టార్గెట్ ట్రైబల్స్.. పవన్ స్ట్రాటజీ ..!
ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క విధానాన్ని.. ఒక్కొక్క వర్గాన్ని.. లక్ష్యంగా చేసుకొని ముందుకు సాగుతుంది. ఇది ఆయా పార్టీలు అనుసరిస్తున్న సిద్ధాంతాలు, ఆయా పార్టీలు వేసుకునే వ్యూహాలను బట్టి అమలవుతుంది.
By: Tupaki Desk | 5 July 2025 8:00 PM ISTఒక్కొక్క పార్టీ ఒక్కొక్క విధానాన్ని.. ఒక్కొక్క వర్గాన్ని.. లక్ష్యంగా చేసుకొని ముందుకు సాగుతుంది. ఇది ఆయా పార్టీలు అనుసరిస్తున్న సిద్ధాంతాలు, ఆయా పార్టీలు వేసుకునే వ్యూహాలను బట్టి అమలవుతుంది. ఆయా పార్టీల నాయకులు అనుసరిస్తారు. ఇలాంటి వ్యూహాలను తప్పుపట్టాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ క్రమంలో ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకు విషయానికి వస్తే మెజారిటీ ఓటు బ్యాంకు వైసీపీకి అనుకూలంగా ఉందన్నది వాస్తవం. గత ఎన్నికల్లో ఓడిపోయినా మళ్లీ ఎస్సీ, ఎస్టీలు వైసిపి వైపే ఉంటారన్నది ఆ పార్టీ విశ్వసిస్తున్న ప్రధాన విషయం.
దీంతో రాజకీయంగా ఆ పార్టీ పుంజుకుంటుందని కూడా ఒక అంచనా వేసుకుంటున్నారు. ఈ క్రమంలో గిరిజన సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకునే దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారనేది గత కొన్నాళ్లుగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఇది మరింత ఎక్కువగా మారింది అనేది రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో గిరిజన ఓటు బ్యాంకు ఇతర సామాజిక వర్గాల ఓటు బ్యాంకు కంటే కూడా తక్కువగానే ఉన్నప్పటికీ.. గిరిజన ఓటు బ్యాంకులో కనక విప్లవం వస్తే అది ఎస్సీలు అలాగే బీసీల వైపు కూడా మళ్లే అవకాశం ఉంటుంది.
ఉదాహరణకు పోలవరం, పార్వతీపురం మన్యం వంటి ప్రాంతాలను తీసుకుంటే ఇవి ప్రాథమికంగా ఎస్టీ సామాజిక నియోజకవర్గం అయినప్పటికీ ఇక్కడ బీసీలు అదేవిధంగా ఎస్సీల డామినేషన్ ఎక్కువ. కానీ ఎస్టీలు ఎటువైపు ఉంటే అటువైపు వారి ఓటు బ్యాంకు చీలిపోతుంది. ఉదాహరణకు ఎస్టీలు వైసిపి వైపు ఉన్నారు అని అనుకుంటే బీసీలు, ఎస్సీలు కూడా అటువైపే మొగ్గుతున్న పరిస్థితి పోలవరం వంటి కీలక నియోజకవర్గాల్లో కనిపిస్తోంది. అంటే ప్రాథమికంగా ఎస్టీ నియోజకవర్గాలే అయినప్పటికీ ఓటు పరంగా చూసుకున్నప్పుడు ఎన్నికల సమయానికి వచ్చేసరికి ఎస్సీలు, బీసీలు కూడా ఎస్టీలు ఎటువైపు నడిస్తే అటువైపే అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
దీనిని పసిగట్టిన జనసేన ఇప్పుడు ఎస్టీలను తన వైపు తిప్పుకునే విధంగా `టార్గెట్ ట్రైబల్స్` వ్యూహాన్ని అనుసరిస్తుంది. గత కొన్నాళ్లుగా పార్వతీపురం మన్యం సహా కొన్ని కీలక ఎస్టి నియోజకవర్గాలపై జనసేన దృష్టి పెట్టింది. ఇది తప్పు కాకపోయినా రాజకీయ వ్యూహం అనే చెప్పాలి. వాస్తవానికి పోలవరం వంటి ఎస్టీ నియోజకవర్గంలో జనసేన విజయం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే ఎస్టీ సామాజిక వర్గం బలంగా ఉన్న నియోజకవర్గాలలో మరింత దూకుడుగా వ్యవహరించి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ అడుగులు వేస్తోంది.
గిరిజనులకు ప్రాథమిక అవసరాలైన రహదారుల నిర్మాణం వంటివి చేపట్టడం ఒకటే కాకుండా వారి మనసులను ఆకట్టుకునేలాగా ఆకర్షించే లాగా వ్యవహరించటం మరో కీలక పరిణామంగా చెప్పాలి. ఖర్చు చిన్నది అయినా లాభం పెద్దది అన్నట్టుగా పవన్ కళ్యాణ్ తన సొంత నిధులతో చిన్న చిన్న సహాయం చేస్తూ గిరిజనుల మనసును దోచుకుంటున్నారు. ఇది కచ్చితంగా వచ్చే ఎన్నికల నాటికి గిరిజన సామాజిక వర్గంలో పెను మార్పులు తీసుకురావడంతో పాటు జనసేనకు అనుకూలంగా మారుస్తుందన్న చర్చ నడుస్తోంది. ఇది ఎంతవరకు ఓటు బ్యాంకుగా మారుతుందో అనేది ప్రస్తుతానికి చెప్పలేకపోయినా రాబోయే పరిణామాల్లో మాత్రం ఖచ్చితంగా లాభిస్తుంది అన్నది పరిశీలకులు వేస్తున్న అంచనా.