Begin typing your search above and press return to search.

ఉత్తరాంధ్ర To తెలంగాణ.. జనసేనాని రాజకీయ వ్యూహం పెను సంచలనమేనా?

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కీలక రాజకీయ నిర్ణయం తీసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది.

By:  Tupaki Desk   |   26 Aug 2025 12:00 AM IST
ఉత్తరాంధ్ర To తెలంగాణ.. జనసేనాని రాజకీయ వ్యూహం పెను సంచలనమేనా?
X

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కీలక రాజకీయ నిర్ణయం తీసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు ‘సేనతో సేనాని’ అనే కార్యక్రమాన్ని విశాఖలో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ స్థాయిలో చేపడుతున్న కార్యక్రమం కావడంతో జనసేన తీసుకోబోయే రాజకీయ నిర్ణయాలపై విస్తృత చర్చ జరుగుతోంది. ప్రధానంగా ఏపీ రాజకీయాలను శాసిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. విశాఖ సభ తర్వాత తెలంగాణపై ఫోకస్ పెంచబోతున్నారనే ప్రచారం రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది. విశాఖ సమావేశానికి ఏపీతోపాటు తెలంగాణ నుంచి భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలను సమీకరిస్తున్నట్లు చెబుతున్నారు. జనసేన ఆవిర్భావం తర్వాత ఎన్నడూ లేనట్లు విశాఖలో నిర్వహిస్తున్న రాజకీయ సభకు తెలంగాణ నుంచి కూడా కార్యకర్తలను సమీకరిస్తుండటంతో కొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేవనున్నట్లు చెబుతున్నారు.

2014లో జనసేన ఆవిర్భవించింది. ఆ పార్టీ పుట్టుకతోనే రాష్ట్రం రెండుగా మారిపోయింది. ఇక 2014లో ఎదుర్కొన్న తొలి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోయిన జనసేన, ఏపీలో టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు పలికింది. తెలంగాణలో మాత్రం తటస్థంగా ఉండిపోయింది. ఇక ఆ ఎన్నికల తర్వాత జనసేన ఏపీని కేంద్రంగా చేసుకుని రాజకీయాలు చేసింది. తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు ఉన్నప్పటికీ తన రాజకీయ లక్ష్యానికి ఏపీని ఎంచుకున్న జనసేనాని పవన్ పదేళ్లుగా అలుపెరగని పోరాటం చేశారు. గత ఎన్నికల్లో ఆయన పోషించిన పాత్రతో మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇక ఆ తర్వాత జాతీయ స్థాయిలో కూడా పవన్ ప్రాధాన్యం పెరిగిపోయింది. సూపర్ స్టార్ డమ్, విస్తృత అభిమానుల సమూహం, రాజకీయంగా మచ్చలేని వ్యక్తిత్వం వల్ల ప్రధాని మోదీ కూడా పవన్ ను ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు. దీంతో ఏపీ చుట్టుపక్కల పలు రాష్ట్రాల్లో రాజకీయ సభలు, సమావేశాలకు పవన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.

ఏపీ ఎన్నికల్లో విక్టరీ తర్వాత మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ ప్రచారం చేశారు. తెలుగు ఓటర్ల ఉన్న ప్రాంతాల్లో బీజేపీకి అనుకూలంగా పవన్ ప్రచారం చేయడం ఆ పార్టీకి కలిసొచ్చిందని చెబుతారు. అదే క్రమంలో తమిళనాడు, కర్ణాటకల్లో కూడా పవన్ సేవలను వినియోగించుకోవాలని కమలం పెద్దలు భావిస్తూ జనసేనానిని ప్రోత్సహిస్తున్నారు. ఆయన కూడా కేంద్ర పెద్దలు చెప్పినట్లే నడుచుకుంటూ తన ప్రభావం ఒక్క ఏపీకే పరిమితం కాదన్న సంకేతాలు పంపుతున్నారు. ఈ క్రమంలోనే మరో ఏడాదిలో ఎన్నికలు జరిగే తమిళనాడు పాలిటిక్స్ లో పవన్ ను తెరపైకి తెస్తున్నారు. సనాతన ధర్మంపై ఆయనతో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ బీజేపీ సానుకూల ఓట్ల ఏకీకరణకు ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో పవన్ ద్వారా తెలంగాణలో అధికారంలోకి రావడానికి బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించిందని చెబుతున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన విస్తరించాలనేది పవన్ కల్యాణ్ లక్ష్యంగా ఆ పార్టీ నేతలు ఎప్పటి నుంచో చెబుతున్నారు. గత ఎన్నికల్లో విజయం ద్వారా ఏపీలో తన ముద్ర వేసిన పవన్, ఇప్పుడు తెలంగాణపై స్పెషల్ ఫోకస్ చేశారని చెబుతున్నారు. ఏపీలో డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ పక్కనే ఉన్న తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల్లో తరచూ పర్యటిస్తూ రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, తెలంగాణ విషయం ఓ వ్యూహం ప్రకారం ఇన్నాళ్లు వెనక్కి తగ్గారని అంటున్నారు. అయితే తెలంగాణలో ఎన్నికలు జరిగి దాదాపు 20 నెలలు అవుతుండటం వల్ల ఇక స్పీడు పెంచాలని జనసేనాని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. విశాఖలో నిర్వహించే ‘సేనతో సేనాని’ కార్యక్రమం తర్వాత తెలంగాణలో రాజకీయ వ్యూహంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి పార్టీ విస్తరణ ప్రణాళికలు అమలు చేయాలని భావిస్తున్నారని చెబుతున్నారు.

జనసేన పార్టీకి ఏపీలో ఉన్నట్లుగానే తెలంగాణలోనూ భారీగా కార్యకర్తలు ఉన్నారు. అయితే అధినేత రాజకీయంగా ఆ రాష్ట్రంలో యాక్టివ్గా లేకపోవడంతో పెద్దగా కార్యక్రమాలు చేయడం లేదని చెబుతున్నారు. అయితే ఏపీలో పార్టీ తరఫున ఏ కార్యక్రమం నిర్వహించినా తెలంగాణ కేడర్ ఉత్సాహంగా పాలుపంచుకుంటోందని చెబుతున్నారు. ఇక పార్టీని నమ్ముకున్న వారిని ప్రోత్సహించడంతోపాటు జనసేన మిత్రపక్షం బీజేపీతో కలిసి తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పవన్ నిర్దేశించుకున్నట్లు చెబుతున్నారు. ఏపీలో టీడీపీతో కలిపి జనసేన, బీజేపీ జట్టుకట్టాయి. అయితే తెలంగాణలో టీడీపీని మినహాయించి ముందుకు వెళ్లాలని బీజేపీ నేతలు పట్టుబడుతుండటంతో జనసేనాని వ్యూహం ఎలా ఉంటుందనేది ఉత్కంఠ రేపుతోంది.

తెలంగాణ అసెంబ్లీకి 2023లో జరిగిన ఎన్నికల్లో జనసేన-బీజేపీ ఉమ్మడిగా పోటీ చేశాయి. అప్పట్లో జనసేన పోటీ చేసిన ఏ స్థానంలోనూ విజయం సాధించలేదు. అయితే అప్పట్లో జనసేనాని ఎక్కువగా ఏపీపై ఫోకస్ చేయడం వల్ల తెలంగాణలో ఖాతా తెరవలేకపోయారని అంటున్నారు. అయితే ఇకపై తెలంగాణ రాజకీయాలకు అధిక ప్రాధాన్యమిచ్చి బీజేపీతో కలిసి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని పవన్ ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో విశాఖలో జరిగే సేనతో సేనాని కార్యక్రమం తర్వాత తెలంగాణలో జనసేన రాజకీయాలపై కీలక ప్రకటన చేయొచ్చని అంటున్నారు.