Begin typing your search above and press return to search.

వారాహి ముగిసింది.. ప్ర‌శ్న‌లే మిగిలాయి!!

ఏ పార్టీకైనా ఎన్నిక‌ల‌కు ముందు... క్లారిటీ అవ‌స‌రం. ఈవిష‌యంలో ఏ చిన్న పొర‌పాటు చేసినా.. ప్ర‌జ‌ల్లో స‌రైన సంకేతాలు వెళ్ల‌డం చాలా క‌ష్టం.

By:  Tupaki Desk   |   16 July 2023 4:03 AM GMT
వారాహి ముగిసింది.. ప్ర‌శ్న‌లే మిగిలాయి!!
X

ఏ పార్టీకైనా ఎన్నిక‌ల‌కు ముందు... క్లారిటీ అవ‌స‌రం. ఈవిష‌యంలో ఏ చిన్న పొర‌పాటు చేసినా.. ప్ర‌జ‌ల్లో స‌రైన సంకేతాలు వెళ్ల‌డం చాలా క‌ష్టం. ఇప్పుడు జ‌న‌సేన విష‌యంలోనూ ఇదే జ‌రుగుతోంది. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన ప్ర‌చారం.. రాజ‌కీయం ఒక ఎత్త‌యితే.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి.. ఆయ‌న ఇప్పుడు చేసిన వారాహి యాత్ర‌లు అత్యంత కీల‌కం. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌న‌సేన‌పై ఉన్న అపోహ‌లు, సందేహాల‌కు తెర‌దించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉందని, ఈ దిశ‌గానే వారాహి యాత్ర సాగుతుంద‌ని ఆ పార్టీ నాయ‌కులు స‌హా మేధావులు సైతం అంచ‌నా వేసుకున్నారు.

ప్ర‌జ‌ల‌ను మ‌రింత ఎక్కువ‌గా పార్టీవైపు తిప్పుతార‌ని.. వారిలో నెల‌కొన్న అనుమాన‌పు మేఘాల‌ను ప‌టాపంచ‌లు చేస్తార‌ని కూడా జ‌న‌సేన నేత‌లు ఎక్కువగానే ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే.. అంద‌రూ అనుకున్న విధంగా ప‌వ‌న్ వ్య‌వ‌హ‌రించ లేద‌నే టాక్ వినిపిస్తోంది. ప్ర‌స్తుతం తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో వారాహి 1.0, 2.0 యాత్ర‌లు ముగిశాయి. గ‌తంలో ఆయన ఎలా వ్య‌వ‌హ‌రించారో.. ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించారని ఈ యాత్ర‌లు ప‌రిశీలించిన వారు చెబుతున్నారు. ముఖ్యంగా పొత్తుల విష‌యంలో ప‌వ‌న్ ఇంకా క్లారిటీ ఇవ్వ‌లేక పోయారు..

కొంత సేపు పొత్తులు అవ‌స‌రం అని చెబుతూనే.. మ‌రోవైపు.. ఒంట‌రిగానే గెలుపు గుర్రం ఎక్కేందుకు ప్ర‌య‌త్నిస్తామని.. చెప్పుకొ చ్చారు. ఇది.. మ‌రోసారి ప్ర‌జ‌ల‌ను, పార్టీ నేత‌ల‌ను కూడా అయోమ‌యంలోకి నెట్టేసింది. ఇక‌, ఇంకో వైపు.. తాను సీఎం అవుతాన‌ని.. ప్ర‌జ‌లు ఆశీర్వ‌దించాల‌ని పిఠాపురం స‌భ‌లో చెప్పుకొచ్చారు. దీనికి ముందు నిర్వ‌హించిన స‌భ‌లో క‌నీసం త‌న‌ను ఎమ్మెల్యే అయినా.. చేయాల‌ని.. తాను ఒక్క‌డిని గెలిచినా.. చాల‌ని వ్యాఖ్యానించారు. ఇలాంటి త‌డ‌బాటు వ్యాఖ్య‌ల‌తో జ‌న‌సేన అధినేత ప్ర‌జల‌కు ఎలాంటి సందేశం ఇస్తున్నార‌నేది ఇప్పుడు మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

ఇక‌, ప‌శ్చిమ‌గోదావ‌రిలో చేప‌ట్టి వారాహి 2.0 యాత్ర మొత్తం దారి త‌ప్పేసింద‌నే వాద‌న ఒక‌వైపు.. కాదు చాలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించార‌ని మ‌రోవైపు చ‌ర్చ‌సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను టార్గెట్ చేయ‌డం ద్వారా.. వైసీపీని డిఫెన్స్‌లో ప‌డేయాల‌ని ప‌వ‌న్ భావించారు. అంతేకాదు, దీనివ‌ల్ల వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌పై ఏదో చేయాల‌ని అనుకున్న‌ట్టు చ‌ర్చ సాగింది. అయితే.. ఇవేవీ జ‌ర‌గలేదు.పైగా దీనిని వైసీపీ త‌న‌కు అనుకూలంగా మార్చుకుని ప‌వ‌న్‌ను ఇరికించేసింది. దీంతో వారాహి 2.0లో కూడా.. ప‌వ‌న్ త‌న ల‌క్ష్యం.. త‌న ఉద్దేశం.. పార్టీకి దిశానిర్దేశం వంటివి ఏమీ చేయ‌కుండానే ముగించారు. ఇలాంటివే ఇక ముందు కూడా కొన‌సాగితే.. వైసీపీకి ల‌బ్ధి చేకూర్చ‌డం త‌ప్ప‌.. ప‌వ‌న్ యాత్ర‌ల‌తో ఫ‌లితం లేద‌ని ప‌రిశీల‌కులు గ‌ట్టిగానే చెబుతున్నారు.