Begin typing your search above and press return to search.

పవన్ కోరిక : మళ్ళీ మోడీ ప్రధాని కావాలి... ..బాబు మాటేంటి...?

ఈ దేశానికి మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాని కావాలన్నది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరిక.

By:  Tupaki Desk   |   5 Nov 2023 12:30 PM GMT
పవన్ కోరిక  : మళ్ళీ మోడీ ప్రధాని కావాలి... ..బాబు మాటేంటి...?
X

ఈ దేశానికి మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాని కావాలన్నది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరిక. దాన్ని ఆయన చాలా సార్లు బయటపెట్టారు. గతం సంగతి ఎలా ఉన్నా ఇపుడు సరైన సందర్భంలో ఆయన మరోమారు అదే మాట అంటున్నారు. తెలంగాణా బీజేపీతో జనసేన పొత్తు సందర్భంగా మీడియాతో మాట్లాడిన పవన్ అయితే 2024 తరువాత మళ్లీ మోడీ దేశానికి ప్రధాని కావాలని అన్నారు.

ఈ విషయాన్ని ఇటీవల జరిగిన ఎన్డీయే సమావేశంలో కూడా చర్చించామని చెప్పారు. మోడీ మీద పవన్ కి ఉన్న అభిమానం అది. పవన్ లో రాజకీయ ఆసక్తి మళ్లీ కలగడానికి మోడీ 2014లో బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా రావడం అన్నది కూడా ఒక కారణంగా చెబుతూ ఉంటారు.

పవన్ కళ్యాణ్ కి వ్యక్తిగతంగా కూడా మోడీ అంటే ఎంతో అభిమానం ఉంది. దేశంలో బలమైన ప్రభుత్వం ఉండాలని బలమైన నాయకత్వం ఉండాలని పవన్ కోరుకుంటూ ఉంటారు. అయితే ఇపుడు దేశంలో రాజకీయం మారుతోంది. ఇండియా కూటమి ముందుకు వస్తోంది. అయిదు రాష్ట్రాలలో ఎక్కువ చోట్ల కనుక కాంగ్రెస్ గెలిస్తే లోక్ సభ ఎన్నికల నాటికి అనుకూల వాతావరణం ఇండియా కూటమికి ఏర్పడుతుంది అని ఒక విశ్లేషణ ఉంది.

ఇక టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ చాణక్యుడు. ఆయన ఎప్పటికి ఏది అవసరమో దాన్ని బట్టే ముందుకు సాగుతారని చెబుతారు. తెలంగాణాలో టీడీపీ పోటీ చేయకపోవడం వెనక బాబు వ్యూహాలు తెలిసిపోతున్నాయి. తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే ఓట్ల చీలిక ఉండకూడదు. పైగా బాబుని టీడీపీని మొదటి నుంచి మోస్తున్న ఒక బలమైన సామాజిక వర్గానికి కాంగ్రెస్ తెలంగాణాలోనే కాదు దేశంలో కూడా రావాలని ఉందని అంటారు.

బాబు అరెస్ట్ తరువాత వారి కోరిక మరింత పెరిగింది అని కూడా అంటారు. మోడీ బీజేపీ వల్ల ఇబ్బందులే అన్న భావన కూడా ఆ వర్గంలో ఉంది. అందుకే బీజేపీని వీడి టీడీపీని పోటీ చేయమని చెబుతూ వస్తున్నారని అంటారు. ఇక ఏపీలో కాంగ్రెస్ కమ్యూనిస్టులు టీడీపీ జనసేనలతో పొత్తులకు ఒక విశాలమైన వేదికను నిర్మించాలని కూడా కోరేవారు ఎక్కువ అవుతున్నారు.

ఈ పరిణామాల నేపధ్యంలో పవన్ మోడీని ప్రధానిగా మరోసారి చూడాలని అనుకుంటున్నట్లుగా చెప్పేశారు. పవన్ మనసులో ఉన్నది చెప్పేశారు. అందులో రాజకీయ వ్యూహాలు ఏమీ లేవు. కానీ గుప్పిట మూసి ఉంచుతోంది టీడీపీ. ఆ పార్టీ అయితే ఈ రోజుకు ఓపెన్ గా ఏదీ చెప్పడంలేదు. ఆ మధ్య దాకా మోడీ బీజేపీ కోసం ఆరాటపడింది వాస్తవం అయినా మారిన పరిస్థితులలో మాత్రం టీడీపీ ఎలా ఆలోచిస్తుంది అన్నది అయితే అర్ధం కావడంలేదు అంటున్నారు.

తెలంగాణాలో కాంగ్రెస్ గెలవకపోతే మాత్రం టీడీపీ ఒక విధంగా ఆలోచించవచ్చు, గెలిస్తే మాత్రం ఏపీలో రాజకీయాల్లో కొత్త కూటములకు కూడా టీడీపీయే చొరవ తీసుకోవచ్చు అని అంటున్నారు. అలాంటపుడు మోడీని మూడవసారి ప్రధానిగా చూడాలనుకుంటున్న పవన్ కళ్యాణ్ ఆశలు ఎంతవరకూ నెరవేరుతాయన్నది అతి పెద్ద ప్రశ్న. పవన్ కి అయితే ఈ రోజుకీ ఏపీలో బీజేపీ టీడీపీ జనసేన కూటమిగానే పోటీకి వెళ్లాలని ఉంది. 2014 పొత్తుని రిపీట్ చేయాలని ఉంది.

అది కాదు అని టీడీపీ అనుకుంటే కాంగ్రెస్ కమ్యూనిస్టులతో కలసి వెళ్దామంటే అపుడు పవన్ స్టాండ్ ఏంటి అన్నది కూడా చూడాలి. ఏది ఏమైనా మోడీ ప్రధాని కావాలన్నది పవన్ కోరిక. మరి టీడీపీ దీని మీద ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది తేలినపుడే ఏపీ రాజకీయాలలో కీలక మలుపులు ఉంటాయని అంటున్నారు.