Begin typing your search above and press return to search.

నువ్వు గొప్ప.. నువ్వు ఇంకా గొప్ప!

అవును... తాజాగా జరిగిన "జెండా" సభలో పవన్ కల్యాణ్, చంద్రబాబులు పరస్పరం పొగడ్తల వర్షం కురిపించుకున్నారు. ఇందులో భాగంగా... రాష్ట్రంలో జగన్ అగ్గి రాజేశారని.

By:  Tupaki Desk   |   29 Feb 2024 4:15 AM GMT
నువ్వు గొప్ప.. నువ్వు ఇంకా గొప్ప!
X

తాడేపల్లిగూడెంలో టీడీపీ, జనసేన నిర్వహించిన "జెండా" సభలో మైకందుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ లు వైఎస్ జగన్ పై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ప్రధానంగా వైఎస్ జగన్ పై వ్యక్తిగతంగా "సైకో జగన్" అంటూ వారి ఇద్దరి ప్రసంగలు సాగడం గమనార్హం. ఇలా జగన్ పై నిప్పులు కక్కుతూ సాగిన వీరిద్దరి ప్రసంగాల్లో ఒకరినొకరు పొగుడుకొన్న విషయాలు హాట్ టాపిక్ గా మారాయి.

అవును... తాజాగా జరిగిన "జెండా" సభలో పవన్ కల్యాణ్, చంద్రబాబులు పరస్పరం పొగడ్తల వర్షం కురిపించుకున్నారు. ఇందులో భాగంగా... రాష్ట్రంలో జగన్ అగ్గి రాజేశారని.. ఇప్పుడు అదే అగ్గితో టీడీపీ, జనసేన కలిసి వైసీపీని తగలబెడతాయని చెప్పిన చంద్రబాబు... ఆ అగ్నికి పవన్ రూపంలో వాయువు తోడయ్యాడని చెప్పారు. ఇదే సమయంలో ప్రశ్నించే, ఎదురించే తత్వం ఉన్న ధీరుడు పవన్ అని అన్నారు!

ఇదే సమయంలో... పవన్‌ కల్యాణ్‌ అంటే.. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల భవిష్యత్తు, ఈ దేశపు యువత కలలు, అర్ధరాత్రి పరుగెత్తుకొచ్చే అంబులెన్స్‌, ప్రజల కన్నీళ్లు తుడిచే చేయి, ఆడబిడ్డలకు రక్షణగా చేతికి కట్టే రాఖీ, పెద్దల భుజంపై ఉండే కండవా, గర్వంతో ఎగిరే జాతీయ జెండా అంటూ పవన్ ని చంద్రబాబు కవితాత్మకంగా పొగడ్తలతొ ముంచేత్తారు.

2014లో రాష్ట్ర విభజన జరిగిన సమయంలో... ఇప్పుడు తాను ఎన్నికల్లో పోటీ చేయడం కాదు, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం అని టీడీపీ - బీజేపీ కూటమికి సహకరించారని బాబు కొనియాడారు. ఇదే సమయంలో చంద్రబాబుని ఆకాశానికి ఎత్తినంతపనిచేశారు పవన్ కల్యాణ్. ఇందులో భాగంగా... మందుపాతర పేల్చితే.. 16 అడుగుల ఎత్తుకు ఎగిరిపడినా కూడా పైకిలేచి, పదండి వెళ్తామన్న రాజకీయ దురంధరుడు చంద్రబాబు అని ప్రశంసించారు.

ఇదే సమయంలో... నవ నగరాన్ని నిర్మించిన వ్యక్తి, ఉపాధి అవకాశాలు కల్పించిన వ్యక్తి, పారిశ్రామికవేత్తల్ని రాష్ట్రానికి తీసుకువచ్చిన వ్యక్తి చంద్రబాబు అని.. ఆయన అనుభవం రాష్ట్రానికి చాలా అవసరమని పవన్ తెలిపారు. ఇదే క్రమంలో... నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ ఉద్ధండుణ్ని 53 రోజులు జైల్లో పెడితే తనకు చాలా బాదేసిందని పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధంగా జెండా సభలో పవన్ కల్యాణ్, చంద్రబాబులు ఒకరినొకరు పొగుడుకున్నారు.