సైన్యానికి జనసేనాని బాసట.. షణ్ముఖ క్షేత్రాల్లో పూజలు!
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. ఈ క్రమంలో ఆయన తన పార్టీ కార్యకర్తలు, నాయకులకు సంచలన పిలుపు నిచ్చారు.
By: Tupaki Desk | 9 May 2025 8:55 PM ISTభారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతలు.. జరుగుతున్న దాడుల నేపథ్యంలో సైన్యం మరింత శక్తి సమన్వితం కావాలని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. ఈ క్రమంలో ఆయన తన పార్టీ కార్యకర్తలు, నాయకులకు సంచలన పిలుపు నిచ్చారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ధర్మయుద్ధానికి ఆధ్యాత్మిక మద్దతు ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా షణ్ముఖ(కుమారస్వామి) దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని సూచించారు. భారత సైన్యం పేరిట జరిగే ఈ పూజలకు.. ప్రతి ఒక్క పార్టీ నాయకుడు, కార్యకర్త హాజరు కావాలని ఆదేశించారు.
ముఖ్యంగా ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని సూచించారు. వచ్చే మంగళవారం షణ్ముఖ క్షేత్రాల్లో పూజలు చేసి.. సైన్యాని కి ఆధ్యాత్మిక బలాన్ని చేకూర్చాలని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రతి క్షేత్రానికి జనసేన ఎమ్మెల్యేతో పాటు జనసేన కార్యకర్తలు కూడా పాల్గొనాలని పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలోని అతి పెద్ద షణ్ముఖ క్షేత్రం మోపిదేవి, బిక్కవోలులోని సుబ్రహ్మణ్య ఆలయాల్లో పూజలు చేయాలని.. అదేవిధంగా ఇంద్రకీలాద్రి, పిఠాపురం, అరసవల్లిలోనూ.. సైన్యానికి మద్దతుగా పూజలు చేయించాలని పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు.
అదే విధంగా చర్చిలు, మసీదుల్లో ప్రార్థనలు చేపట్టాలని పవన్ సూచించారు. ``ఇది కీలక సమయం. ప్రతి ఒక్కరిలోనూ దేశ భక్తి ఉప్పొంగాలి. మనం ఇక్కడ క్షేమంగా ఉన్నామంటే.. దానికి కారణం మన వీర సైనికులే. వారికి శారీరక శక్తితోపాటు ఆధ్యాత్మిక బలం కూడా అత్యంత ముఖ్యం.`` అని పవన్ పిలుపునిచ్చారు. అరసవల్లిలోని సూర్యనారాయణ స్వామి ఆలయంలో సౌర శక్తి కోసం పూజలు చేయించాలని సూచించారు. అదేవిదంగా దాడుల ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలైన పంజాబ్, గుజరాత్, జమ్ము కశ్మీర్, రాజస్థాన్ తదితర జిల్లాలలోని ప్రజలు కూడా క్షేమంగా ఉండాలని కోరుతూ.. పూజల్లో సంకల్పం చెప్పించాలని పేర్కొన్నారు.
