ముద్రగడ గొప్ప వ్యక్తి అంటూ పవన్ వ్యాఖ్యలు
ముద్రగడ గురించి పవన్ తన సంతాప సందేశంలో పేర్కొన్న విషయాలు చూస్తే ఆయన ప్రజా క్షేత్రంలో నిలిచి గెలిచారు అన్నారు.
By: Satya P | 14 July 2026 10:17 PM ISTకాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దివంగతులు అయిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల పలురువు తన సందేశంలో సంతాపం తెలియచేస్తున్నారు. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ముద్రగడ గొప్పతనాన్ని తలచుకుంటున్నారు. జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముద్రగడ మృతి పట్ల సంతాపం తెలియచేస్తూ ఆయన గొప్ప వ్యక్తి అని కీర్తించారు. ఆయన మరణ వార్త తనను తీవ్రంగా కలచి వేసింది అని అన్నారు. ఆ వార్త విన్న తనకు ఎంతో మనో వేదన కలిగింది అని పవన్ చెప్పారు.
ప్రజా క్షేత్రంలో నిలిచి :
ముద్రగడ గురించి పవన్ తన సంతాప సందేశంలో పేర్కొన్న విషయాలు చూస్తే ఆయన ప్రజా క్షేత్రంలో నిలిచి గెలిచారు అన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా ముద్రగడ నెగ్గారు అని గుర్తు చేసుకున్నారు. 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా ముద్రగడ గెలిచారు అన్నారు. ఈ సందర్భంగా ముద్రగడ కుటుంబ సభ్యులకు ఆయన మద్దతుదారులకు తన సంతాపం తెలియ చేస్తున్నట్లు పవన్ చెప్పారు.
నీతి నిజాయితీకి మారు పేరు :
ఇదిలా ఉంటే ముద్రగడ పద్ననాభం నీతికి నిజాయితీకి మారు పేరు అని సినీ నటుడు మోహన్ బాబు కొనియాడారు. ఆయన మరణ వార్త విన్న వెంటనే తాను మనో వేదనకు గురి అయ్యాను అని ఆయన చెప్పారు. మా ఇద్దరి మధ్యన ఎంతో ఆప్యాయత అనుబంధం ఉందని మోహన్ బాబు చెప్పారు. ముద్రగడ స్నేహ శీలి అని ఆయన మిత్ర స్వభావ కూడా తనను ఆకట్టుకుందని చెప్పారు. ముఖ్యంగా కాపు ఉద్యమానికి ఆయన చేసిన సేవలు గొప్పావని మోహన్ బాబు అన్నారు. ముద్రగడ వంటి గొప్ప వ్యక్తిని కోల్పోవడం బాధాకరం అంటూ అది పెద్ద లోటుగా మోహన్ బాబు అభివర్ణించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మోహన్ బాబు కోరారు.
ముద్రగడ ఇక లేరంటూ :
మరో వైపు చూస్తే కాపు ఉద్యమానికి విశేష సేవలు అందించిన ముద్రగడ పద్మనాభం ఇక లేరు అన్నది తలచుకుని కాపు సామాజిక వర్గం తీవ్రంగా బాధపడుతోంది. ముద్రగడను ఒక యోధుడుగా అభి వర్ణిస్తోంది. రాజీ లేని పోరాటం చేసిన ముద్రగడ దాని కోసం తన జీవితాన్ని మొత్తం అర్పించారని కూడా గుర్తు చేసుకుంటోంది. ముద్రగడ నీతి నిజాయతీ అన్నది ఎప్పటికీ చిరస్థాయిగా నిలుస్తాయని కూడా ఆయన గురించి అంతా చెప్పుకుంటున్నారు. ముద్రగడ రాజకీయ జీవితం కంటే సామాజిక జీవితంలోనే ఎక్కువగా అంకితభావంతో పనిచేసి తమ జాతి కోసం ఎంతగానో తపన పడ్డారని గుర్తు చేసుకుంటున్నారు. రాజకీయాలకు అతీతంగా అంతా ముద్రగడ చేసిన సేవలను చర్చిస్తూ ఆయనకు ఘన నివాళి అర్పిస్తున్నారు.
