పవన్ కల్యాణ్ సహకారం సంపూర్ణం: చంద్రబాబు
తన ఆలోచనలకు, పనులకు, నిర్ణయాలకు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణ్.. సంపూర్ణ సహకారం అందిస్తున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
By: Garuda Media | 11 Nov 2025 3:09 PM ISTతన ఆలోచనలకు, పనులకు, నిర్ణయాలకు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణ్.. సంపూర్ణ సహకారం అందిస్తున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కనిగిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి ఎం.ఎస్.ఎం.ఈ పార్కులను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ సహకారంతోపాటు.. కూటమి పార్టీల సహకారం అద్భుతంగా ఉందన్నారు. ఇప్పటికే అనేక కార్యక్రమాలు అమలు చేశామన్నారు.
కేంద్రంలోని మోడీ సర్కారు కూడా.. తనకు ఎంతగానో సహకరిస్తోందని చంద్రబాబు చెప్పారు. కేంద్రం సహకారంతోనే విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వచ్చిందన్న ఆయన త్వరలోనే 20 లక్షల ఉద్యోగాల కల్పన కూడా సాకారం అవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఎం.ఎస్.ఎం.ఈ పార్కులను దేశంలోనే తొలిసారి ఏపీ ప్రభుత్వం వినియోగించుకుంటోదని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో ఏపీ బ్రాండ్‌ను తిరిగితీసుకువచ్చామన్నారు.
గత ఐదేళ్లపాటు వైసీపీ పాలన ప్రజలకు నరకం చూపించిందన్న సీఎం చంద్రబాబు.. రాష్ట్రాన్ని కూడా అన్ని విధాలా చిదిమేసిందని చెప్పారు. పారిశ్రామిక వేత్తలను తరిమి కొట్టడంతోపాటు.. రాష్ట్రాన్ని విధ్వం సం చేశారని చెప్పారు. ఇప్పుడు అందరిని ఒప్పించి.. రాష్ట్రానికి తిరిగి తీసుకువస్తున్నామని తెలిపారు. దీనికి కారణం.. కూటమి పార్టీల ప్రభుత్వం ఉండడమేనని చెప్పారు. ఇప్పటికే చాలా కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని తెలిపారు.
రాష్ట్రంలో డ్రోన్ సిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. దీనివల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్న సీఎం.. ఉపాధి మార్గంగా కూడా మారుతుందన్నారు. వ్యావసాయానికి డ్రోన్ సేవలను అనుసంధానిస్తున్న ట్టు చెప్పారు. తద్వారా వ్యవసాయంలో భారీ ఎత్తున ఎరువులను వాడకుండా కట్టుదిట్టం చేస్తామన్నారు. తిరుపతిలో స్పేస్ సిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా సెమీ కండక్టర్ పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. మరోవైపు.. ఏరో స్పేస్ రంగాన్ని కూడా రాష్ట్రంలో ప్రోత్సహిస్తున్నామన్నారు. వీటి ద్వారా ఉపాధి, ఉద్యోగాలకు అవకాశం ఉంటుందన్నారు.
