Begin typing your search above and press return to search.

ఆపరేషన్ పిఠాపురం : ఆరు వందల కోట్లా. ఇది నిజమేనా...!?

పిఠాపురం అసెంబ్లీ సీటు ఇపుడు ఏపీలోనే హీటెక్కిస్తోంది. రాజకీయాల మీద ఆసక్తి ఉన్న వారు ఎవరు కలసినా కూడా ఇదే చర్చగా ఉంది

By:  Tupaki Desk   |   4 April 2024 12:30 AM GMT
ఆపరేషన్ పిఠాపురం : ఆరు వందల కోట్లా. ఇది నిజమేనా...!?
X

పిఠాపురం అసెంబ్లీ సీటు ఇపుడు ఏపీలోనే హీటెక్కిస్తోంది. రాజకీయాల మీద ఆసక్తి ఉన్న వారు ఎవరు కలసినా కూడా ఇదే చర్చగా ఉంది. పవన్ కళ్యాణ్ అక్కడ గెలుస్తారా అన్నది కూడా అందరిలోనూ ఆసక్తిగా ఉంది. నిజానికి పవన్ విషయంలో ఈ సందేహాలు ఎందుకు వస్తున్నాయంటే ఆయన 2019 ఎన్నికలో ఓటమి పాలు అయ్యారు. అది కూడా రెండు నియోజకవర్గాల్లో. మరి ఇపుడు కూడా ఆయన చివరి నిముషంలో పిఠాపురంలో పోటీకి దిగుతున్నారు.

పవన్ మీద అందరికీ అందుబాటులో ఉండరు అన్న విమర్శను వైసీపీ చేస్తోంది. ఆయన ఉండేది హైదరాబాద్ అని ఆయన గెలిచినా ఎవరికీ దొరకరు అంటోంది. ఆయన సామాజిక వర్గానికే చెందిన వంగా గీతను ఎన్నుకుంటే కచ్చితంగా ఆమె ప్రజలలోనే ఉంటారు అని చెబుతోంది. ఇదిలా ఉంటే పవన్ తన పిఠాపురం పర్యటనలో పదే పదే వైసీపీ మీద విమర్శలు చేశారు.

ఒక్క పవన్ కోసం ఇంతలా అంతా కలసి రావాలా అని ఆయన ప్రశ్నించారు. తాను అసెంబ్లీకి రాకూడదా ఎందుకు ఇంతలా ఫోకస్ పెట్టారు అని వైసీపీ నేతలను ప్రశ్నించారు. మండలానికి పదుల సంఖ్యలో నాయకులు సిద్ధం అయ్యారని వారంతా కలసి తనను ఓడించాలని చూస్తున్నారు అని ఆయన ఆరోపించారు.

అంతే కాదు కాకినాడ పోర్ట్ వద్ద నగదుతో కంటైనర్ ని కూడా ఉంచారని ఆయన అంటున్నారు. ఇవన్నీ రాజకీయ విమర్శలు గా ఉండొచ్చు. కానీ కాపు బలిజ తెలగ జేఏసీ లీడర్ దాసరి రాము అయితే ఇవే ఆరోపణలు చేస్తున్నారు. పవన్ ని అసెంబ్లీకి వెళ్లనీయకుండా అతి పెద్ద కుట్ర సాగుతోంది అని ఆయన అంటున్నారు పవన్ ని ఓడించేందుకు ఆరు వందల కోట్ల రూపాయలను ఒక్క పిఠాపురానికే తరలించారు అని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.

ప్రతీ ఇంటికీ యాభై వేల నుంచి లక్ష రూపాయల దాకా పంచడానికి చూస్తున్నారు అని ఆయన మరో విమర్శ చేశారు మండలానికి బిగ్ షాట్స్ అంతా దిగిపోయి అపుడే పోల్ మేనేజ్మెంట్ ని స్టార్ట్ చేశారు అని ఆయన అంటున్నారు. డబ్బులు తీసుకుని పవన్ ని ఓండిచవద్దు అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు పవన్ కానీ దాసరి రాము కానీ చేస్తున్నరే తప్ప ఈసీకి ఎందుకు ఫిర్యాదు చేయడం లేదు అన్న చర్చ సాగుతోంది.

అంతేకాదు తన మీద భౌతిక దాడులు చేయడానికి వైసీపీ నేతలు కిరాయి మూకలను రంగంలోకి దింపుతున్నాయని పవన్ ఆరోపించారు. సన్నని బ్లేడ్ లతో తనను కోసేయాలని చూస్తున్నారు అని సంచలన ఆరోపణలు చేశారు. అవే నిజం అయినపుడు ఆయన ఈసీకి కదా ఫిర్యాదు చేయాల్సింది అని అంటున్నారు. ఇపుడు ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ప్రభుత్వంతో చెబితే యాక్షన్ తీసుకోదు అన్నది ఏమీ లేదు. ఈసీకి ఫిర్యాదు చేస్తే ఆరోపణలా లేక అవి నిజాలా అన్నది నిగ్గు తేలుస్తారు కదా అని అంటున్నారు.

వ్యవస్థలను ఉపయోగించుకుని వైసీపీని కట్టడి చేయవచ్చు కదా అని సూచనలు వస్తున్నాయి. అవేమీ చేయకుండా కేవలం ఆరోపణలు చేయడం వల్ల ఉపయోగం ఏంటి అని అంటున్నారు. అయితే దీని మీద వైసీపీ నుంచి కౌంటర్ వస్తోంది. ప్రచారం చేయడానికి నేతలు అన్ని పార్టీల నుంచి వస్తారని వంగా గీత అంటున్నారు. రేపటి రోజున కూటమి నేతలు పవన్ కోసం పనిచేయరా అని ఆమె ప్రశ్నిస్తున్నారు.

లక్షల రూపాయలు ఒక్కో కుటుంబానికి పంచుతారు అని చెప్పడం ఓటర్లను అవమానించడమే అని గీత అంటున్నారు. ఇక కిరాయి మూకలు బ్లేడ్ తో దాడులు అన్న దాన్ని కూడా వైసీపీ నేతలు ఖండిస్తున్నారు. ఇవన్నీ సానుభూతి కోసం ఇస్తున్న స్టేట్మెంట్స్ అంటున్నారు. 2019 ఎన్నికల ముందు కూడా పవన్ ఇలాగే సంచలన ప్రకటనలు ఆరోపణలు చేశారని వారు గుర్తు చేస్తున్నారు.

మొత్తం మీద చూస్తే పిఠాపురంలో ఏదో జరిగిపోతోంది అని జనసేన కానీ ఒక బలమైన సామాజిక వర్గం నేతలు కానీ అంటున్న దాంట్లో ఎంత మేరకు నిజం ఉంది అన్నది ఈసీ కూడా పరిశీలించాలని అంటున్నారు. ఎక్కడ ఎన్నిక అయినా సాఫీగా జరగాల్సిందే అంటున్నారు. ఎన్నికల్లో అక్రమాలు లేకుండా చూడాల్సిందే అంటున్నారు.