అక్కడ గ్యాప్...ఇక్కడ ఫుల్ ఫోకస్...పవన్ మార్క్ స్ట్రాటజీ !
జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యూహాలు పదును తేరుతున్నాయి. ఆయన 2019లో లెక్కలు తప్పి ఉండొచ్చు కానీ ఆ తరువాత పొత్తులు ఎత్తులు లెక్కలు అన్నీ కరెక్ట్ గానే ఉంటున్నాయి.
By: Satya P | 24 March 2026 9:21 AM ISTజనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యూహాలు పదును తేరుతున్నాయి. ఆయన 2019లో లెక్కలు తప్పి ఉండొచ్చు కానీ ఆ తరువాత పొత్తులు ఎత్తులు లెక్కలు అన్నీ కరెక్ట్ గానే ఉంటున్నాయి. ఆయన 2020లో బీజేపీతో కలిస్తే అదేంటి అని సెటైర్లు పేల్చారు. కానీ అదే బీజేపీని టీడీపీని కలిపి 2024 ఎన్నికల్లో భారీ కూటమిని ఏర్పాటు చేయించగలిగారు. ఫలితంగా ఎన్నడూ లేని విధంగా ఏపీలో కూటమి 96 స్ట్రైక్ రేట్ తో మొత్తం సీట్లు కొల్లగొట్టింది. కేంద్రంలో మూడవసారి మోడీ సర్కార్ ఏర్పాటు కావడానికి కూడా ఈ పొత్తు చాలా ఉపకరించింది.
బ్యాలెన్స్ చేసుకుంటూ :
ఇక ఎన్నికలు ముగిసాక పవన్ ఉప ముఖ్యమంత్రిగా ఉంటూనే తాను గతంలో కమిట్ అయిన సినిమాలను వరసబెట్టి పట్టాలెక్కించారు. అటు రాజకీయాలు ఇటు సినిమాలూ రెండూ బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు.
అలా హరిహర వీరమల్లు. ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ వంటివి తెర మీదకు వచ్చాయి. అయితే ఇవన్నీ 2024 ముందు అంగీకరించినవి కావడంతోనే పవన్ తన మాట మేరకు పూర్తి చేశారు అని అంటున్నారు. ఇక కొత్త సినిమాలు పవన్ ఒప్పుకోవడం లేదని అంటున్నారు ఈ మేరకు తాజాగా పవన్ టీం నుంచి ఒక ప్రకటన వెలువడింది. పవన్ కొత్త చిత్రాలు అని వస్తున్న వార్తలలో నిజం లేదని పేర్కొంది. అలా ఉంటే కనుక అఫీషియల్ గా తామే ప్రకటిస్తామని స్పష్టం చేసింది.
స్థానిక సమరంతో :
ఇక ఏపీలో చూస్తే కూటమి ప్రభుత్వానికి రెండేళ్ళు దగ్గర పడుతున్నాయి. మరో ఆరు నెలల వ్యవధిలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఉన్నాయి. దాంతో ఈ ఎన్నికల్లో కూటమి పార్టీలు అన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. జనసేన అయితే ప్రస్తుతం సభ్యత్వాల నమోదులో బిజీగా ఉంది. దాంతో స్థానికంగా బలపడితే పొత్తులో ఎక్కువ సీట్లు తీసుకుని గ్రౌండ్ లెవెల్ లో బలపడాలని చూస్తోంది. దాంతో పవన్ ఫుల్ ఫోకస్ ఇపుడు పార్టీ మీద ఉంటుందని అంటున్నారు.
వేడి రాజుకుంటే కనుక :
ఇక ఈ ఏడాది అంతా స్థానిక సంస్థల పోరుకే సరిపోతుంది. 2027 వచ్చేటప్పటికి కూటమి మూడేళ్ళ పాలన ముగుస్తుంది. చివరి రెండేళ్ళూ ఎన్నికల వేడితో గట్టిగానే ఉంటుంది. పైగా జగన్ వచ్చే ఏడాది నుంచి పాదయాత్రకు సిద్ధపడుతున్నారు అదే జరిగితే విపక్షాన్ని నియంత్రించేందుకు కూటమి తరఫున పవన్ రంగంలోకి దిగాల్సి ఉంటుంది అని అంటున్నారు. దాంతో ఇవన్నీ చూసిన మీదటనే పవన్ కొత్త మూవీస్ విషయంలో పవన్ టీం నుంచి ఈ ప్రకటన వచ్చిందా అన్న చర్చ సాగుతోంది. పవన్ కొత్త సినిమాలు అంటూ వరసగా వస్తున్న వార్తలకు ఆ విధంగా చెక్ పెట్టారని అంటున్నారు ఇక మీదట రాజకీయంగా జనసేనను బలోపేతం చేయడంతో పాటు ఉప ముఖ్యమంత్రిగా మరింతగా పాలనలో బిజీ కావడం ద్వారా పవన్ తన సరికొత్త అజెండాని సిద్ధం చేసుకుంటున్నారు అని అంటున్నారు. ఏది ఏమైనా జగన్ గడప దాటి కాలు బయటకు పెట్టక ముందే పవన్ జనంలో ఉండేలా యాక్షన్ ప్లాన్ అయితే రెడీ అవుతోంది అని అంటున్నారు. చూడాలి మరి ఏపీ రాజకీయం హీట్ ఏ స్థాయిలో ఉండబోతోందో.
