Begin typing your search above and press return to search.

అమిత్ షాతో పవన్ కీలక భేటీకి కౌంట్ డౌన్...!

కేంద్ర హోం మంత్రి బీజేపీ పెద్ద అయిన అమిత్ షా తో పవన్ కళ్యాణ్ కీలక భేటీని వేయబోతున్నారు. దానికి ముహూర్తం కుదిరింది అని అంటున్నారు

By:  Tupaki Desk   |   24 Oct 2023 11:31 AM GMT
అమిత్ షాతో పవన్ కీలక భేటీకి కౌంట్ డౌన్...!
X

కేంద్ర హోం మంత్రి బీజేపీ పెద్ద అయిన అమిత్ షా తో పవన్ కళ్యాణ్ కీలక భేటీని వేయబోతున్నారు. దానికి ముహూర్తం కుదిరింది అని అంటున్నారు. ఈ నెల 27న హైదరాబాద్ కి అమిత్ షా వస్తున్నారు. తెలంగాణా ఎన్నికల ప్రచారానికి వస్తున్న అమిత్ షాను హైదరాబాద్ లోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయి అనేక అంశాలు చర్చిస్తారు అని అంటున్నారు.

తెలంగాణా ఎన్నికల్లో జనసేన పోటీ చేయాలని చూస్తోంది. ఏకంగా 32 సీట్లకు పోటీ పెట్టాలని చూసింది. దానికి సంబంధించిన లిస్ట్ ని రెడీ చేసింది. అయితే ఇంతలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఇద్దరూ పవన్ని కలసి జనసేన మద్దతు కోరారు. అయితే ఈ సమయంలో తమ పార్టీ పోటీ చేయకపోతే ఇబ్బందులు వస్తాయని పవన్ చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి.

దాంతో పొత్తులో భాగంగా బీజేపీ జనసేనకు కొన్ని సీట్లు కేటాయిస్తుందని ప్రచారం సాగుతోంది. ఈ విషయాల మీద మాట్లాడడానికే అమిత్ షా తో పవన్ కళ్యాణ్ భేటీ అవుతారని అంటున్నారు. మరి పొత్తుల విషయం మాత్రమే ఈ ఇద్దరు మధ్యన చర్చకు వస్తుందా లేక ఏపీ పాలిటిక్స్ కూడా చర్చకు వస్తుందా అన్నది చూడాల్సి ఉంది. ఏపీలో టీడీపీతో జనసేన పొత్తు చాలా దూరం వెళ్లిపోయింది. రెండు పార్టీలు కో ఆర్డినేషన్ కమిటీలను వేసి మరీ తొలి భేటీని నిర్వహించాయి. ఉమ్మడి ఎన్నికల ప్రణాళికను కూడా సిద్ధం చేస్తున్నాయి.

ఇక మీదట రెండు పార్టీలు ఏపీలో కలసి ముందుకు సాగాలని డిసైడ్ అయ్యాయి. అయితే ఈ సందర్భంగా జరిగిన మీడియా మీటింగులో పవన్ కళ్యాణ్ తాను ఇప్పటికీ ఎన్డీయేలో ఉన్నానని స్పష్టం చేశారు. అంటే బీజేపీకి మిత్రుడుగానే ఉన్నారన్న మాట. బీజేపీతో ఏపీలో మిత్రుడిగా ఉంటూ తెలంగాణాలో ఆ పార్టీతో పొత్తుల దిశగా అడుగులు వేస్తూ ఏపీలో టీడీపీతో జనసేన పొత్తు కలిపింది.

ఏపీలో కానీ తెలంగాణాలో కానీ చూస్తే టీడీపీతో బీజేపీకి ఎలాంటి పొత్తు లేదు, స్నేహం లేదు. మరి పవన్ మాత్రం బీజపీతో టీడీపీతో రెండింటితో ఉంటున్నారు. దీని మీద కూడా అనేక డౌట్లు ఉన్నాయి. ఏపీలో టీడీపీతో పొత్తుకు బీజేపీ సుముఖమేనా లేక దూరంగా ఉంటుందా అన్నది చూడాలని అంటున్నారు. కేవలం తెలంగాణా ఎన్నికల కోసమే టీడీపీని దూరం పెట్టారా అన్నది మరో చర్చ.

అదే అనుకుంటే జనసేనను పొత్తుల పేరుతో దగ్గరకు తీయరు కదా. ఒకవేళ తీసినా సీట్ల సర్దుబాటు చేసుకుని సీట్లు ఇచ్చేలా కూడా ఆలోచించరు కదా అన్నది మరో సందేహం. ఏది ఏమైనా జనసేన ఈ విధంగా ఒకే సమయంలో రెండు పార్టీలతో పొత్తు పెట్టుకుని కన్ ఫ్యూజ్ చేస్తోందా లేక ఈ కన్ ఫ్యూజ్ ఒక వ్యూహంగా ఉందా అన్నది చర్చకు వస్తోంది.

అంతే కాదు ఈ కన్ ఫ్యూజ్ కూడా ఒక వ్యూహమేనా అన్నది కూడా కావచ్చు అని అంటున్నారు. అలా అనుకుంటే ఆ వ్యూహం వెనక ఎవరున్నారు, పవన్ వెనక బీజేపీ ఉండి ఇదంతా నడిపిస్తోందా అన్నది కూడా చర్చగా ఉంది. ఏది ఏమైనా అమిత్ షా చంద్రబాబు తో ఈ ఏడాది మధ్యలో భేటీ అయ్యారు. తాజాగా బాబు కొడుకు లోకేష్ కి కూడా అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇంకో వైపు పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకున్నా ఆయనకు కూడా అపాయింట్మెంట్ ఇచ్చేలాగానే సీన్ ఉంది.

లేకపోతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పవన్ వద్దకు వెళ్లారు కదా అంటున్నారు. మొత్తంగా చూస్తూంటే రెండు తెలుగు రాష్ట్రాలలో బీజేపీ మాస్టర్ ప్లాన్ ఏదో ఉందని, పవన్ని ముందు పెట్టి అంతా చేస్తోంది అని అంటున్నారు. అమిత్ షా పవన్ భేటీ తరువాత ఏమి జరుగుతుంది అన్న దానిని బట్టి ఈ వ్యూహాలు తెర వెనక ఎత్తులు కసరత్తులూ తెలిసే అవకాశం ఉంది అంటున్నారు.