ప్రీతి కేసు బయటకు తెచ్చింది ఎవరు? నా చిత్తశుద్ధిని ప్రశ్నించొద్దు
కర్నూలుకు చెందిన బాలిక సుగాలి ప్రీతి కేసుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు.
By: Tupaki Desk | 29 Aug 2025 4:29 PM ISTకర్నూలుకు చెందిన బాలిక సుగాలి ప్రీతి కేసుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. తన కుమార్తెను చంపిన కేసులో తమకు న్యాయం చేయలేదని, ప్రతిపక్షంలో ఉండగా, జనసేనాని పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీ ఏమైందని ప్రీతి తల్లి పార్వతి ఇటీవల ప్రశ్నించారు. పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక తమ కేసును పట్టించుకోవడం లేదని పార్వతి విమర్శలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. పార్వతి మాట్లాడిన వీడియోను ప్రతిపక్ష వైసీపీ వైరల్ చేసింది. దీనిపై జనసేన స్పందిస్తూ పార్వతి ఆరోపణలను ఖండించింది. సాయం చేసిన వారు కృతజ్ఞత కోరుకోవడం ఎంత తప్పో.. సాయం పొందిన వారు కృతజ్ఞత చూపకపోవడం అంతే తప్పని జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో విశాఖలో పార్టీ సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ సుగాలి ప్రీతి కేసుపై తన చిత్తశుద్ధిని ప్రశ్నించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. కాసిన చెట్లకే రాళ్ల దెబ్బ అన్నట్లు తన వల్లే కేసు బయటకు వచ్చిందని, సీబీఐ దర్యాప్తు వరకు వెళ్లిందని వెల్లడించారు.
సుగాలి ప్రీతి తల్లి ఆరోపణలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేరుగానే తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. తనపై ఒత్తిడి తీసుకురావడం వల్ల ప్రయోజనం లేదని, జనసేన పోరాటం వల్లే సుగాలి ప్రీతి కేసులో తల్లిదండ్రులకు అప్పటి ప్రభుత్వం ఎస్పీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కింద ఇవ్వాల్సిన పరిహారాలను చెల్లించిందన్న విషయాన్ని గుర్తించాలని కోరారు. నాటి ప్రభుత్వాన్ని తాను మాత్రమే ధైర్యంగా ఎదిరించానని సుగాలి ప్రీతికి న్యాయం చేయాలని రెండు లక్షల మందితో వెళ్లి పోరాడానని డిప్యూటీ సీఎం తెలిపారు.
సుగాలి ప్రీతి కేసులో తాను అన్నివిధాలుగా సహకరిస్తే ఇప్పుడు తనపైనే విమర్శలు చేయడం ఎంతవరకు సబబు అని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఎవరైతే చేయూతనిస్తారో, ఎవరైతే అండగా నిలుస్తారో వారిని తిడితే ఎలా?’అంటూ ప్రశ్నించారు. గత ప్రభుత్వం మీద, అప్పటి ముఖ్యమంత్రి మీద మాట్లాడటానికి ఎవరికైనా ధైర్యం ఉందా? అంటూ పవన్ వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రిని అరెస్టుచేస్తే ఎవరూ రోడ్డుపైకి రాలేకపోయారు. అలాంటి ప్రభుత్వంలో సుగాలి ప్రీతి కేసులో నేను ధైర్యంతో వెళ్లి ఓ తల్లి వేదనను బయట ప్రపంచానికి తెలియజేశానని పవన్ తెలిపారు. తన పోరాటం వల్లే అప్పటి ప్రభుత్వం కేసును సీబీఐకి రిఫర్ చేసిందన్నారు.
అంతేకాకుండా తన వల్ల బాధితురాలి తల్లిదండ్రులకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద అన్నిరకాలుగా మేలు జరిగిందని వివరించారు. కర్నూలు రూరల్ మండలంలో బాధితులకు ఐదు ఎకరాల భూమిని కేటాయించారని చెప్పారు. దీని మార్కెట్ విలువ ప్రస్తుతం ఎకరా రూ.2 కోట్లు ఉంటుందని అంటున్నారని తెలిపారు. అదేవిధంగా కర్నూలు కార్పొరేషన్ కల్లూరు వద్ద 5 సెంట్ల ఇండ్ల స్థలం ఇచ్చారని, అక్కడ సెంటు భూమి పది నుంచి పదిహేను లక్షలు పలుకుతుందని చెప్పారు. ఇక బాధితురాలి తల్లిదండ్రులకు రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం కూడా ఇచ్చారని, ఇదంతా తన పోరాటం వల్లే జరిగిన విషయాన్ని మరచిపోయి తనపైనే తిరిగి విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.
తాను మెత్తని మనిషినని, తనపై రాళ్లు వేయడం తేలికన్న ఆలోచనతోనే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను శిక్షించాలనే సంకల్పంతోనే తాను పనిచేస్తున్నట్లు పునరుద్ఘాటించారు. డిప్యూటీ సీఎంగా చార్జి తీసుకున్న వెంటనే సుగాలి ప్రీతి కేసు విషయమై తాను ఆరా తీశానని, ఈ విషయాలను తాను చెప్పాలా? అంటూ ప్రశ్నించారు. గత ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు జరపాలని లేఖ రాసి వదిలేసిందని, దీనిపై ఎలా ముందుకు వెళ్లాలో ఆలోచిస్తాన్నామని చెప్పారు. ఇప్పటికే సీఐడీ చీఫ్ తోనూ డీజీపీతోనూ ఈ కేసుపై చర్చించినట్లు పవన్ వివరించారు. బాధితులు ఎవరిపై ఆరోపణలు చేస్తున్నారో వారి డీఎన్ఏ మ్యాచ్ అవడం లేదని పోలీసు దర్యాప్తులో తేలిందని, ఈ కేసును మ్యానేజ్ చేయడానికి గత ప్రభుత్వంలో ప్రయత్నాలు జరిగాయని, అందుకే అసలు దోషులు తప్పించుకున్నారని పవన్ వెల్లడించారు. ప్రీతి హత్యను ఒక కేసుగా భావించడం లేదని, ఇది ఒక సామాజిక సమస్యగా పరిగణించి పాప మరణానికి కారణమైన వారిని తప్పకుండా శిక్షిస్తామని తెలిపారు.
