Begin typing your search above and press return to search.

జగన్ మీద ద్వేషంతో రాజకీయ తప్పుటడుగులు...!

By:  Tupaki Desk   |   25 Feb 2024 1:30 AM GMT
జగన్ మీద ద్వేషంతో రాజకీయ తప్పుటడుగులు...!
X

రాజకీయాల్లో ఎవరు ఎవరికీ శత్రువులు కాదు, ప్రత్యర్ధులు అనుకున్నా కూడా సరిపోతుంది. దాని కంటే ముందు ఆటగాళ్ళు అనుకోవడం బెటర్. తనకంటే ఎక్కువగా ఆట ప్రదర్శిస్తున్న ఆటగాణ్ణి చూసి కసి పెంచుకోవాలి. ద్వేషం కాదు. అపుడే ఆ ఆటలో గెలుస్తారు ఎవరైనా.

ఏపీ రాజకీయాల్లో చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఎన్నో అవకాశాలు అలా వచ్చాయి. కానీ ఆయన తనదైన శైలిలో రాజకీయాలు చేస్తూ పోయారు. 2014లో ఆయనను పోటీ చేయవద్దని చెప్పింది ఎవరు. అది ఆయన వేసిన తొలి తప్పటడుగు. ఆ విధంగా ఆయన చేయడం వల్ల రాజకీయంగా అయిదేళ్ళ పాటు వేచి చూడాల్సి వచ్చింది.

ఆనాడే ఆయన పొత్తులకు వెళ్లి ఉంటే ఈ రోజుకి జనసేన కధ వేరే విధంగా ఉండేది. పవన్ కూడా రాజకీయంగా మరింతగా బలపడేవారు కానీ అవేమీ జరగలేదు. ఇక 2019 వద్దకే వస్తే అసలు బీజేపీతో పవన్ ఎందుకు బంధం తెంచుకున్నారు. 2020లో మళ్ళీ ఎందుకు కలుపుకున్నారు. ఈ ప్రశ్నలకు జవాబులు లేవు. నిజంగా 2019లో పవన్ బీజేపీతో పొత్తు కూడా ఎన్నికలకు వెళ్లి ఉంటే కచ్చితంగా ఎన్నో కొన్ని సీట్లు వచ్చి ఉండేవి.

కానీ పవన్ వేసిన మరో తప్పటడుగు ఆ ఎన్నికల్లోనే జరిగింది. ఇక 2024 ఎన్నికలు అంటే అయిదేళ్ల పుణ్యకాలం అంతా పవన్ పార్టీని పటిష్టం చేయలేదు. మధ్య మధ్యలో ఏపీకి వచ్చి పోతూ అలా రాజకీయం చేశారు. తీరా ఎన్నికల వేళకు ఆయన టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. పోనీ ఈ పొత్తు అయినా ఆయన గౌరవప్రదంగా చేసుకున్నారా అంటే ఇచ్చునమ్మ వాయినం పుచ్చుకున్న వాయినం అన్నట్లుగా ఇచ్చిన సీట్లే చాలు అనుకుంటున్నారు.

రాజకీయాల్లో గెలవడం అంటే తనతో పాటు తన వారిని కూడా గెలిపించడం. పవన్ ఆలోచన ఏవో కొన్ని సీట్లు వస్తే చాలు అన్నది అని ఆయన మాటల బట్టే అర్ధం అవుతోంది. కానీ ఆయనను అభిమానిస్తున్న వారు, వెంట ఉన్న ఒక బలమైన సామాజిక వర్గం చూస్తే కనుక వారంతా సీఎం కావాలని కోరుకుంటున్నారు. అది కష్టసాధ్యమే కానీ ఏపీలో ఇపుడున్న పరిస్థితులను అనుకూలం చేసుకుంటే సాధ్యమే.

జనసేన అవసరం టీడీపీకి ఉంది. టీడీపీ ఓడితే ఇక ఫ్యూచర్ ప్రశ్నార్ధకం. అదే జనసేన ఓడినా పోయేది ఏమీ లేదు. కానీ టీడీపీ ఫ్యూచర్ కోసం జనసేన తగ్గిపోయింది అని అంటున్నారు. దాని కంటే ముందు జగన్ సీఎం కాకూడదు అన్న ఆలోచనతోనే పవన్ ఈ పొత్తులకు బాగా తగ్గిపోయారు అని అంటున్నారు. నిజానికి జగన్ రెండవసారి సీఎం అయితే జనసేనకే రాజకీయంగా మేలు జరుగుతుంది.

ఎలా అంటే టీడీపీ పతనావస్థలో ఉంటుంది. ఏపీలో అపోజిషన్ రోల్ జనసేనకే దక్కుతుంది. అలా 2029 నాటికైనా సీఎం చాన్స్ ఉండేది. అలా కాకుండా అతి తక్కువ సీట్లు తీసుకుని అందులో కొన్ని గెలిచి అసెంబ్లీకి వెళ్తే ఏమిటి ప్రయోజనం అన్నది ఒక సామాజికవర్గంలో వినిపిస్తున్న మాట.

రాజకీయాల్లో తాము ఎదగాలి అన్నది లక్ష్యంగా ఉండాలి. కానీ మొదటి నుంచి పవన్ కి జగన్ ఓడాలి అన్నది ప్రధాన అజెండా అయిపోయింది అని అంటున్నారు. 2014లో జగన్ రాకూడదు అని తాము బీజేపీ టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చాను అని పవన్ చెప్పుకున్నారు. 2019లో కూడా జగన్ సీఎం కారు ఇది నా శాసనం అన్నారు. నాడు కూడా టీడీపీ వ్యతిరేక ఓట్లను చీల్చడం కోసమే ఆయన వేరుగా పోటీ చేశారు అని వైసీపీ నేతలు అంటారు.

ఇక 2024లో కూడా జగన్ గద్దె దిగాలి అన్న అజెండాతోనే పొత్తులు పెట్టుకుంటున్నారు. మొత్తానికి వరస మూడు ఎన్నికల్లోనూ నేను గెలవాలి, సీఎం కావాలి అన్నది పవన్ తొలి ప్రాధాన్యతగా రాలేదేదని అంటున్నారు. అందుకే ఆయన తప్పటడుగులు వేస్తున్నారు అని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలవవచ్చు లేదా జగన్ మళ్లీ గెలవచ్చు. కానీ పవన్ రాజకీయం మాత్రం ఇలాగే ఉంటే గెలుపు ఎపుడు అన్నదే ఆయన అభిమానుల ఆవేదనగా ఉంది.