తెలంగాణపై పవన్ భావోద్వేగ ట్వీట్.. తగ్గేదేలే అంటున్న ఏపీ డిప్యూటీ సీఎం!
ఈ నేపథ్యంలో ఎటువంటి వివాదాస్పదన వ్యాఖ్యలకు వెళ్లకుండా అత్యంత జాగ్రత్తగా తెలంగాణ వైభవాన్ని గుర్తు చేసేలా పవన్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అవుతోంది.
By: Tupaki Political Desk | 2 Jun 2026 3:30 PM ISTతెలంగాణరాష్ట్ర 12వ అవతరణ దినోత్సవం సందర్భంగా ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక సుదీర్ఘమైన పోస్ట్ రెండు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేవలం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలకే పరిమితం కాకుండా, తెలంగాణ భౌగోళిక, చారిత్రక, సాంస్కృతిక, సామాజిక అంశాలను స్పృశిస్తూ ఆయన రాసిన ట్వీట్ మున్ముందు తెలంగాణలో ఆయన అనుసరించేబోయే రాజకీయ వ్యూహానికి సంకేతాలా? అన్న చర్చకు తెరలేపాయి. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడానికి పవన్ తెరచాటు ప్రయత్నాలు చేస్తున్నారని, అందులో భాగంగానే రాష్ట్ర రాజకీయాల్లో తలదూరుస్తున్నారని అధికార కాంగ్రెస్ విమర్శిస్తోంది. అటు తెలంగాణ వాదులు సైతం పవన్ రాజకీయ వ్యవహారాలను తెలంగాణకు విస్తరించాలనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి వివాదాస్పదన వ్యాఖ్యలకు వెళ్లకుండా అత్యంత జాగ్రత్తగా తెలంగాణ వైభవాన్ని గుర్తు చేసేలా పవన్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అవుతోంది.
"నా తెలంగాణ కోటి రతనాల వీణ!" అంటూ దాశరథి కృష్ణమాచార్యుల మాటలను గుర్తు చేస్తూ పవన్ కల్యాణ్ తన సందేశాన్ని ప్రారంభించారు. తెలంగాణ గడ్డ పోరాటాల పుట్టినిల్లని, ఇక్కడి గాలిలో పౌరుషం, నీటిలో ఉద్యమ ప్రవాహం, నేలలో అమరుల రక్తం ఉందంటూ భావోద్వేగాన్ని తట్టిలేపే ప్రయత్నం చేశారని చెబుతున్నారు. సమ్మక్క-సారలమ్మల స్ఫూర్తిని, కొమురం భీమ్ త్యాగాలను కొనియాడుతూ.. తెలంగాణ సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు, విద్యార్థులకు, ఉద్యమకారులకు వినమ్ర నివాళులర్పించారు. ఒక ప్రాంతం పట్ల, అక్కడి సంస్కృతి పట్ల పూర్తి అవగాహన ఉన్న నాయకుడిగా పవన్ ఈ ట్వీట్‌లో తనను తాను ఆవిష్కరించుకునే ప్రయత్నం చేశారని అంటున్నారు.
పవన్ కల్యాణ్ తన ట్వీట్‌లో కేవలం ప్రశంసలకే పరిమితం కాలేదు. తెలంగాణ సమాజం దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ఆయన ప్రస్తావించారు. ఫ్లోరోసిస్ బాధిత ప్రాంతాల దుస్థితి, గిరిజనుల హక్కులు, రైతాంగ సంక్షేమం, నిరుద్యోగ యువత ఆశలు, విద్య-వైద్య రంగాల్లోని సవాళ్లను తాను ఎప్పటి నుంచో గమనిస్తున్నానని పేర్కొన్నారు. వీటిని రాజకీయ అంశాలుగా కాకుండా మానవీయ కోణంలో చూస్తున్నానని చెప్పడం ద్వారా.. తెలంగాణ అంతటా ఉన్న క్షేత్రస్థాయి సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందనే సంకేతాన్ని పవన్ ఇచ్చారు.
ఇక ఐటీ, ఫార్మా, స్టార్టప్ రంగాల్లో తెలంగాణ దూసుకుపోతున్న విషయాన్ని అంగీకరిస్తూనే.. అసలైన అభివృద్ధి గ్రామీణ ప్రాంతాలు, గిరిజన తండాలు, వెనుకబడిన వర్గాలు, మహిళల వరకు చేరినప్పుడే సంపూర్ణమవుతుందని పవన్ అభిప్రాయపడ్డారు. సమగ్రాభివృద్ధి, సామాజిక న్యాయమే లక్ష్యంగా తెలంగాణ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అంతేకాకుండా "తెలంగాణ ప్రజల ఆశయాలు, ఆత్మగౌరవం, సమగ్ర అభివృద్ధి లక్ష్యాల సాధనకు జనసేన పార్టీ సంపూర్ణ నిబద్ధతతో పనిచేస్తుంది" అని పవన్ ప్రకటించారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో జనసేన ఇక పూర్తి యాక్టివ్ అయ్యే సంకేతాలు పంపారని అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్‌తో సరికొత్త రికార్డు సృష్టించి, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు తన తదుపరి లక్ష్యం తెలంగాణే అనే సంకేతాలను పంపడం రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. గతంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకుని జనసేన పోటీ చేసినప్పటికీ, ఆంధ్రా ఎన్నికల బిజీ వల్ల పవన్ ఇక్కడ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోయారని అంటున్నారు. కానీ ఇప్పుడు ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం స్థిరపడటంతో, పవన్ చూపు తెలంగాణ వైపు మళ్లిందని రాజకీయ విశ్లేషకుల అంచనా వేస్తున్నారు.
ముఖ్యంగా వచ్చే నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) నాటికి తెలంగాణలో జనసేనను ఒక బలమైన శక్తిగా నిలబెట్టాలనే సుదీర్ఘ వ్యూహంతోనే పవన్ కల్యాణ్ ఉన్నట్లు కనిపిస్తోందని చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ స్థానాన్ని భర్తీ చేయాలని భావిస్తోన్న బీజేపీ.. జనసేన అధినేత పవన్ ను ముందుపెట్టి క్షేత్రస్థాయిలో విస్తరణకు వ్యూహం రచిస్తోందని మరికొందరు విశ్లేషిస్తున్నారు.
