Begin typing your search above and press return to search.

పవన్ చేసింది ఓవర్ అయిందా...?

పవన్ కళ్యాణ్ విజయవాడ రోడ్డు మీద అర్ధరాత్రి పడుకుని చేసిన హంగామా మాత్రం ఆయన స్థాయికి తగినదిగా లేదనే కామెంట్స్ వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   10 Sept 2023 5:15 PM IST
పవన్ చేసింది ఓవర్ అయిందా...?
X

ఒక రాజకీయ పార్టీ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్. ఆయన పాపులర్ హీరో కూడా. అలాంటి పవన్ కళ్యాణ్ విజయవాడ రోడ్డు మీద అర్ధరాత్రి పడుకుని చేసిన హంగామా మాత్రం ఆయన స్థాయికి తగినదిగా లేదనే కామెంట్స్ వస్తున్నాయి. పవన్ అంటే పవర్ ఫుల్ హీరో. అది రీల్ లైఫ్ అయినా రియల్ లైఫ్ అయినా అన్నది ఫ్యాన్స్ తో పాటు సైనికుల భావన. అలాంటి పవన్ పోలీసులు తనను అడ్డుకున్నారంటూ రోడ్డు మీద అడ్డంగా పడుకోవడం మాత్రం చర్చకు దారి తీస్తోంది.

ఇంతకీ పవన్ ఎందుకు అంతలా నిరసన చేశారు అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. ఒక బలమైన అంశం ఉంటే ఆయన చేసిన నిరసనకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చి ఉండేది. ఆయన కొన్ని రోజులుగా హైదారాబాద్ లో ఉంటున్నారు. ఆయన సినిమా షూటింగులతో బిజీగా ఉంటున్నారు అని అంటున్నారు. అలాంటి పవన్ టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వార్తతో మళ్ళీ ఏపీకి రావాలని అనుకున్నారు.

ఆయన ప్రత్యేక విమానానికి అనుమతి లేకపోతే గంటల కొద్దీ రోడ్డు మార్గంలో ప్రయాణించి మరీ అర్ధరాత్రికి విజయవాడకు చేరుకున్నారు. కానీ లా అండ్ ఆర్డర్ అని పోలీసులు అడ్డుకున్నారు. వారు అలా చేయడం సబబో కాదో పక్కన పెడితే పవన్ రోడ్డు మీద నడచుకుంటూ వెళ్తాను అని చెప్పడం, ఆయన వంటి పవర్ ఫుల్ సెలిబ్రిటీని అలా వదిలేయడానికి అవకాశం లేక పోలీసులు అడ్డుకోవడంతో ఏకంగా రోడ్డు మీదనే పడుక్కుని పవన్ తన నిరసన తెలియచేశారు.

పవన్ నిరసనలు ఆయన వన్ మ్యాన్ రోడ్ షోలు అన్నీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇంత అర్జంటుగా పవన్ విజయవాడ ఎందుకు రావాలనుకుంటున్నారు అన్నది అందరికీ తెలిసిందే. దాంతో పాటే పవన్ కి చంద్రబాబు మీద అంత ప్రేమా అన్న చర్చ కూడా మొదలైంది. తన పార్టీ కాని వారు వేరే పార్టీ వారు అరెస్ట్ అయితే పవన్ ఉరుకులు పరుగులు మీద రావాలా ఆయనకు ఎందుకు అంత తొందర. ఎందుకు అంత ఆసక్తి అన్న చర్చ కూడా సాగుతోంది.

ఈ రోజుకీ చూస్తే టెక్నికల్ గా టీడీపీతో జనసేనకు దోస్తీ అయితే లేదు. కానీ పవన్ చంద్రబాబుకు అడుగడుగునా మద్దతు ఇస్తున్నారు. విపక్షంలో సాటి పక్షం నేతలు ఇబ్బందులలో ఉంటే వారికి సపోర్ట్ చేయవచ్చు. ఇక చంద్రబాబు అరెస్ట్ అయి సీఐడీ కస్టడీలో ఉన్నారు. ఆయనను పరామర్శించాలన్నా కూడా చేయవచ్చు. కానీ దానికి టైం పడుతుంది.

కానీ పవన్ మాత్రం అర్జంటుగా హైదరాబాద్ నుంచి ఏపీకి రావడం వెనక ఆదుర్దా వెనక చంద్రబాబు మీద అవ్యాజ్యమైన అభిమానాలే ఉన్నాయని ప్రచారం సాగుతోంది. అందుకే ఆయన అతి చేసి మరీ తన మంగళగిరి ఆఫీసు దాకా పోలీసులతో దిగబెట్టించుకునే దాకా పరిస్థితి తెచ్చుకున్నారని అంటున్నారు. ఇదిలా ఉంటే పవన్ చేసిన ఈ వన్ మ్యాన్ రోడ్ షో, రోడ్డు మీద పడక అన్నవి ఓవర్ అయ్యాయనే అంటున్నారు.

దీంతోనే వైసీపీకి మరోసారి చాన్స్ ఇచ్చేశారు పవన్ అంటున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయితే పవన్ కళ్యాణ్ విన్యాసాలు ఏంటి అంటూ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేయడం కూడా ఇపుడు వైరల్ అవుతోంది. పక్క పార్టీ వారి కోసం ఎందుకు ఇంత తాపత్రయం అని సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి సెటైర్లు పడుతున్నాయి. ప్రజా సమస్యల మీద అర్ధరాత్రి రోడ్డు మీద బైఠాయిస్తే వచ్చే మైలేజ్ వేరు, అలా వచ్చే కవరేజ్ వేరు, అని సూచిస్తున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ఇన్నాళ్ళూ సైలెంట్ గా ఉండి ఇపుడు ఇలా బయటకు రావడం పట్ల రకరకాలైన విశ్లేషణలు ఉన్నాయి.

చంద్రబాబు మీద 118 కోట్లకు సంబంధించి ఐటీ శాఖ నొటీసులు జారీ చేసింది. దాని మీద గత పది రోజులుగా మీడియా అంతా మోతెక్కిపోతుంటే జనసేన నుంచి ఒక్క ట్వీట్ అయినా లేదని ఇపుడు ఒక అవినీతి కేసుకు సంబంధించి బాబును అరెస్ట్ చేస్తే ఇలా రెక్కలు కట్టుకుని వచ్చి వాలిపోవాలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి సేనాని రోడ్ షో ఈసారి మాత్రం హిట్ కాలేదని అంటున్నారు.