తగ్గేదేలే అంటున్న పవన్ - తెలంగాణపై మరో భావోద్వేగ ట్వీట్
తెలంగాణ నేతల విమర్శలను తిప్పికొడుతూ ఏపీ ఉప ముఖ్యమంత్రి ఆసక్తికర ట్వీట్ చేశారు.
By: Tupaki Political Desk | 3 Jun 2026 4:50 PM ISTతెలంగాణ నేతల విమర్శలను తిప్పికొడుతూ ఏపీ ఉప ముఖ్యమంత్రి ఆసక్తికర ట్వీట్ చేశారు. రెండు రోజులుగా పవన్ కేంద్రంగా తెలంగాణ రాజకీయాలు వాడివేడిగా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం తెలంగాణ రాష్ట్రం, అక్కడి మేథావులు, జర్నలిస్టుల నుంచి వస్తున్న నిరసనలు, కాంగ్రెస్ నేతల విమర్శలపై పవన్ ఘాటుగా స్పందించారు. దీంతో కాంగ్రెస్ నేతలు కూడా పవన్ పై ఎదురుదాడి చేస్తున్నారు. దీనికి బీఆర్ఎస్ నేతలు కూడా శ్రుతికలపడంతో పవన్ బుధవారం సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "తెలంగాణ ఎవరి అయ్య జాగీరూ కాదు" అంటూ పవన్ చేసిన కామెంట్స్ పై పొలిటికల్ ఫైట్ పీక్స్ కు చేరుకోవడంతో ఉప ముఖ్యమంత్రి మళ్లీ రంగంలోకి దిగారని అంటున్నారు. తనపై వస్తున్న ‘తెలంగాణ వ్యతిరేకి’ అనే విమర్శలను తిప్పికొడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తనకున్న చిత్తశుద్ధి, నిబద్ధత ఈ నాటిది కాదని నిరూపించేలా పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘమైన, భావోద్వేగపూరితమైన ట్వీట్ చేశారు.
వైఎస్సార్ వ్యతిరేకించినా మద్దతిచ్చా..
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తాను గతంలో చేసిన పోరాటాలను పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. 2009 నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులను ప్రస్తావిస్తూ.. "నాటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తరుణంలోనే నేను ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షకు బహిరంగంగా మద్దతు పలికాను" అని పవన్ స్పష్టం చేశారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ అనుబంధ విభాగం ‘యువరాజ్యం’ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే తాను తెలంగాణ ఉద్యమంలో భాగస్వామినయ్యానని పవన్ తెలిపారు. నాటి ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి నేతలతో పాటు, ప్రజా గాయకుడు దివంగత గద్దర్ తో కలిసి ‘తెలంగాణ సామాజిక న్యాయ సభ’ వేదికపై తాను నిలిచిన విషయాన్ని పవన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
రాజకీయ ప్రయోజనాల కోసం కాదు
తెలంగాణ సమాజానికి తాను ఇచ్చిన పిలుపు కేవలం భౌగోళిక విడదీత మాత్రమే కాదని, అది సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, అన్ని వర్గాలకూ సమాన అవకాశాల పునాదులపై నిర్మితమయ్యే "సామాజిక తెలంగాణ" అని పవన్ పేర్కొన్నారు. "తెలంగాణకు నేను తెలిపిన మద్దతు ఎన్నడూ రాజకీయ ప్రయోజనాల కోసం లేదా తాత్కాలిక రాజకీయ అవసరాల కోసం చేసింది కాదు. ప్రజల ప్రజాస్వామ్య ఆకాంక్షలను గౌరవించాలనే నా దృఢమైన నమ్మకం, సిద్ధాంతం నుండి పుట్టిన నిర్ణయం అది. నాటి నా స్టాండ్.. నేటికీ తెలంగాణ ప్రజలపై నాకు ఉన్న అచంచలమైన నిబద్ధతకు నిదర్శనం. నా మద్దతు కేవలం రాజకీయం కాదు.. అది నా నైతిక సూత్రం." అని పవన్ తన ట్వీట్ లో స్పష్టం చేశారు.
రెండు రోజులుగా పొలిటికల్ హీట్
గత రెండు రోజులుగా తెలంగాణ రాజకీయాలు పవన్ కల్యాణ్ కేంద్రంగానే తిరుగుతున్నాయి. జూన్ 2న హైదరాబాద్ సభకు అనుమతి నిరాకరణతో మొదలైన వివాదం.. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వంటి కాంగ్రెస్ నేతలు పవన్‌ను ‘పెయిడ్ ఆర్టిస్ట్’ అని విమర్శించేంతవరకు వెళ్లింది. పవన్‌ను తెలంగాణలో తిరగనివ్వబోమంటూ కొందరు హెచ్చరికలు జారీ చేయడంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సైతం జోక్యం చేసుకుని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంస్కృతి సరికాదని హితవు పలికారు.
ఈ నేపథ్యంలోనే.. 2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఒంటరిగానైనా బరిలోకి దిగుతుందని, తాను తెలంగాణ అంతటా పర్యటిస్తానని పవన్ ప్రకటించిన మరుసటి రోజే ఈ 2009 నాటి పాత వీడియో, ఈ వివరణాత్మక ట్వీట్ రావడం విశేషం. తానేమీ తెలంగాణకు కొత్త కాదు అని, నాటి ఉద్యమకారుడు గద్దర్ నుంచి నేటి యువత వరకు అందరితోనూ తనకు దశాబ్దాల బంధం ఉందనే విషయాన్ని పవన్ ఈ ట్వీట్ ద్వారా బలంగా చాటిచెప్పారు. ఈ కౌంటర్ ట్వీట్‌తో తెలంగాణలో జనసేనాని తదుపరి పొలిటికల్ మూవ్స్ ఎలా ఉండబోతున్నాయనేది ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారిందని అంటున్నారు.
