విశాఖ అంటే పవన్ కి ఆ రెండేనట !
సినీ జీవితాన్ని ప్రసాదించిన విశాఖను ఈ విధంగా గుర్తు పెట్టుకుంటానని అన్నారు. అయితే మూడేళ్ళ క్రితం విశాఖలో తనను బంధించి నలిపివేసిన నాటి కక్షపూరిత రాజకీయాన్ని గుర్తు పెట్టుకుంటాను అన్నారు.
By: Tupaki Desk | 24 July 2025 1:04 AM ISTవిశాఖ పేరు చెప్పగానే తనకు రెండే గుర్తుకు వస్తాయని జనసేన్ ఆధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖ తనను సినీ హీరోగా చేసింది అని అన్నారు. విశాఖలోనే తన నట శిక్షణ సాగిందని ఆయన ముప్పయ్యేళ్ళ క్రితం నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. విశాఖ తనలోని బిడియాన్ని భయాన్ని పోగొట్టు వెండి తెర మీద కధానాయకుడిగా తలెత్తుకుని తిరిగేలా చేసింది అన్నారు. అందుకే విశాఖ అంటే తనకు ఎంతో అభిమానం అన్నారు.
సినీ జీవితాన్ని ప్రసాదించిన విశాఖను ఈ విధంగా గుర్తు పెట్టుకుంటానని అన్నారు. అయితే మూడేళ్ళ క్రితం విశాఖలో తనను బంధించి నలిపివేసిన నాటి కక్షపూరిత రాజకీయాన్ని గుర్తు పెట్టుకుంటాను అన్నారు. పవన్ 2022 అక్టోబర్ లో విశాఖలో పర్యటించారు. ఆ సమయంలో విశాఖ తీర ప్రాంతంలో ఉన్న ఒక హొటల్ లో పవన్ విడిది చేశారు. ఆయన ఆ హొటల్ నుంచి బయటకు రానీయకుండా పోలీసులతో బంధించారు. దాంతో పవన్ ఒక రోజుకు పైగా ఒక హొటల్ గదిలోనే ఉండిపోవాల్సి వచ్చింది.
ఆ సంఘటన అప్పట్లో అతి పెద్ద సంచలనంగా మారింది. విశాఖలో జరిగిన హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి వచ్చిన పవన్ ఏయూ వేదికగా జరిగిన సభలో విశాఖకు సంబంధించి ఈ రెండు సంఘటనలను ముందుంచారు. విశాఖ గురించి చెప్పాలంటే ఈ రెండూ తనకు చప్పున గుర్తుకు వస్తాయని అన్నారు. ఇందులో ఒకటి సినిమాకు సంబంధించినది మరోటి రాజకీయానికి సంబంధించినది.
ఇక పవన్ లోని హీరోని విశాఖ ఏ విధంగా ఎలివేట్ చేసిందో రాజకీయ నేతగా ఆయన రూట్ ఆ నిర్భంధము తరువాత ఒక్కసారిగా మారిపోయింది. దాంతో పవన్ కళ్యాణ్ కి విశాఖ రెండు కీలక రంగాలలో రాచబాట వేసింది అని అంటున్నారు.
పవన్ ఇంకా విశాఖ గురించి చెబుతూ తాను ఏమీ కాని రోజులలో విశాఖ వచ్చి సత్యానంద్ వద్ద శిక్షణ పొందాను అన్నారు. ఆ రోజులలో తాను విశాఖలోని అన్ని వీధులను తిరిగేవాడిని అన్నారు. అలా సంగం శరత్ ధియేటర్ల ప్రాంతంలో ఎక్కువగా తిరిగేవాడిని అన్నారు. తన అన్నయ్య చిరంజీవి తనను సత్యానంద్ మాస్టార్ చేతిలో పెట్టారని తాను ఆయన తీర్చిదిద్దిన వాడిని అన్నారు. ఒక ఆడపిల్లలా సిగ్గుతో ఉన్న తనను ఆయన చేరదీసి ఎంతో ధైర్యం చెప్పారని పవన్ నాటి రోజులు గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా తనకు నట శిక్షణ ఇచ్చిన గురువు సత్యానంద్ మాస్టర్ ని పవన్ సత్కరించి వేదిక మీదనే ఆయన పాదాలకు నమస్కారం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాను మరో ఏడాదితో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కాబోతున్నాను అని పవన్ అన్నారు. 1996లో పవన్ సినీ రంగ ప్రవేశం జరిగింది. 2026 నాటికి ఆయన ముప్పయ్యేళ్ళు పూర్తి చేసుకుంటారు.
