పెద్ద కుమారుడి బర్త్ డే రోజే చిన్న కుమారుడికి ఇలాంటి పరిస్థితి.. పవన్ ఆవేదన
సమ్మర్ క్యాంప్‌నకు వెళ్లిన తన కుమారుడు అక్కడ జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడని పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు.
By: Tupaki Desk | 8 April 2025 7:35 PM ISTసింగపూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడటంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. అరకులో పర్యటిస్తున్న సమయంలో తనకు ఈ విషయం తెలిసిందని ఆయన తెలిపారు.
సమ్మర్ క్యాంప్‌నకు వెళ్లిన తన కుమారుడు అక్కడ జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడని పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. "అరకు పర్యటనలో ఉండగా మార్క్‌శంకర్‌కు గాయాలైనట్లు ఫోన్ వచ్చింది. సమ్మర్‌క్యాంప్‌లో అగ్నిప్రమాదం జరిగి నా కుమారుడి చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ చేరింది. సుమారు 30మంది చిన్నారులు సమ్మర్‌క్యాంప్‌లో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది" అని ఆయన వివరించారు.
ప్రారంభంలో ఈ ప్రమాదం చిన్నదే అని భావించినప్పటికీ, తరువాత దాని తీవ్రత తెలిసిందని పవన్ కళ్యాణ్ అన్నారు. తన పెద్ద కుమారుడు అకీరా పుట్టినరోజే తన రెండో కుమారుడికి ఇలా జరగడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి 9.30 గంటలకు సింగపూర్‌కు బయలుదేరుతున్నట్లు ఆయన తెలిపారు. పొగ పీల్చడం వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్యంపై ప్రభావం ఉండవచ్చని ఆయన ఆందోళన చెందారు.
ఈ ఘటన గురించి తెలుసుకున్న వెంటనే అనేక మంది సహాయం చేయడానికి ముందుకు వచ్చారని పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. "ఈ సమయంలో నాకు అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు. నా కుమారుడి ఆరోగ్యంపై ఆరా తీసిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి లోకేశ్‌తో పాటు స్పందించిన అందరికీ కృతజ్ఞతలు" అని ఆయన పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ త్వరలో సింగపూర్ చేరుకుని తన కుమారుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటారని భావిస్తున్నారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు , శ్రేయోభిలాషులు ఆకాంక్షిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ తన చిన్న కుమారుడికి మెరుగైన వైద్యం అందించేందుకు మరికాసేపట్లో సింగపూర్‌కు బయలుదేరనున్నారు. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడగా, ప్రస్తుతం సింగపూర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుమారుడికి అత్యుత్తమ వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో పవన్ కళ్యాణ్ నిరంతరం ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్‌కు తోడుగా ఉండేందుకు అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి- ఆయన భార్య కూడా సింగపూర్‌కు వెళ్తున్నారు. వారి ప్రయాణం మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది.
