పవన్ నవ నిర్మాణ సభతో రచ్చ రచ్చ.. టీఆర్ఎస్ చీఫ్ కవిత హాట్ కామెంట్స్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ లో నిర్వహించనున్న ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ’ రాజకీయంగా తీవ్ర దుమారానికి కారణమవుతోంది.
By: Tupaki Political Desk | 1 Jun 2026 3:13 PM ISTఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ లో నిర్వహించనున్న ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ’ రాజకీయంగా తీవ్ర దుమారానికి కారణమవుతోంది. ఇప్పటికే ఈ సభను నిరసిస్తూ కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కవిత కూడా గొంతు విప్పారు. డిప్యూటీ సీఎం పవన్ పై తీవ్ర విమర్శలు చేసిన కవిత.. తమ రాష్ట్రంలో ఆంధ్రా రాజకీయ నాయకులు పెత్తనం చేస్తామంటే సహించేది లేదని తేల్చిచెప్పారు. రాజధాని కట్టడం చేతకాని వారు తెలంగాణను పునర్ నిర్మిస్తారా? అంటూ మండిపడ్డారు.
తమకు ఏపీ ప్రజలతో విభేదాలు లేవని స్పష్టం చేసిన కవిత, ఆంధ్ర నాయకులతోనే పంచాయితీ ఉందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘ఎక్కడ పడితే అక్కడ ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు పెడుతున్నారని, అధికారంలోకి వచ్చాక ఆ విగ్రహాలను కూల్చివేస్తామని హెచ్చరించారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ వాదులు ఎప్పుడు విమర్శలు చేసినా, ప్రాంతానికి అన్యాయం జరిగిందని మాత్రమే చెప్పేవాళ్లమని అన్నారు. ఆంధ్ర ప్రజలను ఎప్పుడూ ఏమీ అనలేదని గుర్తు చేశారు. ప్రజలకు ప్రజలకు మధ్యలో ఎప్పుడు పంతాలు, పట్టింపులు, కొట్లాటలు ఉండవని స్పష్టం చేశారు. అదే సమయంలో ప్రజల మధ్య చుట్టరికాలు ఉంటాయన్నారు.
ఆంధ్ర ఏజెంట్ సీఎం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్ర రాజకీయ నాయకుల ఏజెంట్‌గా పనిచేస్తున్నారని టీఆర్ఎస్ నాయకురాలు కవిత విమర్శించారు. ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా ఆంధ్రోళ్ళ విగ్రహాలు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ‘‘నేనైతే పాత నాయకులంతా మంచిదానిని కాదు.. ఇట్లానే మీరు చేస్తే మేము కచ్చితంగా అధికారంలోకి వస్తాం, అన్ని విగ్రహాల పలగొట్టి ఆంధ్రాకి పార్సిల్ చేస్తాం’’ అంటూ కవిత వార్నింగ్ ఇచ్చారు. తనకు పెద్దగా ఓపిక గానీ, విశాల హృదయం కానీ లేదని స్పష్టం చేశారు. ఆంధ్రా వాళ్లు రావొచ్చు పోవచ్చు రొయ్యలు అమ్ముకోవచ్చు, షూటింగులు చేసుకోవచ్చు. సినిమాలు తీసుకోవచ్చు అంటూ వ్యాఖ్యానించారు కవిత.
వ్యాపారవేత్తలకు వెల్ కం
ఏపీ రాజకీయ నాయకులకు తెలంగాణలో ఏం పని అంటూ ప్రశ్నించిన కవిత అదే సమయంలో ఏపీకి చెందిన వ్యాపార వేత్తలు, పారిశ్రామిక వేత్తలు వస్తామంటే ఎర్ర తివాచీ వేసి స్వాగతం చెబుతామన్నారు. ఎందుకంటే స్విట్జర్లాండ్, యూకే, జపాన్ వంటి విదేశీ వ్యాపారవేత్తల కాళ్ళు పట్టుకొని రాండయ్యా భూములు ఇస్తామనే కన్నా, పెట్టుబడులు పెట్టే ఏపీ వారిని స్వాగతించడం మేలని వ్యాఖ్యానించారు. ఏపీలో శేఖర్ రెడ్డి అనే పారిశ్రామిక వేత్త శ్రీసిటీ కట్టారని, 30 దేశాల నుంచి పరిశ్రమలు వస్తున్నాయని చెప్పారు. శేఖర్ రెడ్డి లాంటి వారు వస్తే తెలంగాణకు 60 దేశాల పరిశ్రమలు వస్తాయన్నారు.
రాజధాని కట్టుకోలేకపోయారు
ఏపీలోని రెండు పార్టీల వారు రాజధాని కట్టుకోలేకపోయారని కవిత ఎత్తిచూపారు. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం వద్దంటూ తాము పోరాడుతుంటే, ఏపీ నేతలు మాత్రం అసెంబ్లీ తీర్మానంతో చేసుకోవాల్సిన రాజధానిని పార్లమెంటు ద్వారా గెజిట్ చేయించారని అన్నారు. గతంలో కర్నూలులో గుడారాల మధ్య ఉన్న రాజధానిని హైదరాబాద్ కు తరలించేందుకు తెలంగాణతో కలిశారని కవిత ఆరోపించారు. రెండు రాష్ట్రాలు అయ్యాక రాజధాని కట్టుకోవడంలో రెండు పార్టీలు విఫలమయ్యాయని అన్నారు. కానీ, మీ రాజకీయ అవసరాల కోసం తెలంగాణను వాడుతున్నారంటూ ఆక్షేపించారు. ఇది కరెక్ట్ కాదు, మేము గమనిస్తున్నాం. తెలంగాణవాదులం, రాజకీయంగా పరిణతి చెందినటువంటి వాళ్ళం అంటూ కవిత వ్యాఖ్యానించారు.
