పూర్తిగా షిఫ్ట్ అయిన పవన్....టార్గెట్ ఫిక్స్ ..!
పవన్ కళ్యాణ్ కేరాఫ్ హైదరాబాద్ అని వైసీపీ నేతలు విమర్శలు చేస్తూ ఉంటారు
By: Tupaki Desk | 2 Aug 2023 2:34 PM ISTపవన్ కళ్యాణ్ కేరాఫ్ హైదరాబాద్ అని వైసీపీ నేతలు విమర్శలు చేస్తూ ఉంటారు. అయితే వారికి ఇక మీదట ఆ చాన్స్ పవన్ ఇవ్వదలచుకోలేదులా ఉంది. అందుకే ఆయన ఏకంగా మంగళగిరిలోని తన కార్యాలయానికి మొత్తానికి మొత్తం షిఫ్ట్ అయిపోయారు. ఆయన హైదరాబాద్ లోని కేంద్ర కార్యాలాయం నుంచి సిబ్బంది, ఫైల్స్, ఇతర విభాగాలు, కంప్యూటర్లను అన్నీ టోటల్ గా షిఫ్ట్ చేసేశారు అని అంటున్నారు.
ఇక మంగళగిరి పార్టీ ఆఫీసులోనే పవన్ కళ్యాణ్ ఉండడానికి ఒక ఇంటిని కూడా సౌకర్యవంతంగా నిర్మించారు అని అంటున్నారు. అంటే పార్టీ ఆఫీసు, ఇల్లు అన్నీ మంగళగిరి అడ్రస్ లోనే ఉన్నాయన్న మాట. ఎక్కడో హైదరాబాద్ లో ఉంటూ ఏపీ రాజకీయాలు పవన్ చేస్తున్నారు అని మంత్రులు కానీ వైసీపీ నేతలు కానీ విమర్శించడానికి ఏ మాత్రం వీలు లేకుండా పవన్ ఈ విధంగా కొత్త సెటప్ చేసుకున్నారు అని అంటున్నారు.
ఎన్నికలు నెలల వ్యవధిలో ఉండడంతో పాటు వారాహి యాత్ర కూడా రెండు విడతలుగా చేసి సక్సెస్ అయిన పవన్ ఇంకా ఏపీలోని ఉమ్మడి జిల్లాలు అయిన పదకొండింటిని తిరగాల్సి ఉంది. అలాగే అభ్యర్ధుల ఎంపిక పార్టీ పటిష్టత వంటివి స్వయంగా చూసుకోవాల్సి ఉంది. అదే విధంగా పార్టీ నాయకులకు ఎల్ల వేళలా అందుబాటులో ఉండాల్సి ఉంది. దాంతో పవన్ తాను ఇటీవల కాలంలో చెప్పినట్లుగానే ఇక మీదట మంగళగిరిలోనే తన నివాసం మకాం అన్నట్లుగానే అన్నీ చేసేశారు అని అంటున్నారు.
ఇక రానున్న కాలమంతా పవన్ మంగళగిరిలోని పార్టీ ఆఫీసులోనే ఉంటారని, ఆ పక్కనే ఇంటిలో మకాం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పవన్ హైదరాబాద్ కి వెళ్లాల్సి వస్తే మాత్రం షూటింగ్ కోసమే తప్ప మరి దేనికీ వెళ్లరని అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ రెండు రాష్ట్రాలలో తన పార్టీ ఉంటుందని చెప్పినా తెలంగాణాలో మాత్రం ఉండడం లేదు
నిజానికి తెలంగాణాలోనే ముందు ఎన్నికలు వస్తున్నాయి. అయినా సరే పవన్ ఏపీకే ప్రాధాన్యత ఇస్తున్నారు అని అంటున్నారు. మరి డిసెంబర్ లో జరిగే తెలంగాణా ఎన్నికల కోసం జనసేన ప్రణాళిక ఏ విధంగా ఉంటుందో తెలియదు కానీ పవన్ మాత్రం ఏపీకే పరిమితం అవుతున్నట్లుగా సంకేతాలు అయితే ఇచ్చేశారు.
ఇక పవన్ కోసం వచ్చే రాజకీయ సినీ జనాలు ఎవరైనా ఆయన్ని మంగళగిరి పార్టీ ఆఫీసులోనే కలవాలి తప్ప ఆయన హైదరాబాద్ ఇప్పటప్పట్లో వచ్చే అవకాశం అయితే లేదు అనే అంటున్నారు. మరో వైపు చూస్తే వారాహి మూడవ విడత కోసం పవన్ పార్టీ నాయకులతో సమాలోచనలు చేస్తున్నారు. ఈ యాత్రను రాయలసీమలో స్టార్ట్ చేయాలా లేక ఉత్తరాంధ్రాలో చేయాలా అనంది ఒక నిర్ణయం అయితే తీసుకోలేదు అని అంటున్నారు. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా జనసేన గట్టిగా హిట్ కొట్టాలని పవన్ పట్టుదలతో పనిచేస్తున్నారు. ఆ దిశగానే ఆయన యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేసుకుంటున్నారు అని అంటున్నారు.
