సైన్యం కోసం: షష్ట షణ్ముఖ క్షేత్రాల్లో జనసేన పూజలు!
భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు.. యుద్ధ వాతావరణం నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 13 May 2025 2:20 PM ISTభారత్-పాకిస్థాన్ దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు.. యుద్ధ వాతావరణం నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. భారత సైన్యానికి నైతిక బలం ఉండేలా.. దైవాన్ని ప్రార్థించాలని ఆయన నిర్ణయించారు. ఈ క్రమంలో ధైర్యానికి, విజయానికి ప్రతీక అయిన కుమార స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని.. సైన్యానికి భౌతిక శక్తితోపాటు.. ఆధ్యాత్మిక శక్తి కూడా ఒనగూరేలా చూడాలని పార్టీ నాయకులను ఆదేశించారు.
ఈ క్రమంలో కుమారస్వామికి ప్రీతిపాత్రమైన మంగళవారం నాడు.. రాష్ట్రమే కాకుండా.. ఇతర రాష్ట్రాల్లోని ప్రముఖ కుమారస్వామి ఆలయాల్లో జనసేన నాయకులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారత సైన్యానికి మరింత బలమైన శక్తి ప్రసాదించాలని కోరుకున్నట్టు తెలిపారు. ఏపీలో మోపిదేవితోపాటు.. తమిళనాడులోని తిరుత్తణి, కర్ణాటక, కేరళలలోని కుమారస్వామి ఆలయాల్లో ఈ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
విజయవాడలోని కనకదుర్గ ఆలయంలో ఉన్న కుమారస్వామి ఆలయంలో మంత్రి, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ‘ఆపరేషన్ సిందూర్’ తో పాకిస్థాన్‌కు గట్టి గుణపాఠం చెప్పిన మన దేశ సైన్యానికి, నాయకత్వానికి దైవబలం మెండుగా ఉండాలని కోరుకున్నట్టు మంత్రి నాదెండ్ల ఈ సందర్భంగా తెలిపారు.
మరోవైపు.. కర్ణాటకలోని ఘాటీ సుబ్రహ్మణ్య క్షేత్రంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వ ర్యంలో పూజలు చేశారు. ఇక, అరవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో జనసేన నాయకులు సూర్యా రాధన చేశారు. ఈ సందర్భంగా.. సైనికులకు మరింత మానసిక బలాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు. ఇదిలావుంటే.. భారత ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగంపై పవన్ హర్షం వ్యక్తం చేశౄరు. దేశ ప్రజలకు నైతిక బలం ప్రసాదించేలా మోడీ వ్యాఖ్యలు ఉన్నాయని కొనియాడారు.
