'ఆ గిల్ట్ తోనే మాల వేసుకుని'... పవన్ కీలక వ్యాఖ్యలు!
అవును... తాజాగా జనసేన నాయకులతో మాట్లాడుతూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
By: Raja Ch | 5 Feb 2026 5:18 PM ISTఏపీ రాజకీయాల్లో తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం అత్యంత హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. తిరుమల లడ్డులో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, పిష్ ఆయిల్ వాడారంటూ తెరపైకి వచ్చిన సంచలన ఆరోపణలు.. తాజాగా సిట్ వివరణ అనంతరం వైసీపీ పాప ప్రక్షాళన పూజలు చేయడం, ఈ సందర్భంగా పలు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం తెలిసిందే. ఈ సమయంలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను నాడు మాల ఎందుకు వేసుకుందీ వెల్లడించారు.
అవును... తాజాగా జనసేన నాయకులతో మాట్లాడుతూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా.. తిరుమల లడ్డూలో అడల్ట్రేషన్ జరిగిందని తాను చెప్పానని అన్నారు. తాను, మనోహర్ చాలాసార్లు తిరుమలకు వెళ్లినప్పుడు.. అక్కడ లడ్డూలో కల్తీ జరుగుతుందని తమకు చెప్పారని.. ఆ గిల్ట్ తోనే తాను నాడు మాల వేసుకుని ప్రక్షాళన చేసుకున్నట్లు తెలిపారు. అంతేతప్ప తాను మాలవేసుకున్నది డ్రామా చేయడానికి కాదని అన్నారు.
తాను నాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ గురించీ ఏమీ అనలేదని.. దగ్గరుండి కల్తీ చేయండి అని ఆయన చెప్పలేదని.. బుద్ది ఉన్నవాళ్లు ఎవరూ అలాంటివి చేయరని పవన్ స్పష్టం చేశారు. తాజాగా సిట్ రిపోర్ట్ ఇంత క్లియర్ గా చెబుతుంటే.. దాని గురించి ఎవరూ మాట్లాడటం లేదని పవన్ అన్నారు. ఇదే క్రమంలో... నెయ్యిలో నెయ్యి లేదని సిట్ తెలిపిందని వెల్లడించారు.
ఇదే క్రమంలో సీఎం చంద్రబాబు నివాసంలో కూటమి నేతల కీలక భేటీ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలోనూ మాట్లాడిన పవన్... గత ప్రభుత్వ హయాంలో జరిగిన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో దోషులను వదిలిపెట్టబోమని తెలిపారు. తప్పు జరిగినప్పుడు క్షమాపణ చెప్పాల్సింది పోయి.. తిరిగి తమపైనే దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఇక్కడితో ఆగదని పవన్ తెలిపారు.
అదేవిధంగా... లడ్డూ తయారీలో నెయ్యి వాడలేదని అన్ని నివేదికల్లోనూ తేటతెల్లమైందని.. అంతే తప్ప వైసీపీ నేతలకు క్లీన్ చీట్ ఏ నివేదికా ఇవ్వలేదని.. అందులో పందికొవ్వు, పిష్ ఆయిల్ ఉండే అవకాశాలున్నాయని చెప్పారని అన్నారు. కళ్ల ముందు ఆధారాలు ఉన్నప్పటికీ మాట్లాడకపోతే ఎలా అని ప్రశ్నించిన పవన్... వైసీపీ నేతలు అడ్డగోలుగా మాట్లాడితే సరిపోతుందా అని నిలదీశారు! ఈ సందర్భంగా ఏడు కొండల వాడికి వైసీపీ నేతలు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమాపణలు చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు.
ఇదే సమయంలొ.. వైసీపీ హయాంలో రాష్ట్రంలో సుమారు 200కు పైగా మత సంబంధిత ఘటనలు చోటు చేసుకున్నాయని.. తిరుమల లడ్డూలో ఫిష్ ఆయిల్ ఉన్నట్లు నివేదికలు రావడం అత్యంత ఆందోళనకరమని అన్నారు. సాధారణంగా వ్యక్తులు, వర్గాలపై కక్షలు ఉంటాయి కానీ.. వైసీపీ నేతలు మాత్రం ఏకంగా భగవంతుడిపైనే పగ పెట్టుకున్నారని పవన్ విమర్శించారు. దేవుడి ముందు వారు మోకరిల్లే వరకూ తమ యుద్ధం ఆగదని అన్నారు.
