Begin typing your search above and press return to search.

జగన్ కి పవన్ డైరెక్ట్ కౌంటర్

వైసీపీ అధినేత జగన్ పరకామణి కేసును చిన్న దొంగతనంగా పేర్కొనడం మీద పవన్ తాజాగా ఫైర్ అయ్యారు.

By:  Satya P   |   10 Dec 2025 11:57 PM IST
జగన్ కి పవన్ డైరెక్ట్ కౌంటర్
X

ఏపీ రాజకీయాల్లో జగన్ పవన్ ఈ ఇద్దరి మధ్యన ఎపుడూ డైలాగ్ వార్ జరుగుతూనే ఉంటుంది. ఏపీలో ఎప్పటికీ కలవని రెండు భిన్న రాజకీయ ధృవాలుగా జగన్ ని పవన్ ని భావించవచ్చు అని రాజకీయ విశ్లేషకులు అంటూంటారు. దాదాపుగా ఒకే వయసు కలిగిన ఈ ఇద్దరు నాయకులు ఏపీ రాజకీయాల్లో దిగ్గజ నేత బాబు తరువాత తరం వారు. బాబుకు ఎదురు నిలిచి జగన్ ఉన్నారు. పవన్ తనదైన వ్యూహంతో జగన్ ని ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల సమయంలో జగన్ మీద పవన్ అనేక విమర్శలు చేశారు కూటమి అధికారంలోకి వచ్చాక ఆయన జోరు తగ్గించారు. అధికారంలో పాలనలో ఆయన ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. అయితే అనూహ్యంగా పవన్ జగన్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.

పరకామణి కేసు మీదనే :

వైసీపీ అధినేత జగన్ పరకామణి కేసును చిన్న దొంగతనంగా పేర్కొనడం మీద పవన్ తాజాగా ఫైర్ అయ్యారు. ఇది మీకు చిన్న దొంగతనంగా కనిపిస్తోందా అంటూ ఆయన ప్రశ్నించారు. ఎంతో కీలకమైన ఈ వ్యవహారం గురించి జగన్ నిర్లక్ష్యంగా మాట్లాడారు అని ఆయన నిందించారు. పైగా మతాన్ని కూడా తీసుకుని మరీ జగన్ మీద గట్టిగానే రెట్టించారు.

అలా జరిగితే అంటూ :

ఇలాంటి ఘటనే మీ మతంలో జరిగితే చిన్న విషయం అని సర్దిపెట్టుకుంటారా అని జగన్ ని పవన్ నిలదీయడం ద్వారా జగన్ ని మరోమారు కార్నర్ చేసే ప్రయత్నం చేశారు. జగన్ క్రిస్టియన్ మతం ఆరాధిస్తారు, దానిని దృష్టిలో ఉంచుకుని పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు అని అంటున్నారు. తన మతానికి జరిగి ఉంటే అన్న మాటల ద్వారా జగన్ కి సరైన తీరులో పవన్ కౌంటర్ ఇచ్చారు అని అంటున్నారు. అంతే కాదు పవిత్రమైన తిరుమలలో గత అయిదేళ్ల వైసీపీ పాలనలో అన్ని రకాలుగానూ అక్రమాలు జరిగాయని అన్నారు. ఒక్కోటీ ఇపుడు బయటకు వస్తున్నాయని అన్నారు.

బాబు తరువాత :

ఇక ఇదే విషయం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇంతకు ముందే రియాక్ట్ అయ్యారు. జగన్ కి తిరుమలలో జరిగిన అపచారాలు దొంగతనాలు అన్నీ కూడా చిన్నగా కనిపిస్తున్నాయా అని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది హిందూ మతానికి సంబంధించిన పెద్ద విషయం అని బాబు అన్నారు. అలాంటి దాని విషయంలో జగన్ స్పందన చాలా నిర్లక్ష్యంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు, అంతకు ముందు లోకేష్ సైతం ఇదే విషయం మీద ట్వీట్ ద్వారా జగన్ వైఖరిని ఎండగట్టారు, ఇపుడు పవన్ అయితే డైరెక్ట్ ఎటాక్ చేశారు. జగన్ మతం అంటూ పవన్ ప్రస్తావించడంతో ఈ విషయం మీద వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా కూడా జగన్ ని పవన్ విమర్శించడంతో ఇక జగన్ వైపు నుంచి కూడా విమర్శలు రానున్న కాలంలో వస్తాయా అన్న చర్చ సైతం ఉంది.