Begin typing your search above and press return to search.

నాదెండ్ల మనోహర్‌ అరెస్టు... పవన్ డిమాండ్ ఇదే!

ఈ సమయంలో వారికి మద్దతుగా నాదెండ్ల మనోహర్ నోవాటెల్‌ హోటల్‌ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో ఆయన్ను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌ కు తరలించారు.

By:  Tupaki Desk   |   11 Dec 2023 12:20 PM
నాదెండ్ల మనోహర్‌  అరెస్టు... పవన్  డిమాండ్  ఇదే!
X

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. విశాఖలోని టైకూన్‌ కూడలి నుంచి వీఐపీ రోడ్డు వైపు వెళ్లే మార్గాన్ని మూసివేయడంపై జనసేన ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ సమయంలో వారికి మద్దతుగా నాదెండ్ల మనోహర్ నోవాటెల్‌ హోటల్‌ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో ఆయన్ను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌ కు తరలించారు.

అవును... విశాఖలో నాదెండ్ల మనోహర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకు ముందు ఈ విషయాలపై స్పందించిన ఆయన... వీఐపీ రోడ్డు వైపు వెళ్లే మార్గాన్ని మూసివేయడం వల్ల ప్రయాణికులు సుమారు 2 కి.మీ మేర అదనంగా వెళ్లాల్సి వస్తుందని అన్నారు. విశాఖ ఎంపీకి చెందిన నిర్మాణాలకు వాస్తు దోషం తొలగించుకోవడానికే రోడ్లు మూసివేశారని ఆరోపించారు. డివైడర్ తొలిగించే వరకు జనసేన పోరాడుతుందని తెలిపారు.

అయితే అధికారులు మాత్రం... ఇది పూర్తిగా ట్రాఫిక్ పోలీసులు, జీవీఎంసీ అధికారులు కలిసి తీసుకున్న నిర్ణయం అని చెబుతున్నారు. ఈ జంక్షన్ లో రోడ్డు మూసివేయకపోతే ఎక్కువగా ట్రాఫిక్ జాం అవుతుందని.. దారి మళ్లించడం వల్ల ట్రాఫిక్ సమస్య తగ్గిందని చెబుతున్నారు! దీనికి ఎంపీ నిర్మాణాలకూ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు. అయితే జనసేన మాత్రం... ఎంపీ నిర్మాణాల కోసమే ఈ నిర్ణయం అని ఆరోపిస్తుంది.

నాదెండ్ల అరెస్ట్ పై పవన్ రియాక్షన్:

నాదెండ్ల మనోహర్‌ అరెస్టుపై జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. విశాఖలోని టైకూన్‌ జంక్షన్‌ వద్ద రోడ్డును తెరవాలని కోరితే అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. ఆయన అరెస్టు అప్రజాస్వామికం అని.. పార్టీ శ్రేణులపై పోలీసులు వ్యవహరించిన తీరు సరైంది కాదని అన్నారు. ఈ సందర్భంగా పోలీసులకు అల్టిమేటం జారీచేశారు పవన్!

ఇందులో భాగంగా నాదెండ్ల మనోహర్ తో పాటు అరెస్టు చేసిన జనసేన నేతలు, కార్యకర్తలందరినీ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయకపోతే తాను విశాఖ వచ్చి పోరాడుతా అని హెచ్చరించారు. ఇదే సమయంలో... మరో రెండు మూడు రోజుల్లో పవన్ వీలుచూసుకుని విశాఖకు వెళ్లి ఈ రోడ్ బ్లాక్ ఇష్యూపై మరింతగా పోరాడతారని తెలుస్తుంది.