తెలుగు రాష్ట్రాల్లో ఓన్లీ వన్ పవన్.. మరోసారి ఫ్రూవ్ అయ్యింది
నిజానికి పవన్ కు ముందు.. పవన్ తర్వాత అన్నది చూస్తే.. ఈ తరహా ఆలోచనా విధానంతో రాజకీయ అధినేతలు వచ్చే అవకాశం చాలా తక్కువనే చెప్పాలి. కులాల్ని ఏ రీతిలో చూడాలి.
By: Garuda Media | 1 Jun 2026 2:49 PM ISTతెలుగు రాష్ట్రాల్లో గల్లీకో రాజకీయ నాయకుడు ఉంటాడు. పార్టీలకు తక్కువ లేదు. అయితే.. రాజకీయపార్టీలు ఎన్ని ఉన్నా.. నేతలు మరెందరు ఉన్నా.. వారందరిలోనూ కనిపించని ఒక గుణం జనసేన అధినేత.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సొంతం. లోతైన ఆలోచనలు.. అంతకు మించి స్థిరమైన భావజాలం.. చరిత్ర.. కవిత్వం.. సామాజిక అంశాలు.. సమాజం కోసం తపించిన వారి గురించి.. వారి ఆలోచనల గురించి మాత్రమే కాదు.. కవులు.. కవిత్వం.. వారి వాదనలు.. ఇలా సంబంధం లేని ఎన్నో అంశాల మీద పూర్తి పట్టు ఉన్న రాజకీయ పార్టీ అధినేత పవన్ లో తప్పించి మరొకరు కనిపించరు. సమకాలీన రాజకీయాల్లో.. అందునా తెలుగు రాష్ట్రాల్లో పవన్ తరహా భావజాలం ఉన్న నేత కనిపించరు.
నిజానికి పవన్ కు ముందు.. పవన్ తర్వాత అన్నది చూస్తే.. ఈ తరహా ఆలోచనా విధానంతో రాజకీయ అధినేతలు వచ్చే అవకాశం చాలా తక్కువనే చెప్పాలి. కులాల్ని ఏ రీతిలో చూడాలి. మతాల మాటేంటి? వీటి గురించి పార్టీ వేదికల మీద అరమరికలు లేకుండా ఓపెన్ గా మాట్లాడే తీరు చాలా తక్కువగా కనినిస్తూ ఉంటుంది. అంతేకాదు.. పార్టీ వేదికల్లో రాజకీయాల గురించి మాట్లాడుకునే వేళలో.. సాధారణంగా రాజకీయ పార్టీ అధినేతల తీరు ఒకేలా ఉంటుంది.
కానీ.. పవన్ కల్యాణ్ తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. విశ్వవిద్యాలయాల్లో సోషియాలజీ..ఆంత్రోపాలజీ క్లాసులు విన్నట్లు ఉంటుంది. బలమైన భావజాలం మాత్రమే కాదు.. స్థిరమైన సిద్ధాంత గంభీరత ఆయన మాటల్లో వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడున్న కాలంలో ఇంత లోతైన వాదనలు వినిపించే రాజకీయ నాయకుడు కనిపించరు. అందుకే పవన్ కల్యాణ్ ను ఒకే ఒక్కడిగా అభివర్ణిస్తుంటారు కొందరు.
తాజాగా ఈ మాటలో నిజం నూటికి నూరుశాతం ఉందన్న విషయం మరోసారి నిరూపితమైంది. ఆదివారం సాయంత్రం మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన సందర్భంగా ఆయన చేసిన కీలక వ్యాఖ్యలు ఒక ఎత్తు అయితే.. ప్రసిద్ధ తెలుగు కవి గుర్రం జాషువా చెప్పిన మాటల్ని.. వాటి అర్థాల్ని వివరంగా చెప్పటం..వాటిని సామాజిక అంశాలతో ముడి పెట్టిన తీరు చూస్తే.. ఇంత గంభీరమైన ఆలోచనా సరళి చాలా అరుదుగా ఉంటుందని చెప్పక తప్పదు. ఇంతకూ గుర్రం జాషువా ప్రస్తావన ఎందుకు వచ్చింది? పవన్ ఏమన్నారు? అన్నది చూస్తే..
జనసేనలోఅంతర్గతంగా సామాజిక సామరస్యం.. బాధ్యతాయుత రాజకీయాలు.. రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం సేనా గళం పేరుతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లుగా చెప్పిన పవన్.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటల్లోనే చెబితే..
- ‘కులమతాలు గీచుకున్న గీతల్జొచ్చి.. పంజరానబడను నేను.. నిఖిల లోకమెట్లు నిర్ణయించిన.. నాకు తిరుగు లేదు.. విశ్వనరుడ నేను’ అని విశ్వ మానవ కల్యాణం కోసం గుర్రం జాషువా కవిత్వం రాశారు.
- ఈ దేశంలోని చాలా మంది దేశం నాకేమిచ్చిందని ప్రశ్నిస్తుంటే జాషువా తాను ఎంత కులపీడన అనుభవించినా దేశాన్ని నిందించలేదు. తెలుగు జాతిని జాషువా నిందించలేదు. జాతీయతను వదిలిపెట్టలేదు. స్పష్టమైన జాతీయ సామాజిక దృక్పథంతోనే కవిత్వం రాశారు. పీడిత జాతులకు సామాజిక న్యాయం కావాలని కోరుకున్నారు. జాషువా తాను పుట్టిన నేల.. ఊరు.. ప్రాంతం.. దేశాన్ని ప్రేమిస్తూనే జాతీయను మనసుకు హత్తుకునేలా రచనలు చేశారు. ఈ విషయాల్ని రాసింది ఎవరో తెలుసా? మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్.
- కుల ప్రస్తావన లేని రాజకీయం లేదు. కులం చాటున అన్యాయం జరుగుతోంది. రాష్ట్రంలో మెజారిటీ యువత జనసేన వైపు ఉన్నారు. వారంతా మంచి పరిపాలన, అభివృద్ధి కోరుకుంటున్నారు. కులాల కుంపటిలో నుంచి యువతను దూరంగా ఉంచే బాధ్యతను జనసేన తీసుకుంటుంది.
- ముల్లును ముల్లుతోనే తీయాలి.. కాపులు తిడితే కాపులతోనే తిట్టించాలి. రెడ్లు, కమ్మవారు విమర్శిస్తే ఆ సామాజిక వర్గాలతోనే ప్రతి విమర్శ చేయించాలి. ఎస్సీలు ఆరోపణలు చేస్తే అదే కులాల వారితో ఆరోపణలు చేయించాలన్న బూర్జువా పంథాలోనే రాజకీయ పార్టీలు మునిగి తేలుతున్నాయి.
- నవతరం జెన్-జీ ఆలోచనలు ఇందుకు భిన్నంగా ఉంటున్నాయి. కుళ్లు, కుట్రలు, కుతంత్రాలు లేని రాజకీయాలను నేటి తరం కోరుకుంటుంది. ఇందుకు తొలి అడుగుగా జనసేన అభ్యుదయ భావాలతో ముందుకు వెళ్లాలి. పాతబడి బూజుపట్టిన విధానాలకు తిలోదకాలివ్వాలి.
- నాకు ఒక కులాన్ని అంటగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. జనసేన కులాలకతీతంగా రాజకీయం చేస్తుంది. అన్ని కులాలు ఓట్లేస్తేనే ఎవరైనా గెలుస్తారు. కుల రాజకీయాలను అరికట్టేందుకు ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి. లేదంటే ఆ ఆలోచనా విధానం ప్రజల్లో అగాధాలు సృష్టిస్తుంది.
- కులాల కుట్రలకు దూరంగా ఉందాం. కొందరు వ్యక్తుల తప్పులను వారి వ్యక్తిగత చర్యలుగా కాక.. వారికి చెందిన కులం, మతం లేదంటే వర్గాలతో ముడిపెట్టి సామాజిక విభేదాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది సమాజంలో విద్వేషాలకు కారణమవుతోంది.
- వ్యక్తిగత తప్పులను వ్యక్తిగత స్థాయిలోనే ప్రశ్నించాలి తప్ప.. వాటిలోకి సామాజిక వర్గాలను లాగకూడదనే స్పష్టమైన విధానాన్ని పార్టీ పాటిస్తోంది. పార్టీలో అంతర్గతంగా సామాజిక సామరస్యం, బాధ్యతాయుత రాజకీయాలు, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసమే సేనా గళం. ఈ కమిటీలో అన్ని సామాజిక వర్గాలకు చెందిన సభ్యులు ఉంటారు.
