ఏపీలో పెను రాజకీయ సంచలనం? బొత్సకు పవన్ భారీ ఆఫర్!
ఏపీలో త్వరలో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
By: Tupaki Desk | 2 April 2025 8:29 AMఏపీలో త్వరలో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా విపక్షం వైసీపీని కోలుకోలేని దెబ్బ తీసే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అడుగులు వేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. పది నెలలుగా వైసీపీలోని కీలక నేతలను తన పార్టీలో చేర్చుకున్న డిప్యూటీ సీఎం పవన్.. తాజాగా వైసీపీకి చెందిన మరో సీనియర్ నేతపై ఫోకస్ చేశారంటున్నారు. ఇటీవల కాలంలో తరచూ ఆ నేతతో తన సంబంధాలు బహిర్గతం చేస్తున్న జనసేనాని పవన్ వ్యూహాం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైసీపీకి జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరో దెబ్బ తీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీకి చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, జయమంగళం వెంకటరమణ, కిలారు రోశయ్య తదితరులు జనసేన గూటికి చేరారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి రాష్ట్రంలో సంపూర్ణంగా విస్తరించాలని వ్యూహం రచిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ వైసీపీలోని పలువురు ప్రధాన నేతలపై గురిపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు ముందు వైసీపీ నేతలను ఎవరినీ చేర్చుకోనని చెప్పినా, ఎన్నికల అనంతరం పునరాలోచనలో పడిన జనసేనాని కొందరి విషయంలో వెసులుబాటు కల్పించినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే బాలినేని వంటివారిని చేర్చుకున్నట్లు చెబుతున్నారు. ఇక ఇప్పుడు వైసీపీలో ప్రధాన నేత బొత్సపై జనసేనాని పవన్ ఫోకస్ చేసినట్లు చెబుతున్నారు.
ఉత్తరాంధ్రలోని కీలక బీసీ నేత బొత్స. ఆయన కుటుంబంలోనే ముగ్గురు ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్, ఎంపీ ఇలా ఒకేసారి నాలుగైదు పదవులు ఉంటాయి. విజయనగరం జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ బొత్స కుటుంబం ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఉత్తరాంధ్రలోని కీలకమైన తూర్పుకాపు సామాజికవర్గానికి చెందిన బొత్సకు మూడు ఉమ్మడి జిల్లాల్లోనూ రాజకీయంగా మంచి పలుకుబడి ఉంది. అధికార పార్టీ నేతలతోనూ ఆయన సత్సంబంధాలు నెరుపుతారని అంటుంటారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా కక్ష సాధింపు రాజకీయాలకు దూరంగా ఉన్నారనే ఇమేజ్ ఉంది. అందుకే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీలో చాలా మంది నేతలపై కేసులు నమోదు అవుతున్నా, బొత్సను మాత్రం మినహాయించారంటున్నారు. దీంతో బొత్సపై డిప్యూటీ సీఎం పవన్ ఫోకస్ చేశారంటున్నారు.
ప్రస్తుతం వైసీపీ తరఫున మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్సను జనసేనలోకి ఆహ్వానించాలని జనసేనాని పవన్ ఆలోచనగా ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రతిపాదనపై పార్టీలో విస్తృతంగా చర్చ జరిగిందని ప్రచారం జరుగుతోంది. ఉత్తరాంధ్రలో కీలక నేతగా గుర్తింపు ఉన్న బొత్స జనసేనలోకి వస్తే బాగుంటుందని ఆ పార్టీ శ్రేణులు అభిప్రాయపడినట్లు చెబుతున్నారు. బొత్స జనసేనలోకి వస్తే ప్రస్తుతం ఉన్న పొజిషన్ కన్నా మంచి స్థానం కల్పిస్తామని జనసేన నుంచి వర్తమానం కూడా వెళ్లిందని అంటున్నారు. అయితే తొలి నుంచి టీడీపీ, బీజేపీ వ్యతిరేక భావజాలం ఉన్న బొత్స జనసేన ప్రతిపాదనపై తర్జనభర్జన పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అనుచరులు ఒత్తిడి చేస్తున్నా, చూద్దాం అన్నట్లే బొత్స వైఖరి ఉందంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి, ప్రతిపక్ష నేతగా కేబినెట్ హోదా కట్టబెట్టిన వైసీపీని వీడటంపై బొత్స తేల్చుకోలేకపోతున్నారని అంటున్నారు.