వైసీపీకి మళ్ళీ అధికారం...పవన్ షాకింగ్ కామెంట్స్
ఏపీలో 2029 ఎన్నికలో వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
By: Satya P | 28 March 2026 11:51 PM ISTఏపీలో 2029 ఎన్నికలో వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో కూటమి ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని మీద అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడం వెనక వైసీపీ అధికారంలోకి వస్తుందని భయాలు ఉన్నాయని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో అసెంబ్లీలో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైసీపీకి మరోసారి అధికారం దక్కడం మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ రాదంటే రాదు :
వైసీపీకి మళ్ళీ అధికారం అని అంతా అంటున్నారు అయితే అది జరిగే అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో లేవని పవన్ కుండబద్ధలు కొట్టారు. రాష్ట్రానికి హాని చేసేవాళ్ళు మళ్లీ రారని పవన్ స్పష్టం చేశారు. ఒక వేళ మళ్లీ రాష్ట్రానికి హాని చేసే వాళ్ళు వస్తే అన్న అనుమానం చాలా మందిలో ఉందని పవన్ అన్నారు. అయితే వాళ్ళు మళ్లీ రారని తాను చెబుతున్నా అన్నారు. అమరావతి రాజధాని కోసం భూమి ఇచ్చిన ప్రతి రైతు రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వం కోరుతున్నారని ఆయన గుర్తు చేశారు. అంతే కాదు భవిష్యత్తులో మనమంతా ఒకటే మాట మీద ఉండి అమరావతి రైతాంగానికి అండగా నిలబడాలని ఆయన కూటమి ప్రభుత్వానికి పార్టీలకు తెలిపారు. తాము అయితే మాట మార్చమని, అలాగే కలసి ముందుకే వెళ్తామని క్లారిటీ ఇచ్చారు. అంతే కాదు చట్ట సభల్లో శాసన సభ్యులు ఇచ్చే వాగ్దానాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా తప్పకూడదని పవన్ సూచించారు. ఈ విషయంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమరావతి రాజధానిని ముందుకు తీసుకువెళ్లేందుకు కట్టుబడి ఉందని అన్నారు. ఒక వేళ చట్ట సభల్లో ఇచ్చే మాటను నిలబెట్టుకోకపోతే ప్రజలలో విశ్వాసం కోల్పోవాల్సి వస్తుందని పవన్ చెప్పుకొచ్చారు.
రాజధాని కోసం కొట్లాట :
ఇన్నేళ్ళు అయినా ఏపీ రాజధాని విషయంలో ఇంకా కొట్టుకోవడం బాధగా ఉందని ఆయన అన్నారు. కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం అవతరించినప్పటి నుంచి ఇప్పటి వరకు రాజధాని కోసం కొట్టుకుంటున్నామని ఆయన గతాన్ని గుర్తు చేశారు. ఇక ఇప్పటికీ రాజధాని, సరైన హైకోర్టు, పరిపాలన భవనాలు లేదని తలచుకుంటే బాధేస్తోంది అన్నారు. ఇక రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించలేదని ఆయన విమర్శించారు. సరైన ప్రణాళిక లేకుండా విభజించారని మండిపడ్డారు. కాంగ్రెస్ వాళ్లు చేసిన పొరపాటు వల్లే ఏపీ ఇంకా రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయిందని పవన్ అన్నారు. తనకు రాష్ట్రంపై ప్రేమ ఉండడం వల్లనే ఎలాంటి షరతులు లేకుండా 2014లో టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చానని చెప్పారు.
అమరావతి ప్రపంచ శక్తిగా :
ఏపీకి మాత్రమే అమరావతి రాజధాని కాదని ప్రపంచ శక్తిగా ప్రజా రాజధానిగా రూపుదిద్దుకుంటోందని పవన్ చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కటే రాజధాని ఉందని అది అమరావతి మాత్రమేనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 51 ఏళ్ల వయసులో 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితమే ఆంధ్ర రాష్ట్రమని పవన్ గుర్తు చేశారు. దేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటానికి ఆయన పోరాటమే మూలమని అన్నారు. ఆనాడు తెలుగు మాట్లాడే ప్రజల కోసం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడకపోయి ఉంటే ఈనాడు తెలంగాణ రాష్ట్రం అవతరించేది కాదంటూ పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు తెలంగాణలో నాందేడ్, పర్బానీ, బీడ్, శంభాజీనగర్ ప్రాంతాలు కూడా కలసి ఉండేవని అన్నారు.
ఉప ప్రాంతాల విభజన :
రాష్ట్రమంతా ఒక్కటి అన్న భావన ఉండాలని పవన్ అన్నారు. ఉప ప్రాంతాల విభజన ఎవరికీ మంచిది కాదని అన్నారు అలా కనుక విడదీసుకుంటూ పోతే కనుక ఏపీని ఎవరూ రక్షించలేరని అన్నారు. మనమంతా ఒకటే నేల ఒకటే రాష్ట్రం ఒకటే భాష ఒకటే జాతి అని బలంగా బల్లగుద్ది చెప్పకపోతే మన అనైక్యత ఎదుటివారికి బలం అవుతుందని ఆయన హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మనం ఒక తరానికి స్థిరత్వం ఇవ్వాలని ఆయన సూచించారు. రాష్ట్ర విభజన నాటి పరిస్థితులు మళ్లీ ఉత్పన్నం కాకూడదని పవన్ స్పష్టం చేశారు.
