Begin typing your search above and press return to search.

మాట‌ కు మాట‌: ప‌వ‌న్‌పై నేత‌ల విసుర్లు

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ హైద‌రాబాద్ మీడియా స‌మావేశంలో చేసిన వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ పార్టీ స‌హా బీఆర్ఎస్ నాయ‌కులు మాట‌కు మాట అన్న‌ట్టుగా వ్యాఖ్యానించారు.

By:  Garuda Media   |   3 Jun 2026 10:32 AM IST
మాట‌ కు మాట‌:  ప‌వ‌న్‌పై నేత‌ల విసుర్లు
X

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ హైద‌రాబాద్ మీడియా స‌మావేశంలో చేసిన వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ పార్టీ స‌హా బీఆర్ఎస్ నాయ‌కులు మాట‌కు మాట అన్న‌ట్టుగా వ్యాఖ్యానించారు. మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌, కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు, ఎమ్మెల్సీ అద్దంకి ద‌యాక‌ర్‌, బీఆర్ ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి కౌంట‌ర్లు ఇచ్చారు. ప‌వ‌న్‌కు తెలంగాణ‌లో తిరిగేందుకు మాత్ర‌మే స్వేచ్ఛ ఉంద‌ని.. ఇక్క‌డ రాజ‌కీయాలు మాట్లాడేందుకు ఎలాంటి అర్హ‌త లేద‌ని నాయ‌కులు వ్యాఖ్యానిం చారు. రాసిచ్చిన స్క్రిప్టులో లోపాలు ఉన్నాయ‌ని.. వాటిని కూడా గుర్తించ‌లేక పోతే ఎలా అని పొన్నం వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఎవ‌రేమ‌న్నారు?

బీఆర్ ఎస్ నాయ‌కుడు జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి స్పందిస్తూ.. ప్ర‌ధాని మోదీ రాసిచ్చిన స్క్రిప్టునే ప‌వ‌న్ క‌ల్యాణ్ చ‌దివి వినిపించార‌ని వ్యాఖ్యానించారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యాఖ్య‌ల్లో స్ప‌ష్ట‌త లేద‌ని అన్నారు. ఆయ‌న తెలంగాణ‌కు వ‌స్తే ఎవ‌రికీ అభ్యంత‌రం లేద‌ని చెప్పారు. కానీ, ఇక్క‌డ రాజ‌కీయాలు చేసేందుకు ఏం అర్హ‌త ఉంద‌ని ప్ర‌శ్నించారు. తెలంగాణ ఉద్య‌మంలో జెండా మోశావా? ప్ర‌జ‌లు దెబ్బ‌లు తింటుంటే.. అడ్డుకున్నావా? అస‌లు అప్పుడు ఎక్క‌డున్నావో చెప్పాలి? అని ప్ర‌శ్నించారు. ఇలాంటివారి వ‌ల్ల తెలుగు ప్ర‌జ‌ల మ‌ధ్య విద్వేషాలు పెరుగుతున్నాయ‌ని వ్యాఖ్యానించారు.

మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ మాట్లాడుతూ.. బీఆర్ ఎస్‌, బీజేపీల నుంచి ముడుపులు ముట్టి ఉంటాయ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అయితే.. ఈ విష‌యం తాను అన‌డం లేద‌న్నారు. కొంద‌రు త‌న‌కు చెప్పార‌ని అన్నారు. ప‌వ‌న్ పెయిడ్ ఆర్టిస్ట్ అని అన్నారు. ఆయ‌న‌కు డ‌బ్బులు ఇస్తే.. ఎలాంటి పాత్ర‌లైనా పోషిస్తార‌ని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వం నాడే..ఇలా వ్యాఖ్య‌లు చేయ‌డం స‌రికాద‌న్నారు. ఆయ‌న న‌టుడిగా ఇక్క‌డ తిర‌గొచ్చ‌ని.. అంత‌కు మించి మాట్లాడితే.. ఊరుకోబ‌మ‌ని మ‌రోసారి పొన్నం హెచ్చ‌రించారు.

బీజేపీ రాసిచ్చిన స్క్రిప్టును చ‌దివినా.. దానిని ఎలా చ‌ద‌వాలో ప‌వ‌న్‌కు నేర్పించ‌లేద‌ని పొన్నం ఎద్దేవా చేశారు. ఏపీలోనే తాను ఏమీ చేయ‌లేక పోయాన‌ని ఒప్పుకొంటున్న ప‌వ‌న్‌క‌ల్యాణ్‌.. తెలంగాణ‌లో ఏం చేస్తార‌ని ప్ర‌శ్నించారు. ``ఇక్కడికి వచ్చి ఏమిటీ రభస?`` అని ప్ర‌శ్నించారు. ఏపీ ప్ర‌జ‌లు, నాయ‌కులు తెలంగాణ‌కు రావొచ్చ‌ని.. ప్ర‌జాస్వామ్యంలోనే ఉన్నామ‌న్న విష‌యాన్ని తాము కూడా ఒప్పుకొంటున్నామ‌ని చెప్పారు. అయితే..ఇక్క‌డ రాజ‌కీయాలు చేసే అవ‌స‌రం ఏంట‌ని ప్ర‌శ్నించారు. ఏమైనా ఉంటే ఏపీలోనే చూసుకోవాల‌ని అన్నారు.

ఎమ్మెల్సీ అద్దంకి ద‌యాక‌ర్ మాట్లాడుతూ.. ప‌వ‌న్‌కు క్లారిటీ లేద‌ని మండిప‌డ్డారు. ఆయ‌న ఏం మాట్లాడుతున్నారో.. ఆయ‌న‌కై నా తెలుసా? అని ప్ర‌శ్నించారు. ఎవ‌రో చెప్పిన‌ట్టు ఆడుతున్నార‌ని వ్యాఖ్యానించారు. అయితే.. తెలంగాణ‌లో కూడా ప‌వ‌న్ రాజ‌కీయాలు చేసుకునే స్వేచ్ఛ ఉంద‌న్నారు. కానీ.. తెలంగాణ‌పై అవాకులు పేలితే స‌హించేది లేద‌న్నారు. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌ను తెలంగాణ స‌మాజం ఎప్ప‌టికీ విశ్వ‌సించ‌ద‌ని ద‌యాక‌ర్ వ్యాఖ్యానించారు.