్లు.. ఆరు అధికార పార్టీని తిట్లు తిట్టటంగా సాగింది. పవన్ ప్రసంగంలోని ముఖ్యాంశాల్ని చూస్తే..

- ఆలయాలను కూల్చేసే వైసీపీ మహమ్మారికి... పురోహితులను వేలం వేసే వైసీపీ మహమ్మారికి... రైతాంగాన్ని కన్నీరు పెట్టిస్తోన్న వైసీపీ మహమ్మారికి.. నిరుద్యోగులను నిలువునా ముంచేసిన వైసీపీ మహమ్మారిని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలి.

- రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం జనసేన – తెలుగుదేశం పార్టీ కలిసి ఎన్నికలకు వెళ్తాయి. సంకీర్ణ ప్రభుత్వం స్థాపించి తీరుతాం. జగన్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు. 175కు 175 గెలుస్తామని మాట్లాడుతున్నాడు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు 15 సీట్లు వస్తే గొప్ప.

- రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ కూడా బింకాలు పలికేవాడు. యుద్ధంలో జర్మనీ గెలుస్తుందని చివరి వరకు ప్రజలను నమ్మించాడు. ప్రత్యర్థి దేశాల దళాలు బెర్లిన్ చేరుకోగానే బంకర్లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. 2024లో జగన్ పరిస్థితి కూడా అంతే.

- వచ్చే ఎన్నికలను కురక్షేత్ర యుద్ధంతో ముఖ్యమంత్రి పోలుస్తున్నాడు. మీరు కురుక్షేత్రంలో కౌరవులో, పాండవులో తేల్చుకోండి. 151 మంది మీరున్నారు కాబట్టి కచ్చితంగా వైసీపీ వారే కౌరవులే అని నేను భావిస్తాను.

- అలా కాకుండా జగన్ - కింగ్ జేమ్స్ బైబిల్ ను నమ్మితే ఒక విషయం గుర్తు చేస్తాను. "డేవిడ్ అండ్ గొలాయక్" కథలోని అహంకారపూరితమైన గొలాయక్ - 14 ఏళ్ల గొర్రెల కాపరి డేవిడ్ చేతిలో ఎలా చనిపోయాడో గుర్తుంచుకుంటే మంచిది. జగన్ ఏ కథ తీసుకున్నా పర్వాలేదు.. దానిలో ఓడిపోయే క్యారెక్టర్ మాత్రం జగన్ దే.

- మీరు ఎన్ని కుయుక్తులు, పన్నాగాలు పన్నినా వైసీపీ వచ్చే ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయం. జగన్ గద్దె దిగడం డబుల్ ఖాయం. నిరుద్యోగులకు వచ్చే కొత్త ప్రభుత్వంలో న్యాయం జరగడం త్రిబుల్ ఖాయం.

- అవనిగడ్డ ప్రాంతం ఒకప్పుడు డీఎస్సీకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు వేదికగా ఉండేది. ఇక్కడ ఉండే సుమారు 80 నుంచి 100 శిక్షణ కేంద్రాలు అభ్యర్థులతో కళకళలాడేవి. ప్రస్తుతం డీఎస్సీ అభ్యర్థుల వేదన చూస్తే బాధగా ఉంది. 2018 నుంచి డీఎస్సీ నోటిఫికేషన్ లేదు. అదిగో ఇదిగో అంటూ రకరకాల మాయమాటలు చెబుతూ యువత జీవితాలతో వైసీపీ ప్రభుత్వం ఆటలాడుతోంది.

- 50 వేల ఉద్యోగాలు ఖాళీలున్నాయని అభ్యర్థులు చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాఠశాలల విలీనం పేరుతో రకరకాల ప్రయోగాలు చేశారు తప్పితే డీఎస్సీ ద్వారా ఒక్క ఉపాధ్యాయుడినీ నియమించలేదు. డీఎస్సీ కోసం ఎన్నో కలలు కన్న యువతకు వయసు మీరిపోతోంది.

- 2018 పాదయాత్రలో ప్రభుత్వం రాగానే మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ వేస్తామని చెప్పిన పెద్ద మనిషి ఆ ఊసే ఎత్తడం లేదు. పాదయాత్రలో నోటికొచ్చిన ప్రతి హామీని ఇచ్చారు. మెగా డీఎస్సీ దగ్గర నుంచి మద్యపాన నిషేధం వరకు ఏది నోటికొస్తే అది చెప్పారు. మాట చెప్పడం చాలా తేలిక. దానిని నిలబెట్టుకోవడం కష్టం. నేను మాటిస్తే తల తెగినా మళ్లీ వెనక్కు వెళ్లను.

- ప్రజల కోసమే లక్ష కోట్ల రూపాయలు దండుకున్న వ్యక్తితో, ప్రైవేటు సైన్యం కలిగిన మనిషితో, తరాలుగా రాజకీయం చేస్తున్న కుటుంబంలోని వారితో గొడవ పెట్టుకుంటున్నాను. ఓ సామాన్యుడిగా కేవలం ప్రజాబలంతోనే పోరాడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా చెబుతున్నా... నేను నిరుద్యోగులకు అండగా నిలబడతాను.

- పార్టీని మొదలు పెట్టి దశాబ్ద కాలం కావొస్తోంది. ఎప్పుడూ ప్రజల క్షేమం కోసమే ఆలోచించాను తప్పితే పదవులు, అధికార వ్యామోహం లేదు. 2014లో టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చాం. తర్వాత రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం మీద నన్ను ఎంతగానో ఇష్టపడే ప్రధాని నరేంద్ర మోదీతోనే విభేధించి బయటకు వచ్చాను.

- అప్పట్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజీకి టీడీపీ ఒప్పుకున్న కారణంతోనే ఆ పార్టీతోనూ చెలిమి వద్దని అనుకున్నాను. నా రాజకీయ ప్రయాణంలో మొదటి ప్రాధాన్యం ప్రజల మేలే తప్ప మరేదీ కాదు. ప్రజలకు అన్యాయం జరిగే విషయాల్లో జనసేన పార్టీ కచ్చితంగా వారికి అండగా నిలుస్తుంది.

- 10 ఏళ్ల రాజకీయ పోరాటంలో రెండు ఎన్నికలను చూశాను. గొప్ప ఆశయంతో ఎన్నికల్లో నిలబడి, రెండు చోట్లా ఓటమి పొందినపుడు వేదన అనుభవించాను. ఓటమిని దిగ మింగి మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వచ్చాను. ఎన్నో బెదిరింపులు, అదిలింపులు వచ్చినా ఏ మాత్రం పట్టించుకోకుండా రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలనే అంతిమ లక్ష్య సాధన దిశగా ముందుకు వెళ్తున్నా. ఎప్పటికీ ప్రజలంతా బాగుండాలి.. నా నేల వేవేల ఉషస్సులతో విరాజిల్లాలి అని కోరుకుంటాను.

- నేను ఓటు చీలకూడదు అని చెబుతున్నాను అంటే దానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. సామాన్యుడికి అయిదేళ్ల కాలం ఎంతో విలువైంది. అతడి కలలు, భవిష్యత్తును నిర్దేశించేది. కానిస్టేబుల్ పరీక్షల్లో 8 ప్రశ్నలు తప్పుగా వచ్చాయని కోర్టుకు వెళితే ప్రభుత్వం నుంచి స్పందన లేదు... దేహదారుఢ్య పరీక్షల తరవాత మెయిన్స్ రాత పరీక్షకు కేవలం 15 రోజుల సమయం ఇచ్చారని, మాకు కనీసం 2 నెలల సమయం కేటాయించాలని యువత కోరుతుంటే ప్రభుత్వం పట్టించుకోదు. డీఎస్సీ అభ్యర్థులు తమ వయసు అయిపోతోందని, నోటిఫికేషన్ విడుదల చేయాలని గొంతెత్తి అడుగుతున్నా ఎవరూ స్పందించరు.

- ఇలాంటి ఎన్నో ప్రజా సమస్యలపై చట్ట సభల్లో గళమెత్తాలంటే మనం గత ఎన్నికల్లో ఓడిపోయాం. నేను ఒక్కడిని సభకు వెళ్లినా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేవాడిని. పని చేయించవాడిని. ఇలాంటి ఎన్నో సమస్యలపై ఇప్పుడున్న ప్రజా ప్రతినిధులు మాట్లాడరు. వారికి ఇవన్నీ బుర్రకు ఎక్కవు.

- అందుకే మరో అయిదేళ్ల కాలాన్ని వృథా చేయకుండా, ప్రజల ఓటు చీలకుండా సుస్థిరమైన ప్రజా ప్రభుత్వం రావాలనే ఆలోచనతోనే నేను ప్రతిసారీ ఓటు చీలకూడదు అని చెబుతాను. ఈ సారి ఓటు చీలకుండా జనసేన-తెలుగుదేశం పార్టీల ప్రజా ప్రభుత్వం ఏర్పడితే అన్నీ సమస్యలను తీర్చే బాధ్యతను తీసుకుంటాను.

- వైసీపీ పతనం ఇప్పటికే మొదలైంది. వైసీపీని గద్దె దింపడమే జనసేన లక్ష్యం. జగన్ కు ఒక్క ఛాన్స్ అని నమ్మిన పాపానికి రాష్ట్ర ప్రజలు ఎలా బాధపడుతున్నారో అర్ధం అవుతోంది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మరోసారి తప్పు చేయరని భావిస్తున్నాను. ఒక్కసారి వైసీపీకి అధికారం ఇస్తే రాష్ట్రం ఎంత వెనక్కు వెళ్లిపోయిందో ప్రజలు అర్ధం చేసుకుంటున్నారు.

- రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా పడకేసింది. దున్నపోతు ఈనింది మరచెంబు తీసుకురండి అన్నట్లు అభివృద్ధి విషయంలో వైసీపీ నేతలు హడావుడి చేస్తున్నారు. వైసీపీ పాలన బాగుంటే, అభివృద్ధిలో ఆంధ్రా పరుగులు తీస్తుంటే నాలుగో విడత వారాహి విజయ యాత్ర మొదలవుతోంది అని తెలియగానే ఇంతమంది ఎందుకు వస్తారు?

- అంతా బాగుంటే నేను రోడ్ల మీద తీరగాల్సిన అవసరం ఉండేది కాదు. అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టేసి, సంక్షేమం అంటూ రాష్ట్రాన్ని అప్పుల్లో నెట్టేస్తున్న వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి భవిష్యత్తు లేకుండా చేస్తోంది. జగన్ మీద వేసిన ఛార్జిషీట్లలోనే ఆయన చేసిన అవినీతి రూ.18 వేల కోట్లుగా తేలింది. అయినా ఇసుక అమ్మేస్తాం.. వనరులు దోచేస్తాం అంటూ రకరకాలుగా డబ్బు దండుకుంటున్నారు.

- ప్రజామోదంతో ఎన్నికైన ప్రభుత్వానికి గౌరవం ఇవ్వాలనే కోణంతో రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను ప్రధాని మోదీకి నేను చెప్పలేదు. ఎవరి దగ్గరా డబ్బు ఉండకూడదు. నా సినిమాలు ఆపేస్తే నేను ఆగిపోతాను.. నా సినిమా టిక్కెట్ రేట్లను తగ్గిస్తే నేను వెనకడుగు వేస్తాను అని జగన్ ఆలోచిస్తాడు.

- తనని వ్యతిరేకించే వారి ఎవరి వద్ద డబ్బు ఉండకూడదు. ప్రశ్నించకూడదు. ఇవన్ని ప్రధాని వద్ద ప్రస్తావించాలనుకున్నా. కాని మా నేల మీద మా సమస్యపై మేమే పోరాడాలని ఏ విషయాన్ని చెప్పలేదు. నా రాష్ట్రంలోకి నేను రాకుండా సరిహద్దుల వద్ద ఆపుతారు. రాష్ట్రంలోకి వస్తే అరెస్టు చేస్తామని బెదిరిస్తారు. అసలు ఏం అధికారం ఉంది వీళ్లకు.. రాష్ట్రంలోకి రానీయకుండా అడ్డుకోవడానికి అని అడిగాను.

- ప్రజాస్వామ్యం ఔన్నత్యాన్ని తెలుసుకునే వారే దాని విలువలను కాపాడుతారు. అధికారం ఉంటే ప్రజలకు బాస్ కారు.. ఇది ప్రజల కోసం, ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వం. ఇక్కడే వారే ప్రభువులు. దీన్ని గుర్తుంచుకోవాలి. ఉన్నత ఆశయంతో రాజకీయం చేయగలను. ప్రాక్టికల్ రాజకీయాలు చేయగలను.

- ఓట్లు కొనడానికి నా దగ్గర డబ్బు లేదు. నా నైతికత దానికి ఒప్పుకోదు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కేవలం తమ భవిష్యత్తు గురించి ఆలోచించండి. సరైన వారెవరో వారిని ఎన్నుకోకండి. ప్రలోభాలకు లొంగిపోకుండా రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలనే బలమైన సంకల్పంతో ఓటు వేయండి.

- ప్యాకేజీ ప్యాకేజీ అని మొరిగే కుక్కలకు, సన్నాసులకు నేను చెప్పేది ఒక్కటే. నేను నా ఆత్మగౌరవం, నైతిక బలం నమ్ముకొని రాజకీయాల్లోకి వచ్చాను. నాకు రూ.కోటి రెమ్యునరేషన్ ఉన్నపుడే మాదాపూర్ లో ఎకరం రూ.5 లక్షలు ఉండేది. డబ్బులు దాచుకోవాలి... స్థలాలు కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉంటే అప్పట్లోనే మేల్కొని ఎంతో సంపాదించేవాడిని.

- నాకు డబ్బు మీద వ్యామోహం, ఆపేక్ష లేదు. మొదటి నుంచి నాకు పదిమంది బాగుండాలి... అందరి మొహంలో చిరునవ్వు కనిపించాలి అనే ధ్యాస తప్ప మరేమీ లేదు. నాకు ప్రజల కళ్లలో ఆనందం చూడాలన్న ఆపేక్ష తప్ప... డబ్బు మీద ఆపేక్ష ఎన్నడూ లేదు.. ఇక మీదటా రాదు.

- వైసీపీ వాళ్లకు మాత్రం పచ్చ కామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపించినట్లుగా వారికున్న డబ్బు జబ్బు అందరికీ ఉన్నట్లు కనిపిస్తుంది. నా నైతిక బలమే నా వెన్నెముక. నా ఆత్మగౌరవమే సమున్నత ఆశయ ప్రతీక.

- మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వచ్చినప్పటి పరిస్థితులు వేరు. అవి నేటి కాలంలో లేవు.. మళ్లీ రావు. అప్పట్లో కాంగ్రెస్ కు దీటుగా ప్రత్యామ్నాయంగా ప్రజల్లోకి తెలుగుదేశం పార్టీ వచ్చింది. రాజకీయాల్లోకి కొత్త వ్యక్తుల ప్రవేశం, అధికారానికి దూరంగా ఉన్న బీసీ కులాలను కలుపుకు వెళ్లే విధానం, అంతగా విస్తరించని ప్రచార మాధ్యమాలు అప్పట్లో టీడీపీ ఘన విజయానికి కారణాలు.

- అప్పట్లో ఎన్టీఆర్ కి కుదిరిన విధంగా మళ్లీ ఎవరికి కుదరలేదు. నేను కూడా కేవలం ప్రజా ఆకర్షణను నమ్ముకొని రాజకీయాల్లోకి రాలేదు. ఓ బలమైన మార్పు రావాలంటే కచ్చితంగా రెండు దశాబ్ధాల ప్రయాణం చేయాలని భావించి రాజకీయాల్లోకి వచ్చాను. కచ్చితంగా ప్రజల ఆలోచన విధానం మారి, వారి నమ్మకం సాధించాలనే లక్ష్యంతోనే ప్రయాణం మొదలుపెట్టాను. జనసేన పార్టీ కచ్చితంగా అనుకున్న లక్ష్యం సాధిస్తుంది. ప్రజలకు సుపరిపాలన అందించడానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉంది.

- ప్రభుత్వం ఇటీవల చేయించిన గ్రాస్ ఎనరోల్మెంట్ రేషియో సర్వేపై శ్వేతపత్రం విడుదల చేసి, దానిలోని లెక్కలపై ప్రజలకు సమాధానం చెప్పాలి. సర్వే ప్రకారం రాష్ట్రం నుంచి 3,17,259 కుటుంబాలు వలస వెళ్లిపోయినట్లు గుర్తించారు. కర్నూలు, తూర్పుగోదావరి జిల్లాల నుంచి అధికంగా వలసలు వెళ్లినట్లు తేలింది.

- అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 1 నుంచి 18 సంవత్సరాల పిల్లల్లో 62,754 మంది మృతి చెందారని లెక్కలు బయట పెట్టారు. వారి మరణానికి గల కారణాలు ఏమిటి..? వాటి నివారణకు ఏం చర్యలు తీసుకున్నారో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది.

- ప్రభుత్వ పాఠశాలల్లో అద్భుతాలు చేస్తున్నామని, బైజూస్ బత్తాయి జ్యూస్ అంటూ కథలు చెబుతున్న ప్రభుత్వం బడుల నుంచి 3.88 లక్షల మంది పిల్లలు ఎందుకు డ్రాప్ అవుట్ అయ్యారో కూడా వివరించాలి. దానికి గల కారణాలపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి.

- అవనిగడ్డ నియోజకవర్గంలో 60 శాతం భూభాగం కృష్ణానది పరివాహకప్రాంతలో ఉంది. పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండాల్సిన ఈ ప్రాంతం ఉద్ధానం తరహా కిడ్నీ వ్యాధులకు అడ్డాగా మారిపోయింది. 86 ప్రాంతాల్లో ఫ్లొరైడ్ సమస్య ఎక్కువగా ఉంది. 4.5 లక్షల ఇళ్లకు రక్షిత మంచినీరు అందించే కుళాయి కనెక్షన్లు లేవు. దీంతో కిడ్నీ వ్యాధులు పెరిగిపోతున్నాయి. దీంతో పాటు స్వచ్ఛమైన తాగునీరు లభించక చర్మ వ్యాధులు, ఎముకలకు సంబంధించిన వ్యాధులు వేధిస్తున్నాయి. వీటి గురించి ఈ ప్రాంత ప్రజాప్రతినిధి ఒక్కరు కూడా మాట్లాడారు.

- నేను మాట్లాడితే నన్ను వ్యక్తిగతంగా దూషిస్తారు. వాలంటీర్ వ్యవస్థలో ఉన్న లోపాలపై మాట్లాడితే నామీద కేసులు పెడతా అని మాట్లాడుతున్నారు. సంతోషంగా పెట్టుకోవచ్చు. ఒక తప్పు జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండే వాళ్లం కాదు. మేము భగత్ సింగ్ వారసులం. తప్పు జరిగితే తప్పు అని కచ్చితంగా చెబుతాం. దేశభక్తుడి రాజకీయం ఎలా ఉంటుందో జగన్ కు తెలియదు. కచ్చితంగా మా దెబ్బ రుచి చూపిస్తాం.

- కృష్ణానది పరివాహక ప్రాంతం వైసీపీ నాయకుల అడ్డగోలు ఇసుక దందాకు నిలయంగా మారిపోయింది. రేయింబవళ్లు తేడా లేకుండా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఈ నాలుగున్నరేళ్లలో ఒక్క కృష్ణా పరివాహక ప్రాంతంలోనే ఇసుక గుంతల్లో పడి దాదాపు 76 మంది ప్రాణాలు కోల్పోయారు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. నేను ఒక్కడినైనా అసెంబ్లీలో ఉండి ఉంటే దీనిపై కచ్చితంగా నిలదీసేవాడిని.

- జగన్ ను కూడా ప్రజలు అంత గుడ్డిగా నమ్మలేదు. పదేళ్లు ప్రజల్లో ఉన్నాడు. ముద్దులు పెట్టాడు. మాయమాటలు చెప్పాడు. దేవుడై పాలిస్తాడు అనుకుంటే దెయ్యమై పట్టి పీడిస్తున్నాడు.

- అధికార పార్టీ నాయకులు ఎలా మాట్లాడినా పర్వాలేదు. ఎవరిని బూతులు తిట్టినా చెల్లుబాటు అవుతుంది. అదే ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే మాత్రం బెదిరిస్తారు, భయపెడతారు. అవసరమైతే అరెస్టులు కూడా చేస్తారు. ఇటీవల తమ అభిప్రాయం చెప్పినందుకు, మాకు మద్దతుగా మాట్లాడినందుకు ముగ్గురు యూట్యూబర్లను అరెస్టు చేశారు.

- కొంతమంది గుర్తు తెలియని దుండగులు ఆంజనేయస్వామి విగ్రహం చేయి విరిచేస్తే.. ఆంజనేయుడికి పోయేదేముంది అని ఒక వైసీపీ నాయకుడు నిర్లక్ష్యంగా మాట్లాడతాడు. విజయవాడ కనకదుర్గమ్మ రథం వెండి సింహాలు దొంగలించారు అంటే వాటితో మేడలు, మిద్దెలు కడతామా? అని వ్యంగ్యంగా మాట్లాడుతారు.

- యూట్యూబర్లు మాత్రం వారి అభిప్రాయం చెప్పకూడదు. సరైన నాయకులను ఎన్నుకోకపోతే వచ్చే సమస్య ఇదే. పింగళి వెంకయ్య వంటి మహానుభావులు పుట్టిన ఈ ప్రాంతంలో నోరేసుకొని పడిపోయేవాడు గొప్ప ఎమ్మెల్యే. ఇలాంటి దుష్టులను ఎదుర్కొవాలి అంటే సమష్టిగానే పోరాడాలి.

- పవన్ కళ్యాణ్ మాట్లాడితే కులం కులం అని మాట్లాడతాడు అని కొంతమంది మాట్లాడుతున్నారు. నేను వాళ్లకు చెప్పేది ఒక్కటే. నా దృష్టిలో కులం కంటే మానవత్వం గొప్పది. వ్యక్తిలోని ప్రతిభ, సమర్ధతను ఇష్టపడతాను తప్ప కులాన్ని చూసి ఏనాడు ఇష్టపడలేదు.

- నాకు చిన్ననాటి నుంచి తెలిసిన నా స్నేహితుడు ఆనంద్ సాయి.. విశ్వకర్మ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి అని యాదాద్రి నిర్మించే వరకు నాకు తెలియదు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా నన్ను అభిమానించే అభిమానులు ఉన్నారు. రెల్లి కులంలో అన్నా అని అప్యాయంగా పిలిచే వారు ఉన్నారు. అండగా నిలబడి గుండెలకు హత్తుకునే మత్య్సకారులు ఉన్నారు.

- నేను ఏనాడు జగన్ లా ఒక కులానికి కొమ్ము కాయను. కీలక పదవులను ఒక్క సామాజికవర్గంలో నింపేయను. వచ్చే ప్రభుత్వంలో అన్ని సామాజికవర్గాలకు పెద్దపీట వేసేలా జనసేన చూసుకుంటుంది. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన పొరపాటు ఎన్నడు జరగకుండా చూసుకుంటుంది.

- నన్ను తిట్టించాలంటే వైసీపీలో ఉన్న కాపులు, బీసీ, ఎస్సీ, ఎస్టీలతో తిట్టిస్తున్నారు. ఇలాంటి పిల్ల వేషాలు జగన్ మానుకుంటే మంచిది. నన్ను తిట్టేవాడిని వ్యక్తిగా చూస్తాను తప్ప కులాన్ని చూడను. ఇలాంటి చచ్చు పనులు జగన్ మానుకుంటే మంచిది. నీకు సలహాలు ఇచ్చే వారినైనా మార్చు.

- వైఎస్ఆర్ పట్టువిడుపు ఉన్న రాజకీయ నాయకుడు. జగన్ కు అవి లేవు. మా వాడు బలవంతుడు.. మొండివాడు అని వైసీపీ నాయకులు అనుకోవచ్చు. వాళ్లు తెలుసుకోవాల్సింది అది ధైర్యం కాదు పిచ్చి. వైసీపీ నాయకులు మా నాయకులను తిట్టబోయే ముందు, కేసులు పెట్టబోయే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి.

- జగన్ ఉన్నాడని ఈ రోజు రెచ్చిపోతే రేపు మళ్లీ మిమ్మల్ని జనసేన పార్టీయే రక్షించాలి. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే మన ఆస్తులను దోచుకుంటారు. చిన్నస్థాయి వార్డు మెంబర్ కూడా మనల్ని బ్లాక్ మెయిల్ చేసి ఆస్తులు కాజేస్తాడు. ఏదైనా ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒరిజినల్స్ ప్రభుత్వం దగ్గర ఉంచాలి అంటా? మన ఆస్తి పేపర్లు ప్రభుత్వం దగ్గర ఎందుకు ఉంచాలి?

- వచ్చే సార్వత్రిక ఎన్నికలు వైసీపీని ఇంటికి పంపించడమే జనసేన- తెలుగుదేశం పార్టీల ప్రధాన కర్తవ్యం. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే. చంద్రబాబుపై పెట్టిన కేసుల్లో ఆయన నిర్దోషిగా బయటకు వస్తారని ఆశిస్తున్నాను. రాష్ట్ర అభివృద్ధి కోసం జరుగుతున్న ఈ యుద్ధంలో జనసేన – తెలుగుదేశం పార్టీలను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రం వదిలి పారిపోవాలి అని ప్రజలు మాట్లాడుతున్నారు. కృష్ణా నదిలా ఇక్కడే ఉందాం. జగనే రాష్ట్రం నుంచి పారిపోయేలా ఆయన్ను ఓడిద్దాం.