Begin typing your search above and press return to search.

ఫస్ట్ టైం టీడీపీ మీద పవన్ విమర్శలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాలుగేళ్ళ తరువాత మొదటి సారి తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు చేశారు.

By:  Tupaki Desk   |   6 Aug 2023 7:06 PM IST
ఫస్ట్ టైం టీడీపీ మీద పవన్ విమర్శలు
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాలుగేళ్ళ తరువాత మొదటి సారి తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు చేశారు. అయితే అవి కూడా మెత్త మెత్తగానే. ఎందుకంటే ఇష్యూ అలాంటిది. అది టీడీపీ హయాంలోనే పుట్టింది. కాబట్టి ఆ పార్టీ ప్రభుత్వాన్ని ప్రస్తావించక తప్పలేదు. అందుకే పవన్ టీడీపీ మీద మంద్ర స్వరంతో విమర్శలు చేశారు. ఇదంతా ఎక్కడ అంటే క్రిష్ణా జిల్లాలో బాపులపాడు మండలం మల్లపల్లి పారిశ్రామికవాడ నిర్వాసిత రైతులతో పవన్ కళ్యాణ్ నిర్వహించిన సమావేశంలో జరిగింది.

పవన్ కళ్యాణ్ బాపులపాడు మండలం మల్లపల్లిలో పర్యటించి రైతుల సమస్యలను పూర్తిగా విన్నారు. ఈ సందర్భంగా రైతులు తమకు న్యాయం జరగలేదని మొత్తం కధను ఏకరువు పెట్టారు. దాంతో పవన్ వారిని ఓదారుస్తూ గత టీడీపీ ప్రభుత్వం మీద కూడా కొన్ని కామెంట్స్ చేయాల్సి వచ్చింది.

తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు 2016లో ఇక్కడ రైతుల నుంచి భూములను తీసుకున్నారని, అయితే నష్ట పరిహారం మాత్రం కొంతమంది రైతులకే ఇచ్చారని విమర్శించారు. సమస్య ఆనాడే మొదలైంది అని పవన్ పేర్కొన్నారు. రైతులను కులాల వారీగా విమర్శిస్తారా ఒక కులం వారికే పరిహారం చెల్లిస్తారా ఇదెక్కడి న్యాయం అంటూ పవన్ గట్టిగానే నిగ్గదీశారు.

అంటే గత ప్రభుత్వం రైతులను కులాల వారీగా విభజించి చూసిందని పవన్ విమర్శించారు అన్న మాట. ఇది నిజంగా టీడీపీ ఆలోచిస్తే ఘాటు విమర్శగానే చూడాలి. అయితే పవన్ టీడీపీతో వైసీపీని కూడా కలిపారు. వైసీపీ ప్రభుత్వం కూడా రైతులను కులాల వారీగా చూస్తూ ఒక కులం వారికే పరిహారం ఇస్తోందని మండిపడ్డారు. దయచేసి రైతులను కులాల వారీగా విభజించవద్దు అంటూ ఆయన జనరలైజ్ చేస్తూ కామెంట్స్ చేశారు.

ఇక టీడీపీ మీద పవన్ ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేశారు. 2013లో భూ సేకరణ చట్టం ప్రకారం రైతులకు పరిహారం చెల్లించాల్సి ఉండగా మల్లపల్లిలో అలా జరగలేదు అని అన్నారు. అధికారులు సైతం నిబంధలను పాటించకపోతే ఎలా అని పవన్ ప్రశ్నించారు. ప్రభుత్వం చెప్పిందని రైతులకు అన్యాయం చేయవద్దు అని పవన్ స్పష్టం చేశారు.

మల్లపల్లి రైతుల కష్టాలు తనకు కన్నీళ్ళు తెప్పించాయని పవన్ అంటూ రైతులను కులాల వారీగా చూడవద్దు అని టీడీపీకి విజ్ఞప్తి చేస్తున్నాను అని చెప్పడం విశేషం. రైతులలో కూడా అన్ని కులాల వారూ ఉంటారని ఆయన అన్నారు. ఒక్క కులం వల్లనే సమాజం నడవదని పవన్ అంటూ టీడీపీ కూడా మల్లపల్లి రైతులకు అండగా ఉండాలని కోరడం విశేషం.

ఇక రాజకీయంగా చూస్తే 2024లో ప్రభుత్వం కచ్చితనా మారబోతోంది అని పవన్ జోస్యం చెప్పారు. తానే చొరవ తీసుకుని మల్లపల్లి రైతులకు న్యాయం చేస్తాను అని పవన్ హామీ ఇచ్చారు. మొత్తం మీద చూస్తే పవన్ కళ్యాణ్ 2019లో ఓడిన తరువాత టీడీపీ మీద ఈ రోజు వరకూ ఒక్క విమర్శ కూడా చేయలేదు. ఆయన ఎంతసేపూ వైసీపీ మీదనే ఘాటు కామెంట్స్ చేస్తూ వస్తున్నారు.

సమస్యలు దశాబ్దాలుగా సుదీర్ఘ కాలం నుంచి ఉన్నా వాటిని కేవలం నాలుగేళ్ళ వైసీపీ పాలనకే పరిమితం చేస్తూ పవన్ పలు సందర్భాల్లో మాట్లాడారు. కానీ మొదటి సారి మాత్రం మల్లపల్లి ఇష్యూలో ఆయన అలా మాట్లాడాల్సి వచ్చింది. ఎందుకంటే భూములు రైతుల నుంచి తీసుకున్నది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, వారికి అలా అన్యాయం జరిగింది.

అయితే ఇక్కడ కూడా పవన్ ఘాటుగా మాట్లాడకుండా సుతిమెత్తగానే టీడీపీని విమర్శించారు. అంతే కాదు మల్లపల్లి రైతుల సంసయల మీద కలసి పనిచేద్దామని కూడా కోరడం విశేషం. మొత్తానికి చూస్తే పవన్ టీడీపీని పూలతో సుతిమెత్తగా కొట్టారని అంటున్నారు.

అయితే ఇది ఆరంభం కాదు కదా అన్న చర్చ కూడా మరో వైపు సాగుతోంది. ఎందుకంటే జనసేనకు మొదటి ప్రత్యర్ధి వైసీపీ అనుకుంటే టీడీపీ కూడా ఆ తరువాత వరసలో ఉంటుంది. మరి పవన్ ఆలోచనల బట్టి రానున్న రోజులలో టీడీపీ మీద విమర్శల జోరు పెంచవచ్చేమో. దానికి బహుశా ఇది సంకేతం అవుతుందేమో.చూడాలని అంటున్నారు.