కూటమి...ఏకలవ్యుడి పరిస్థితే...పవన్ సంచలన వ్యాఖ్యలు!
ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కలిపి కూటమిగా ఏర్పడ్డాయి. వారి ఐక్యతే 164 సీట్లను సాధించి పెట్టింది.
By: Tupaki Desk | 4 July 2025 11:12 AMఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కలిపి కూటమిగా ఏర్పడ్డాయి. వారి ఐక్యతే 164 సీట్లను సాధించి పెట్టింది. ఏడాదిగా పాలన సాఫీగా సజావుగా సాగుతోంది. అయితే కూటమిలో విభేదాలు ఉన్నాయని వార్తలు వచ్చినప్పుడల్లా అటు చంద్రబాబు ఇటు పవన్ వాటిని ఖండిస్తూనే ఉన్నారు. తమకు రాజకీయాలు ముఖ్యం కాదు రాష్ట్ర భవిష్యత్తు ప్రధానం అని పదే పదే చెబుతున్నారు.
అయితే ఆచరణలో కూటమిలో సీఎన్ అలా ఉందా అన్న చర్చ సాగుతోంది. మరో వైపు చూస్తే సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం పేరుతో ఒక్క టీడీపీ ఎమ్మెల్యేలే జనంలోకి వెళ్తున్నారు. మరి జనసేన బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్ళడం లేదో లేక అది పూర్తిగా టీడీపీ కార్యక్రమంగా ఉంటే కనుక కూటమిలో మిత్రుల మధ్య గ్యాప్ ఉందన్న సంకేతం జనాల్లోకి వెళ్తుంది కదా అన్న చర్చ ఉంది.
ఇలా చాలానే జరుగుతున్నాయి అని అంటున్నారు. సూపర్ సిక్స్ క్రెడిట్ ని కూడా టీడీపీ తీసుకుంటోంది అన్న భావన కూడా వ్యక్తం అవుతోంది అని అంటున్నారు. ఇక బీజేపీ శాసనసభా పక్ష నాయకుడు విష్ణు కుమార్ రాజు అయితే కూటమిలో బీజేపీ వాటా తేల్చాల్సిందే అని తాజాగా స్టేట్మెంట్ ఇచ్చేశారు. మరి ఇవన్నీ జరుగుతున్న వేళ ప్రకాశం జిల్లా పర్యటనలో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నారు.
ఇంతకీ ఆయన ఏమన్నారు అంటే కూటమి అంటే పిడికిలి అని అభివర్ణించారు. అన్ని వేళ్ళూ ఉండాల్సిందే. ఏ వేలు లేకపోయినా ఏమీ చేయలేం, చివరికి అది ఏకలవ్యుడు మాదిరి పరిస్థితి అవుతుంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే కూటమిలో ఐక్యత ముఖ్యమని పవన్ చెప్పారా అన్న చర్చ అయితే సాగుతోంది. మరో వైపు చూస్తే కనుక చంద్రబాబును జైలులో పెట్టినపుడు జనసేన నాయకులు ఏదేదో మాట్లాడితే తాను టీడీపీ పెద్ద పార్టీ అని వారికి సర్దిచెప్పాను అని పవన్ పాత విషయం ఇపుడు రివీల్ చేశారు.
అంటే బాబుని జైలులో పెడితే జనసేనను దానిని పొలిటికల్ అడ్వాంటేజ్ గా తీసుకోమని నాడు ఎవరైనా చెప్పారా అన్న చర్చ ఇపుడు వస్తోంది. ఇక చంద్రబాబుకు టీడీపీకి 2023లో తాను ఎందుకు అవుట్ రేట్ గా మద్దతు ఇవ్వాల్సి వచ్చిందో మరోసారి పరోక్షంగా పవన్ ఇలా వివరించే ప్రయత్నం చేశారా అన్న చర్చ వస్తోంది.
కూటమిలో అందరూ ఒకరిని ఒకరు గౌరవించుకోవాలని పవన్ అనడం విశేషం. టీడీపీ జనసేన బీజేపీ పార్టీల నేతలు కలసి ఉండాలని అంతా ఐక్యంగా ఉంటేనే కూటమికి బలం అని పవన్ హితబోధ చేశారు. మరి సడెన్ గా పవన్ నోటి వెంట ఐక్యంగా ఉండాలని అంతా గౌరవించుకోవాలని మాటలు రావడం వెనక ఏమై ఉంటుంది అని అంతా డిస్కష్ చేస్తున్నారు.
ఇంకో వైపు చూస్తే వైసీపీ నేతల మీద తనకు వ్యక్తిగతంగా కోపం ఏమీ లేదని పవన్ క్లారిటీ ఇచ్చారు. వారికి 11 సీట్లు వచ్చినా గౌరవిస్తామని అన్నారు. వారు సరైన తీరున విపక్ష పాత్ర పోషించాలని కోరారు. కూటమి ప్రభుత్వం తప్పులు ఏమైనా చేస్తే చెప్పాలని వాటిని సరిదిద్దుకుంటామని పవన్ చెప్పడం విశేషం.
అంతే తప్ప రప్పా రప్పా అని కుత్తుకలు కోస్తామని అంటే ఎవరూ భయపడరని అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్లనే ఇబ్బందులు వచ్చాయని పవన్ అన్నారు. అనేక కేంద్ర పధకాలను సవ్యంగా వాడుకోలేదని దాని వల్ల జల్ జీవన్ మిషన్ లాంటివి ఆపేశారు అని ఆయన అన్నారు. మళ్లీ వాటిని చంద్రబాబు తాను ఢిల్లీకి వెళ్ళి కేంద్ర పెద్దలతో మాట్లాడి ఆమోదించుకుని వచ్చామని ఆయన చెప్పుకొచ్చారు.
కూటమి ప్రభుత్వం కక్షలు తీర్చుకునేది కాదని తప్పు చేస్తే శిక్షించే ప్రభుత్వం అని అన్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ రాజకీయంగా చేసిన చాలా వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశం అవుతున్నాయి. ఆయన విశాల దృక్పథంతో ఈ తరహా వ్యాఖ్యలు చేసి ఉంటారని అంటున్నారు. వాటిని అంతా అలాగే స్వీకరించాలని కూడా అంటున్నారు.