Begin typing your search above and press return to search.

గాజువాక మీద పవన్ మనసు పడ్డారా...?

పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అంటే చెప్పడానికి పది సీట్లు అయినా కళ్ల ముందు కనిపిస్తాయి

By:  Tupaki Desk   |   14 Aug 2023 8:19 AM GMT
గాజువాక మీద పవన్ మనసు పడ్డారా...?
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అంటే చెప్పడానికి పది సీట్లు అయినా కళ్ల ముందు కనిపిస్తాయి. అనంతపురం నుంచి తిరుపతి నుంచి మొదలెడితే కాకినాడ రూరల్, పిఠాపురం, తాడేపల్లిగూడెం, భీమవరం వంటివి కూడా ఉన్నాయి. ఇక 2019లో పవన్ పోటీ చేసి ఓడిన విశాఖలోని గాజువాక సీటు కూడా ఆ జాబితాలో ఉంటుంది.

అయితే పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్నది మాత్రం ఈ రోజు దాకా మనసులో మాటను ఎక్కడా బయటపెట్టలేదు. తాజాగా ఆయన విశాఖ జిల్లాలో వారాహి మూడవ విడత యాత్రను చేస్తున్నారు. ఈ సందర్భంగా గాజువాకలో పవన్ పర్యటించినపుడు అద్భుతమైన జన స్పందన లభించింది. దాంతో ఓడినా కూడా తనకు ఇంత పెద్ద ఎత్తున ఘన స్వాగతం లభించడం కంటే ఆనందం వేరొకటి లేదని అన్నారు.

అసలు 2019లో తనను ఎందుకు ఓడించారో అని కూడా మధనపడ్డారు. పవన్ కళ్యాణ్ గాజువాకలో కిక్కిరిసిన జన సందోహం మధ్య సభను నిర్వహించారు. ఈ సందర్భంగా తనను గెలిపించి ఉంటే ప్రజలకు ఎంతో మేలు జరిగి ఉండేదని అన్నారు. గెలిచిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏమి చేస్తున్నారు అని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే జనసేనకు విరగబడి జనాలు గాజువాకకు రావడంతో పవన్ లో ఆనందం వెల్లి విరిసిందింది.

2019లో ఓటమి లభించింది కానీ 2024లో మాత్రం కచ్చితంగా తాము గెలిచి తీరుతామని అన్నారు. ఈసారి ఎన్నికల్లో గాజువాక జనసేన సొంతం అయి తీరుతుందని చెప్పుకొచ్చారు. గాజువాకలో జనసేన పోటీ చేస్తుందని చెప్పేశారు. మరి జనసేన తరఫున ఎవరు పోటీ చేస్తారు అన్నది అయితే ఆయన చెప్పలేదు. పవన్ కళ్యాణ్ నే మళ్లీ పోటీ చేయమని పార్టీ క్యాడర్ కోరుతోంది.

ఓడిన చోటనే గెలిచి ప్రత్యర్ధుల నోళ్ళు మూయించాలన్నది జనసేన నాయకుల ఆలోచన. అదే విధంగా పవన్ కనుక గాజువాక నుంచి పోటీ చేస్తే ఉత్తరాంధ్రా జిల్లాలలో జనసేనకు అది ఎంతో బలంగా సానుకూలంగా ఉంటుందని అంటున్నారు. అయితే పవన్ మనసులో కూడా గాజువాక ఉందని అంటున్నారు. సరైన సమయంలోనే ఆయన తన అభిప్రాయాన్ని బయటపెడతారు అని అంటున్నారు.

మరో వైపు చూస్తే 2019 ఎన్నికల ముందు గాజువాకలో జనసేనకు 95 వేల సభ్యత్వం ఉంది. దాంతో అది బలమైన సీటుగా భావించి పోటీ చేశారు. అయితే సభ్యత్వం తీసుకున్న వారు అంతా ఓటేయరని ఆ తరువాత అర్ధం అయింది. ఇపుడు కూడా పవన్ సభలకు జనాలు విరగబడి వస్తున్నారు అలా వచ్చిన వారు అంతా ఓటేస్తారా లేదా అన్నది కూడా ఆలోచించుకోవాల్సి ఉందని అంటున్నారు. ఏది ఏమైనా గతంతో పోలిస్తే జనసేన గ్రాఫ్ బాగా పెరిగింది. అదే టైం లో ఇదే గాజూవాకలో టీడీపీకి వైసీపీకి బలమైన ఓటింగ్ ఉంది. దాంతో పవన్ 2024లో పొత్తులతో పోటీ చేస్తారా లేక విడిగా బరిలోకి దిగుతారా అన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు.