Begin typing your search above and press return to search.

జనసేన మిత్రపక్షమేనా ?

రాష్ట్రంలో మిత్రపక్షాలు ఉన్నాయంటే అవి బీజేపీ, జనసేన మాత్రమే. వాటి మధ్య ఎంత సఖ్యత ఉంది అన్నది అనవసరం

By:  Tupaki Desk   |   25 Aug 2023 6:44 AM GMT
జనసేన మిత్రపక్షమేనా ?
X

రాష్ట్రంలో మిత్రపక్షాలు ఉన్నాయంటే అవి బీజేపీ, జనసేన మాత్రమే. వాటి మధ్య ఎంత సఖ్యత ఉంది అన్నది అనవసరం. నిజంగానే అవి మిత్రపక్షాలుగా వ్యవహరిస్తున్నాయా అన్నది కూడా అప్రస్తుతమే. ఎవరు అవునన్నా కాదన్నా ఆ రెండు పార్టీలు మిత్రపక్షాలే అన్నది వాస్తవం. అయితే కొత్తగా బీజేపీ అధ్యక్షురాలైన దగ్గుబాటి పురందేశ్వరి మాత్రం పదేపదే మిత్రపక్షం జనసేన..మిత్రపక్షం జనసేన అని అంటున్నారు. మిత్రపక్షం జనసేనతో కలిసి పనిచేద్దాం, మిత్రపక్షం జనసేనతోనే కలిసి ఎన్నికలను ఎదుర్కొంటామని ఎందుకు చెబుతున్నారో అర్ధంకావటంలేదు.

జనసేన మిత్రపక్షమన్న విషయాన్ని పురందేశ్వరి పదేపదే ప్రస్తావిస్తుండటంతోనే అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. బీజేపీ, జనసేనలు మిత్రపక్షాలు కావని ఎవరైనా అనుకుంటున్నారా లేకపోతే అనుమాన పడుతున్నారా అని పురందేశ్వరిలో అనుమానాలు పెరిగిపోతున్నట్లున్నాయి. అందుకనే మాటకి ముందుకొసారి తర్వాత మరోసారి జనసేన తమ మిత్రపక్షమే అని పార్టీ నేతలతో పాటు మామూలు జనాలకు కూడా గుర్తుచేస్తున్నట్లున్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే గతంలో కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజులు అధ్యక్షులుగా పనిచేసినపుడు జనసేన జపం చేయలేదు. సమయం, సందర్భం వచ్చినపుడు మాత్రమే మిత్రపక్షం జనసేన అని ప్రస్తావించేవాళ్ళు. నిజానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏనాడూ బీజేపీని మిత్రపక్షంగా చూడలేదు. ఎందుకంటే పార్టీ సమావేశాల్లో మాట్లాడినా, బహిరంగసభల్లో మాట్లాడినా బీజేపీ ప్రస్తావన పొరబాటున కూడా తెచ్చేవారు కాదు. ఎంతసేపు తన పార్టీగురించి మాత్రమే పవన్ మాట్లాడేవారు.

రెండుపార్టీలు కూడా మిత్రపక్షాలుగా వ్యవహరించింది కూడా చాలా తక్కువ సందర్భాల్లోనే. స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కూడా రెండుపార్టీలు దేనికదే అన్నట్లుగా వ్యవహరించాయి. ఇంకా విచిత్రం ఏమిటంటే బీజేపీతో పొత్తులో ఉంటూనే టీడీపీకి జనసేన సహకరించింది. కొన్ని ఊర్లలో టీడీపీతో కలిసే జనసేన పోటీచేసింది. ఈమధ్యనే జరిగిన శాసనమండలి గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిని గెలిపించమని పవన్ పొరబాటున కూడా అడగలేదు. రెండు పార్టీల మధ్య ఇన్ని విభేదాల నలుగుతున్న సమయంలో పురందేశ్వరి అధ్యక్షురాలిగా అపాయింటయ్యారు. కారణాలు ఏవైనా కానీండి ఇపుడు పురందేశ్వరి పదేపదే జనసేన మిత్రపక్షమే అని వ్యవహరిస్తుండటంతోనే అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి.