పవన్ కు ఈ ‘బకెట్’ బాధ ఎక్కువైపోయిందే!
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 23 Sept 2023 11:30 AMఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే తాను ఎన్డీయేలోనే ఉన్నానని.. బీజేపీ కూడా తమతో కలసి రావాలని కోరుకుంటున్నానని పవన్ తెలిపారు. ఈ మేరకు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో పొత్తు గురించి చెబుతానని వెల్లడించారు. మరోవైపు తెలంగాణలో మాత్రం జనసేన ఒంటరిగా పోటీ చేయనుంది. అక్కడ మొత్తం 32 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది.
కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 6 శాతం ఓట్లు సాధించింది. తూర్పు గోదావరి జిల్లాలోని ఒక్క రాజోలు అసెంబ్లీ సీటును మాత్రమే గెలుచుకుంది. పార్టీ అధినేత పవన్ రెండు చోట్ల పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పార్టీ గుర్తు ఉండాలంటే, గుర్తింపు పొందిన పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించాలంటే కనీసం 8 శాతం ఓట్లు అవసరం. లేదా కనీసం రెండు అసెంబ్లీ స్థానాల్లో అయినా విజయం సాధించాల్సి ఉంటుంది. అయితే ఈ రెండు ప్రమాణాలను జనసేన అందుకోలేకపోయింది.
కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన ఓట్ల శాతం సాధించలేకపోవడంతో గుర్తింపు పొందిన పార్టీగా జనసేన గుర్తింపును కోల్పోయింది. కేవలం రిజిస్టర్డ్ పార్టీగా మాత్రమే ఉంది. దీంతో జనసేన పార్టీ గుర్తు అయిన గాజు గ్లాసును కేంద్ర ఎన్నికల సంఘం ఆ పార్టీకి తప్పించింది. దాన్ని ఎవరికీ కేటాయించని ఫ్రీ సింబల్స్ జాబితాలో చేర్చింది.
అయితే కొద్ది రోజుల క్రితం జనసేన పార్టీకి ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. దీంతో జనసేన నేతలు సంతోషం వ్యక్తం చేశారు. అధినేత పవన్ కళ్యాణ్ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణలో జనసేన పోటీ చేస్తున్న 32 స్థానాల్లో గాజు గ్లాసు గుర్తును ఆ పార్టీకి ఈసీ కేటాయించింది. మిగిలిన చోట్ల ఆ సింబల్ ను ఎవరైనా ఇండిపెంటెంట్ అభ్యర్థులు కోరుకుంటే వారికి కేటాయించనుంది. మరోవైపు జాతీయ జనసేన పేరుతో ఇంకో పార్టీ రంగ ప్రవేశం చేసింది. దీనికి కేంద్ర ఎన్నికల సంఘం.. బకెట్ గుర్తును కేటాయించింది. ఇది దాదాపు జనసేన గుర్తు అయిన గాజు గ్లాసును తలపించేలా ఉంది.
తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటీ చేసేందుకు జాతీయ జనసేనకు ఈసీ బకెట్ గుర్తును కేటాయించింది. ఈ బకెట్ గుర్తు జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసును పోలి ఉండటం, పార్టీ పేరు కూడా ఇంచుమించు జనసేన పార్టీని తలపించేలా ఉండటంతో ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
ఇలా గతంలో బీఆర్‌ఎస్ పార్టీ గుర్తు అయిన కారును పోలి ఉన్న వాహనం గుర్తును ఈసీ ఇండిపెండెంట్ అభ్యర్థులకు కేటాయించడంతో ఓటర్లు ఎన్నికలప్పుడు అయోమయానికి గురై వాహనం సింబల్ పైన వేశారు. దీంతో వాహనం సింబల్ తో పోటీ చేసిన అభ్యర్థులకు వేల సంఖ్యలో ఓట్లు పోలయ్యాయి. ఆ మేరకు బీఆర్‌ఎస్ అభ్యర్థుల మెజారిటీ తగ్గిపోయింది. దీంతో ఆ పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. తమ పార్టీ గుర్తును పోలిన సింబల్స్ ను వేరే వారికి కేటాయించవద్దని విన్నవించారు.
ప్రస్తుతానికి రిజిస్టర్డ్ రాజకీయ పార్టీ అయిన జనసేన వచ్చే ఎన్నికల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా నిలవాలని ఆశిస్తోంది. అంటే 8 శాతం ఓట్లు అవసరం. అయితే జనసేన పార్టీని దెబ్బతీయడానికి ఎవరో జాతీయ జనసేన పార్టీతో రంగప్రవేశం చేశారు. అంతేకాకుండా జనసేన పార్టీ సింబల్ ను పోలిన గుర్తు బకెట్ ను తీసుకోవడం గమనార్హం.
తెలంగాణలో జనసేనకు పెద్దగా గుర్తింపు లేకపోవడం వల్ల అక్కడ ఎలాంటి నష్టం లేకపోయినా ఆంధ్రప్రదేశ్ లో మరే ఇతర పార్టీకి లేదా అభ్యర్థులకు బకెట్ గుర్తును కేటాయిస్తే అది జనసేనకు పెద్ద తలనొప్పిగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.