Begin typing your search above and press return to search.

అమ్మానాన్నలు లేరు.. ఆదుకోండన్న పోస్టుకు పవన్ రియాక్షన్ ఇదే

అంతేకాదు.. ఇద్దరు చిన్నారులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించాలన్న ఆదేశాల్ని పవన్ కల్యాణ్ జారీ చేశారు.

By:  Garuda Media   |   11 Feb 2026 10:39 AM IST
అమ్మానాన్నలు లేరు.. ఆదుకోండన్న పోస్టుకు పవన్ రియాక్షన్ ఇదే
X

చిన్నారుల నోటి నుంచి తమను ఆదుకోవాలన్న మాట వచ్చినంతనే.. ఎంతటి పని ఒత్తిడిలో ఉన్నప్పటికి గంటల వ్యవధిలో స్పందించే గుణం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. తండ్రి.. తల్లిని కోల్పోయిన ఇద్దరు చిన్నారులు తమను ఆదుకోవాలని కోరుతూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుకు తక్షణమే స్పందించటమే కాదు.. తన నిర్ణయాన్ని అమితమైన వేగంతో వెల్లడించారు. ఇంతకూ వారు ఎవరంటే.. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం మాధవపురం గ్రామానికి చెందిన సత్య, చంటి ఇద్దరు రెండేళ్ల క్రితం తండ్రిని కోల్పోయారు. ఇటీవల తల్లి కూడా వారికి దూరమైంది.

ఇలాంటి పరిస్థితుల్లో ఉండేందుకు ఇల్లు లేక తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. తమను ఆదుకోవాలని కోరుతూ పవన్ కు సోషల్ మీడియా ద్వారా వీడియోలో తమ పరిస్థితిని వెల్లడించారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని సేకరించిన పవన్ కల్యాణ్.. ఇద్దరికి ప్రతి నెలా రూ.5 వేలు చొప్పున అందించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఆదేశాల్ని తన కార్యాలయ సిబ్బందికి ఆదేశించారు. అంతేకాదు.. ఏ ఆధారం లేని చిన్నారులకు తక్షణం ఇల్లు కట్టించి ఇచ్చే ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.

అంతేకాదు.. ఇద్దరు చిన్నారులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించాలన్న ఆదేశాల్ని పవన్ కల్యాణ్ జారీ చేశారు. ఇప్పటికే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని 42 మంది అనాథ పిల్లలకు ప్రతి ఒక్కరికి ప్రతి నెలా రూ.5వేలు చొప్పున అందించే బాధ్యతను తీసుకోవటం తెలిసిందే. ఇలా తనకు తోచిన సాయాన్ని అందించే విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రూటు సపరేటుగా పేర్కొంటారు.