Begin typing your search above and press return to search.

సీఎం గా పవన్ కి నో చాన్స్...జనసేన రగులుతోందా...!?

సీఎం పవన్ అంటూ జనసైనికులు ఎపుడూ రచ్చ చేస్తూంటారు. మా నాయకుడు ముఖ్యమంత్రి కావాలి.

By:  Tupaki Desk   |   22 Dec 2023 8:30 AM GMT
సీఎం గా  పవన్ కి   నో చాన్స్...జనసేన రగులుతోందా...!?
X

సీఎం పవన్ అంటూ జనసైనికులు ఎపుడూ రచ్చ చేస్తూంటారు. మా నాయకుడు ముఖ్యమంత్రి కావాలి. ఆయన సీఎం అయి తీరుతారు అని సంబరపడుతుంటారు. ఇక పవన్ కళ్యాణ్ సైతం తన అభిమానుల ఆలోచనలు ప్రోత్సహించేలా ముందు టీడీపీ జనసేన కూటమిని గెలవనీయండి సీఎం సీటు విషయం చంద్రబాబు నేనూ ఇద్దరం కలసి చర్చించుకుంటామని చెప్పుకొస్తున్నారు.

దాంతో జనసేన టీడీపీ కూటమిలో చేరి రెండున్నరేళ్లూ చంద్రబాబు పవన్ సీఎం సీటు తీసుకుంటారని జనసేన కార్యకర్తలు ఎంతో కొంత నమ్ముతున్నారు. ఇపుడు వారి ఆశల మీద చినబాబు లోకేష్ నీళ్ళు చల్లేశారు. నో చాన్స్ అనేశారు.

రేపటి రోజున ఏపీలో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబే అయిదేళ్ల పాటు సీఎం గా ఉంటారు అని కుండబద్ధలు కొట్టేశారు. ఇంతకీ లోకేష్ ఏమన్నారు అంటే ఒక యూట్యూబ్ చానల్ చేసిన ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి పదవిని షేర్ చేసుకోబోమని స్పష్టం చేశారు.

జనసేనతో సీట్ల సర్దుబాట్లు మాత్రమే ఉంటాయని కూడా పక్కాగా చెప్పేశారు. అసలు ఈ విషయంలో రెండవ ఆలోచన అన్నదే లేదని లోకేష్ అనడం విశేషం. తాము పూర్తి స్పష్టతతో ఉన్నామని కూడా బిగ్ సౌండ్ చేశారు.

చంద్రబాబు సీఎం. అనుభవం ఉన్న నాయకుడు. దీర్ఘ కాలం రాజకీయ అనుభవం ఉన్న నేత చంద్రబాబు. పవన్ కళ్యాణ్ కూడా అనేక సార్లు కావాలి. సమర్ధత కలిగిన నాయకుడు అవసరం అని చెప్పారు కదా అని లోకేష్ తెలివిగా పవన్ మీదనే నెట్టేశారు. అయిదేళ్ళ పాటు బాబే సీఎం అని కూడా తేల్చేశారు.

ఈ విషయంలో ఎలాంటి ఊగిసలాటకు తావే లేదు అని అన్నారు. మరి ఇంత స్పష్టంగా లోకేష్ చెప్పాక ఇంకా సీఎం సీటు ఎన్నికల తరువాత పంచుకుంటామని పవన్ అనగలరా ఒక వేళ పవన్ అన్నా జనసైనికులు నమ్ముతారా అన్నది కూడా ఆలోచించాలి. నిజానికి పవన్ సీఎం కాకపోతే జనసైనికులు టీడీపీకి ఎందుకు ఓటేయాలి అన్న ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది అని అంటున్నారు.

ఏపీలో వైసీపీ బలంగా ఉంది. ఆ పార్టీని ఎదుర్కోవాలంటే రెండు పార్టీలూ కలవాలని జనసేన టీడీపీ నిర్ణయించి పొత్తు పెట్టుకున్నాయి. ఒకవేళ జనసేన పొత్తు కలపకపోతే టీడీపీ మరోసారి ప్రతిపక్షంలోనే కూర్చుంటుంది. అది కూడా కచ్చితమైన విశ్లేషణగానే ఉంది

అదే సమయంలో పవన్ కి సీఎం చాన్స్ ఇవ్వకపోయినా ఈ కూటమి పొత్తు అంత సక్సెస్ ఫుల్ గా సాగదు అన్న చర్చ కూడా ఉంది ఇవన్నీ ఒక వైపు నడుస్తూండగానే లోకేష్ బాబే సీఎం పవనే సాక్ష్యమని చెప్పేస్తున్నారు. ఇక చంద్రబాబు సైతం ఈ మధ్యనే తుఫాను బాధిత రైతులను పరమార్శించేందుకు పర్యటన చేస్తూ తానే సీఎం అవుతాను అని ప్రకటించేశారు.

మరి ఇంత క్లారిటీగా టీడీపీ ఉంటే పవన్ ఈ పొత్తు ద్వారా ఏమని జనసైనికులకు సందేశం ఇస్తారు అన్నది ఇపుడు ప్రశ్నగా ఉంది. పవన్ సీఎం పదవి వద్దు అన్నా అభిమానులు ఊరుకోరు. అంతే కాదు బలమైన ఒక సామాజిక వర్గం కూడా ఎంత మేరకు సపోర్టు చేస్తుంది అన్నది చూడాలని అంటున్నారు.

మొత్తానికి చూస్తే లోకేష్ తెలిసి అన్నారా లేక చెప్పాలని చెప్పారా ఏమో కానీ పవన్ కి సీఎం చాన్స్ లేదు అనేశారు. సో ఇపుడు జనసేన రగులుతుందా లేక సర్దుకుని పోతుందా అన్నది చూడాలని అంటున్నారు.