Begin typing your search above and press return to search.

సీపీఎస్ రద్దు అంటున్న పవన్...బాబు ఓకే అంటారా...?

ఒకే ఒక్క హామీ ఇపుడు టీడీపీ జనసేనల మధ్యన అతి పెద్ద చర్చకు దారి తీసే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   5 Nov 2023 4:01 AM GMT
సీపీఎస్ రద్దు అంటున్న పవన్...బాబు ఓకే అంటారా...?
X

ఒకే ఒక్క హామీ ఇపుడు టీడీపీ జనసేనల మధ్యన అతి పెద్ద చర్చకు దారి తీసే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి. రెండు పార్టీలు కలసి ఉమ్మడి మ్యానిఫేస్టోని రిలీజ్ చేయాలని చూస్తున్నాయని అంటున్నారు. ఇక టీడీపీ అయితే ఇప్పటికే కీలకమైన అయిదు హామీలను రాజమండ్రి మహానాడులో రిలీజ్ చేసింది.

జనసేన హామీలను వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ ఇస్తూ వచ్చారు. ఉమ్మడి మ్యానిఫేస్టో అంటే జనసేన హామీలు కూడా అందులో ఉండాలని పవన్ అంటున్నారు. ఇదే విషయం మీద చంద్రబాబుతో కూడా ఆయన చర్చించారు అని అంటున్నారు. ఇక జనసేన ఆరు హామీలను ఎన్నికల ప్రణాళికలో పెట్టాలని టీడీపీని కోరుతోంది.

అందులో మిగిలినవి ఎన్ని ఉన్నా అతి ముఖ్యమైనది కీలకమైనది సీపీఎస్ రద్దు. పాత పెన్షన్ పునరుద్ధరణ. పవన్ ఇప్పటం సభలో ఈ హామీ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చారు. దీనిని తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమలు చేస్తామని ఆయన నాడే చెప్పారు. అయితే ఈ డిమాండ్ చాలా పాతది, రెండు ఎన్నికలను చూసింది కూడా.

చంద్రబాబు ముందుకు 2014 ఎన్నికల వేళ కూడా ఈ డిమాండ్ వచ్చింది. కానీ ఆయన అన్నీ ఆలోచించారు. ఏపీ ఆర్ధిక పరిస్థితి విభజన కష్టాలు అన్నీ చూసుకుని హామీ మాత్రం ఇవ్వలేదు. దాంతో 2019 కి ముందు వైసీపీ ఈ హామీ ఇవ్వడంతో ఉద్యోగులు అటు వైపు మొగ్గారు. తీరా అధికారంలోకి వచ్చాక ఈ హామీ బరువు ఎంత అన్నది వైసీపీ పాలకులకు అర్ధం అయింది అని అంటున్నారు.

దాంతో వారు అన్ని విధాలుగా చూసి మరీ చివరికి ఓపీఎస్ కాదు, సీపీఎస్ కాదు జీపీఎస్ అని గ్యారంటీ పెన్షన్ స్కీం ని తీసుకుని వచ్చారు. దాన్ని ఇటీవల బిల్లు రూపంలో కూడా ఆమోదించేశారు. ఇక అది అమలులోకి రావడం జరిగిపోతోంది. ఈ క్రమంలో ఇంకా ప్రభుత్వ ఉద్యోగుల ఆశలు సీపీఎస్ రద్దు మీద ఉన్నాయని అంటున్నారు. ప్రత్యేకించి ప్రభుత్వ ఉపాధ్యాయులు అయితే సీపీఎస్ రద్దు కావాలనే డిమాండ్ చేస్తున్నారు.

ఒక విధంగా చూస్తే ఈ హామీ ఇస్తే జనసేన టీడీపీ కూటమికి లాభకరమే. కానీ ఇది మోయలేని భారం అని చంద్రబాబుకు తెలుసు అంటున్నారు. మరి ఆయన జనసేన నుంచి వచ్చిన ఈ హామీని ఎన్నికల మ్యానిఫేస్టోలో పెడతారా అన్నది ఇపుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.