Begin typing your search above and press return to search.

పవన్‌ వరుస సమావేశాల ఆంతర్యం అదేనా?

ఆంధ్రప్రదేశ్‌ లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం మాత్రమే ఉంది.

By:  Tupaki Desk   |   8 Jan 2024 2:30 PM GMT
పవన్‌ వరుస సమావేశాల ఆంతర్యం అదేనా?
X

ఆంధ్రప్రదేశ్‌ లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నాయి. ఇప్పటికే వైసీపీ 38 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసింది. మరో రెండు మూడు రోజుల్లో మిగతా అభ్యర్థుల జాబితాను ప్రకటించవచ్చని ప్రచారం జరుగుతోంది.

మరోవైపు టీడీపీ, జనసేన కలిసి ఎన్నికల బరిలో దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలు కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా తాము పోటీ చేసే స్థానాల జాబితాలను విడుదల చేయొచ్చని గట్టి ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ఇప్పటికే జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ తాము పోటీ చేసే స్థానాలపై దృష్టి సారించారు. గత ఎన్నికల్లో జనసేన ఒకే ఒక్క సీటులో గెలిచింది. తూర్పుగోదావరి జిల్లా రాజోలు స్థానంలో విజయం సాధించింది. అలాగే రాజమండ్రి రూరల్, కాకినాడ రూరల్, తదితర స్థానాల్లో 40 వేలకు పైగా ఓట్లు సాధించింది. అలాగే మరికొన్ని నియోజకవర్గాల్లో 30 వేలకు పైగా సీట్లను సంపాదించింది. కొన్ని చోట్ల రెండో స్థానంలో నిలిచిన ఆ పార్టీ, చాలా చోట్ల మూడో స్థానంలో నిలిచింది.

ఈ నేపథ్యంలో ఇలాంటి సీట్లపై జనసేనాని దృష్టి సారించినట్టు చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం మూడు రోజులపాటు కాకినాడలో మకాం వేసి మరీ పవన్‌ కాకినాడ జిల్లాలో పోటీ చేసే అభ్యర్థులందరితోనూ మాట్లాడారు. టీడీపీ నియోజకవర్గ ఇంచార్జులు కూడా పవన్‌ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జనసేన నేతలతో పవన్‌ ముఖాముఖి సమావేశాలు నిర్వహించారు. పార్టీ బలాలు, బలహీనతలు, గెలిచే అవకాశమున్న స్థానాలు, తన దగ్గర ఉన్న సర్వే నివేదికలు తదితర అంశాల గురించి పార్టీ నేతలతో మాట్లాడినట్టు చెబుతున్నారు.

అలాగే మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలోనూ తరచూ పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. తాజాగా పవన్‌ మరోసారి మంగళగిరికి చేరుకున్నారు. ఈ దఫా పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల పార్టీ నేతలతో పవన్‌ చర్చించనున్నారని తెలుస్తోంది. ఈ రెండు జిల్లాల పరిధిలో జనసేన పోటీ చేయబోయే స్థానాలు, గత ఎన్నికల్లో అత్యధిక ఓట్లు సాధించిన నియోజకవర్గాల గురించి పవన్‌ తెలుసుకుంటారని అంటున్నారు.

ఈ నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా పార్టీ నేతలకు సమాచారం వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ సమావేశాల్లో పవన్‌ వేర్వేరుగా ప్రతి అభ్యర్థితో మాట్లాడతారని అంటున్నారు. అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, వివిధ విభాగాల అధ్యక్షులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తీసుకుంటారని చెబుతున్నారు.

ఇప్పటికే జనసేన పోటీ చేసే స్థానాలపై పవన్‌ కు స్పష్టత ఉందని సమాచారం. ఈ దిశగా టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్‌ పలుమార్లు చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనప్పటికీ సంక్రాంతి నాటికి జనసేన పోటీ చేసే స్థానాలపై స్పష్టత రావచ్చని అంటున్నారు.