వైసీపీ నుంచే వాటా కోరుతున్న పవన్ !
జనసేన అధినేతగా పదేళ్ల రాజకీయ ప్రస్థానం తరువాత పవన్ వ్యూహాలు అదుర్స్ అన్నట్లుగానే 2024 ఎన్నికల్లో కనిపించింది.
By: Tupaki Desk | 11 April 2025 5:00 AM ISTఏపీలో టీడీపీ కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించి పోటీ చేసిన 21 సీట్లలోనూ సెంట్ పర్సెంట్ స్టైక్ రేటుని సాధించి 2024 ఎన్నికల్లో మాన్ ఆఫ్ ది మ్యాచ్ గా పవన్ నిలిచిన సంగతి తెలిసిందే. జనసేన అధినేతగా పదేళ్ల రాజకీయ ప్రస్థానం తరువాత పవన్ వ్యూహాలు అదుర్స్ అన్నట్లుగానే 2024 ఎన్నికల్లో కనిపించింది.
తన బలాన్ని గుర్తించి అక్కడ పెంచుకుంటూ తన కార్యక్షేత్రాన్ని ఎక్కడ విస్తరించాలో అక్కడ విస్తరించుకుంటూ ముందుకు సాగడమే జనసేనాని అజెండాగా ఉంది అని అంటున్నారు ఏపీలో చూస్తే 2024 ఎన్నికలు భిన్నమైన తీరులో సాగాయి. వైసీపీ పట్ల వెల్లువలా వ్యతిరేకత తీవ్రం కావడంతో ఆఖరుకు రాయలసీమలోనూ ఆ పార్టీకి సీట్లు దక్కలేదు.
అయితే ఈ రోజుకీ రాయలసీమలో వైసీపీకి బలం ఉంది. హార్డ్ కోర్ రీజియన్ వైసీపీకి అన్నది రాజకీయ విశ్లేషణ. అదే విధంగా వైసీపీకి సంప్రదాయ ఓటు బ్యాంక్ గా ఎస్టీ ఎస్టీలు ఉన్నారు. వీరంతా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ గా ఉంటూ వచ్చారు.
వైసీపీ ఏర్పాటుతో వారిని తన వైపు తిప్పుకుంది. అందుకే ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో అయినా వైసీపీకి 40 శాతం ఓటు షేర్ దక్కుతోంది అంటే కనుక అది ఈ వర్గాల నుంచి దక్కుతున్న మద్దతుగానే అంతా చూస్తున్నారు ఈ నేపథ్యంలో వైసీపీ ఓటు బ్యాంక్ కి చిల్లు పెట్టడానికి పవన్ పదునైన వ్యూహాన్నే సిద్ధం చేశారు అని అంటున్నారు
వైసీపీకి ఉన్న ఎస్టీ ఓటు బ్యాంక్ ని తన వైపు తిప్పుకుంటే ఏపీలో జనసేన బలం మరింతగా విస్తరించేందుకు అవకాశం ఏర్పడుతుందని ఆయన తలపోస్తున్నారు. అదే సమయంలో ఏపీలో వచ్చే ఎన్నికల్లో మరిన్ని సీట్లు అదనంగా కోరి అందులో కూడా సెంట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించేందుకు వీలు కలుగుతుందని భావిస్తున్నారు.
అందుకే ఆయన తరచూ ఎస్టీ నియోజకవర్గాలలో పర్యటిస్తున్నారు అని అంటున్నారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ బాధ్యతలు తీసుకోగానే పాలకొండ వెళ్ళారు. అలాగే పార్వతీపురం వెళ్ళారు, ఇక పాడేరులో గత డిసెంబర్ లో పర్యటించి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే తాజాగా ఆయన రెండు రోజుల పాటు అరకులో పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన గిరిజనులతో మమేకం అయ్యారు. సాధారణంగా గిరిజనం తమ వద్దకు వచ్చిన వారిని ఆదరించి గుండెలలో పెట్టుకుంటారు వారు ఒకసారి అభిమానించారు అంటే అది తిరుగులేనిది. అందుకే జగన్ పట్ల తమ అభిమానాన్ని ప్రతీ ఎన్నికల్లో చూపిస్తూ వస్తున్నారు. 2014 నుంచి 2024 వరకూ వరసగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గిరిజనం వైసీపీనే ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా గెలిపించారు.
అలాంటి చోట రాజకీయం మార్చాలని పవన్ చూస్తున్నారు ఇక్కడ పట్టు సాధిస్తే జనసేన బలం పెరుగుతుంది, టీడీపీకి కూడా ఇబ్బంది ఉండదని ఆయన భావిస్తున్నారు. నిజానికి జనసేనకు ఉత్తరాంధ్రాలో చాలా చోట్ల బలం పెరిగే చాన్స్ ఉంది. ఆ పార్టీకి బలమైన సామాజిక వర్గం దన్నుగా నిలిచే పరిస్థితి ఉంది.
కానీ ఉత్తరాంధ్రలో టీడీపీకి కూడా పట్టు ఉంది. దాంతో టీడీపీకి బలమైన స్థావరాల జోలికి పోకుండా వ్యూహాత్మకంగానే వైసీపీ సీట్ల మీదనే ఫోకస్ పెట్టారని అంటున్నారు. అలా తమ బలాన్ని విస్తరించుకునేందుకు వైసీపీ నుంచే ఆయన వాటా కోరుతున్నారని అంటున్నారు.
ఇక ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ రాయలసీమలో సైతం తరచూ పర్యటిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో అక్కడ వైసీపీ బలంగా పుంజుకోకుండా ముందుగానే చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. అక్కడ కూడా బలమైన సామాజిక వర్గం జనసేనకు అండగా నిలుస్తోంది. దాంతో ఆ వర్గం ఆసరాతో వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లలో పోటీ చేయాలని జనసేన చూస్తోంది.
ఈ విధంగా కూటమిలో పెద్దన్న టీడీపీని నొప్పించకుండా తాను బలపడుతూ వైసీపీ ఓటు బ్యాంక్ కి అలాగే సీట్లకు చిల్లు పెట్టేలా జనసేన ఉభయ తారకమంత్రం రాజకీయాన్ని అమలు చేస్తోంది అని అంటున్నారు. మరి ఇది కనుక ఫలిస్తే మాత్రం వైసీపీకి భారీ షాక్ తప్పదని అంటున్నారు.
