Begin typing your search above and press return to search.

ప్రతిభ ఉంటే ఏపీ డిప్యూటీ సీఎం ఇట్టే పట్టేస్తారు.. తాజా సీన్ తెలుసా?

నేతలు చెప్పే మాటలకు చేతలకు ఏ మాత్రం సంబంధం ఉండదు. ప్రచారం కోసం కాకుండా ప్రతిభ ఉన్నోళ్లను భుజం తట్టి ప్రోత్సహించే నేతలు చాలా తక్కువగా ఉంటారు.

By:  Tupaki Desk   |   10 July 2025 9:44 AM IST
ప్రతిభ ఉంటే ఏపీ డిప్యూటీ సీఎం ఇట్టే పట్టేస్తారు.. తాజా సీన్ తెలుసా?
X

నేతలు చెప్పే మాటలకు చేతలకు ఏ మాత్రం సంబంధం ఉండదు. ప్రచారం కోసం కాకుండా ప్రతిభ ఉన్నోళ్లను భుజం తట్టి ప్రోత్సహించే నేతలు చాలా తక్కువగా ఉంటారు. ఆ కోవలోకే వస్తారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. కష్టాల్లో ఉన్నోళ్లు ఎవరైనా సరే.. వారి సమస్యల పరిష్కారంగా ఉండే పవన్.. ప్రతిభ ఉండేటోళ్లను ప్రోత్సహించేందుకు.. అలాంటోళ్లకు తాను ఉన్నానన్న భరోసాను.. ధైర్యాన్ని కల్పించే తత్త్వం టన్నుల కొద్దీ ఉంటుంది పవన్ కల్యాణ్ వద్ద. ఇందుకు తాజాగా చోటు చేసుకున్న ఉదంతమే నిదర్శనంగా చెప్పాలి.

అతి తక్కువ ఖర్చుతో బ్యాటరీతో నడిచే సైకిల్ ను రూపొందించిన విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్ విద్యార్థి రాజాపు సిద్ధూని కలిశారు ఏపీ డిప్యూటీ సీఎం. అతడి పరిశోధనను పరిశీలించి.. అభినందించటమే కాదు.. వినూత్న ఆలోచనతో సదరు కుర్రాడి సరికొత్త ఆవిష్కరణను అభినందించారు. సిద్దూ ప్రతిభ గురించి సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న పవన్ కల్యాణ్.. అతడ్ని మంగళగిరిలోని తన క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకొని మాట్లాడారు.

అతడి ఆలోచనల్ని అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు.. సిద్దూ తయారు చేసిన సైకిల్ మీద అతడ్ని వెనుక కూర్చోబెట్టుకొని ఆ సైకిల్ ను తానే స్వయంగా నడిపారు పవన్ కల్యాణ్. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. భేషజాలు లేకుండా.. ప్రతిభను గుర్తించటం ఒక ఎత్తు.. ఇలా సామాన్యుడిలా కలిసి పోవటం పవన్ కు మాత్రమే సాధ్యమవుతుందని చెబుతున్నారు.

విజయనగరం జిల్లాలోని జాడవారి కొత్తవలస గ్రామానికి చెందిన సిద్ధూ.. తన ఇంటికి దూరంగా ఉన్న కాలేజీకి వెళ్లి రావటానికి ఇబ్బందులకు గురయ్యేవాడు. దీంతో.. తన ఆలోచనలతో తానే స్వయంగా ఒక బ్యాటరీ సైకిల్ రూపకల్పన చేశాడు. ఈ సైకిల్ ను మూడు గంటల పాటు ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని సిద్ధూ చెప్పటం తెలిసిందే. ఇతడి మాటలు.. అతను తయారు చేసిన బ్యాటరీ సైకిల్ మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారాయి.

తాజాగా తనను కలిసేందుకు వచ్చిన సిద్దూతో.. అతడి ఆలోచనల గురించి అడిగి తెలుసుకున్నారు పవన్ కల్యాణ్. అతను రూపొందించిన గ్రాసరీ గురూ వాట్సప్ సర్వీస్ బ్రోచర్ చూసి ప్రత్యేకంగా అభినందించిన ఆయన.. వినూత్న ఆలోచనలకు మరింత పదును పెట్టాలన్న ఆకాంక్షను మాత్రమే కాదు రూ.లక్ష మొత్తాన్ని ప్రోత్సాహకంగా అందించిన వైనం అందరిని ఆకట్టుకుంటుంది. పవన్ తీరుతో ఒక్క విషయం స్పష్టమవుతుంది.

ప్రతిభ ఉండాలే కానీ ప్రోత్సహించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం ఉన్నారన్న భరోసా మరింత బలాన్ని కలిగిస్తుందని చెప్పాలి. ఇప్పటివరకు కష్టాల్లోనూ.. సమస్యల్లోనూ ఉన్న వారికి తనకు తోచిన సాయాన్ని అందిస్తున్న పవన్.. ఇప్పుడు కొత్త ఆలోచనలకు మరింత పదును పెట్టేలా యూత్ కు కొత్త స్ఫూర్తిని కలిగిస్తున్న వైనం ఆయన ఇమేజ్ ను మరింత పెంచుతుందని చెప్పకతప్పదు.