షణ్ముఖ వ్యూహం సరే.. ప్రజల నాడి పట్టావా సేనానీ?!
ఈ నేపథ్యం లో 52 శాతంగా ఉంటుందని భావిస్తున్న మహిళా వోటు బ్యాంకులో కనీసం 25 శాతం పైనే జనసేన కానీ, ఇతర పక్షాలు కానీ.. తమవైపు ఇప్పుడు తిప్పుకోవాలి
By: Tupaki Desk | 6 Aug 2023 8:30 AM ISTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా మరోసారి కూడా షణ్ముఖ వ్యూహాన్ని తెరమీదకి తెచ్చారు. జగన్ వంటి బలమైన నాయకుడిని ఎదుర్కొనేందుకు షణ్ముఖ వ్యూహంతోనే ముందుకు సాగాలని సూచించారు. ఇక్కడ కీలకమైన విషయాన్ని ఆయన ఒప్పేసుకున్నారు. జగన్ బలమైన నాయకుడు అని! ఆశ్చర్యం ఏమీ లేదు. ఎందుకంటే.. క్షేత్రస్థాయిలో చూసుకుంటే.. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను తీసిపారేయడం అంత ఈజీ కాదు.
ముఖ్యంగా మహిళా ఓటు బ్యాంకును తనవైపు చాలా వ్యూహాత్మకంగా ఆయన తిప్పుకొన్నారు. ఈ నేపథ్యం లో 52 శాతంగా ఉంటుందని భావిస్తున్న మహిళా వోటు బ్యాంకులో కనీసం 25 శాతం పైనే జనసేన కానీ, ఇతర పక్షాలు కానీ.. తమవైపు ఇప్పుడు తిప్పుకోవాలి.
అదే విజయానికి బాటలు వేస్తుంది. దీనికి గాను ఇప్పుడు కావాల్సింది.. షణ్ముఖ వ్యూహం కాదని పరిశీలకులు చెబుతున్నారు. ఏకముఖ వ్యూహం.. సింగిల్ అజెండానేనని చెబుతున్నారు.
మీరు ఏం ఇస్తారు? ఇప్పుడు జగన్ ఇస్తున్న నిధుల కన్నా..(అన్ని పథకాలు కలుపుకొని) మీరు ఎంత ఎక్కువ ఇస్తారు? అనేది ముఖ్యం. ఈ ఇవ్వడంలోనూ నమ్మకం కలిగించాల్సి ఉంటుంది. జగన్ కన్నా మెరుగ్గా పాలనను అందిస్తామని చెప్పినా.. ఇప్పుడు మహిళలకు కావాల్సింది.. చేతి నిండా సొమ్ములు. ఏ పథకాన్ని తీసుకున్నా.. డబ్బులు వారి అకౌంట్లలోకి జమ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ఇప్పుడు నాయకులను , పార్టీలను కూడా.. సొమ్ములతోనే చూస్తున్నారు.
అవినీతి జరిగిందన్నా.. దోచుకుంటున్నారన్నా.. ధరలు పెంచారన్నా.. కూడా ప్రజలు పెద్దగా లెక్క చేయడం లేదు. ముఖ్యంగా పథకాలు అందుకుంటున్న కుటుంబాల్లో అయితే.. ఈ వాదన ఎక్కువగా ఉంది. సో.. ఈ దిశగానే పవన్ అయినా.. జనసేన అయినా.. కార్యాచరణ చేపట్టాల్సి ఉంటుంది తప్ప.. షణ్ముఖ వ్యూహాలతో ప్రజలకు పనిలేదని ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న వారు కూడా చెబుతున్నారు. సో.. పవన్ ఆదిశగా దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని అంటున్నారు. మరి ఏం చేస్తారచూడాలి.
