Begin typing your search above and press return to search.

వెండితెర వేదిక‌గా.. ప‌వ‌న్ క‌ల్యాణ్ వినూత్న ప్ర‌య‌త్నం

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు వినూత్న ఐడియాలను అరువు తెచ్చుకుంటారనే కామెంట్లు త‌ర‌చుగా వినిపిస్తాయి. సాధార‌ణ ఐడియాలు కామ‌నే అయినా.. వినూత్నంగా ఆలోచించడం.. వాటిని అమ‌లు చేయ‌డం అనేది నేటి త‌రం నాయ‌కుల్లో చాలా త‌క్కువ మందే పాటిస్తున్నారు.

By:  Tupaki Desk   |   22 May 2025 9:52 AM IST
వెండితెర వేదిక‌గా.. ప‌వ‌న్ క‌ల్యాణ్ వినూత్న ప్ర‌య‌త్నం
X

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు వినూత్న ఐడియాలను అరువు తెచ్చుకుంటారనే కామెంట్లు త‌ర‌చుగా వినిపిస్తాయి. సాధార‌ణ ఐడియాలు కామ‌నే అయినా.. వినూత్నంగా ఆలోచించడం.. వాటిని అమ‌లు చేయ‌డం అనేది నేటి త‌రం నాయ‌కుల్లో చాలా త‌క్కువ మందే పాటిస్తున్నారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ 'కాపీ' పాల‌న‌, ప‌థ‌కాలే కొన‌సాగుతున్నాయి. ఇలాంటి విమ‌ర్శ‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్న స‌మ‌యంలో ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌రికొత్త ఆలోచ‌న చేశారు. వినూత్నంగా ఆలోచించారు. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో ఎవ‌రూ చేయ‌ని ప్ర‌య‌త్నాన్ని, ప్ర‌యోగాన్ని కూడా ఆయ‌న చేస్తున్నారు.

దాని పేరే.. 'వెండితెర వేదిక‌గా..' అనే కార్య‌క్ర‌మం. ఇది పూర్తిగా అధికారిక కార్య‌క్ర‌మం. గురువారం నుంచి ఈ కార్య‌క్ర‌మానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ శ్రీకారం చుడుతున్నారు. దీనిలో విశేషం ఏంటంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు అధికారుల‌కు, లేదా ఒక పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన‌.. 'వీడియో కాన్ఫ‌రెన్స్‌'(దృశ్య మాధ్య‌మ విధానం)ను పవ‌న్ క‌ల్యాణ్ నేరుగా గ్రామీణ ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేస్తున్నారు. ఇక్క‌డ వీడియో కాన్ఫ‌రెన్సు అంటే.. ప్ర‌జ‌లు ఎవ‌రూ అధికారుల మాదిరిగా ల్యాప్ టాప్‌ల‌ను ముందు పెట్టుకునో.. ట్యాబుల‌ను ముందు పెట్టుకొనో.. లేక 6 అంగుళాల స్క్రీన్ ఉన్న మొబైళ్ల‌ను ఎదురుగా పెట్టుకునో ఉండ‌రు.

ఎంపిక చేసిన గ్రామస్థుల‌ను వారి గ్రామానికి చేరువ‌గా ఉన్న ఓ సినిమా హాలుకు తీసుకువ‌స్తారు. ఆ సినిమా హాల్లోని వెండితెర ముందు వారిని కూర్చోబెడ‌తారు. ఆ వెండితెర వేదిగా.. లైవ్‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ వారికి క‌నిపిస్తారు. వారి నుంచి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటారు. అక్క‌డే వారిని ఉద్దేశించి వెండితెర‌పైనే ప్ర‌సంగిస్తారు. అదేవిధంగా వారి నుంచి విన‌తులు తీసుకుని.. ఓ ఐడీ నెంబ‌రు కూడా కేటాయిస్తారు. ఇలా.. తొలి వినూత్న వెండితెర వేదిక కార్య‌క్ర‌మాన్ని ప‌వ‌న్ క‌ల్యాణ్ మంగ‌ళ‌గిరిలోని జ‌న‌సేన పార్టీ కార్యాల‌యంలో ఉన్న డిప్యూటీసీఎం ఆఫీసు నుంచే నిర్వ‌హిస్తార‌ని ప్ర‌భుత్వం వెల్ల‌డించింది.

తొలి గ్రామం ఇదీ..

వెండితెర వేదిక‌గా.. అనే స్క్రీన్ గ్రీవెన్స్ కార్య‌క్ర‌మానికి శ్రీకాకుళంలోని టెక్క‌లి నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న‌ రావి వ‌లస గ్రామాన్ని డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎంచుకున్నారు. ఇక్క‌డి ప్ర‌జ‌ల‌తో ఆయ‌న వెండితెర వేదిగా.. ముఖాముఖి మాట్లాడ‌నున్నారు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకుంటారు. వారి నుంచి విన‌తులు కూడా తీసుకుంటారు. ''మ‌న వూరి మాటా మంతీ'' పేరుతో ఆయా గ్రామాల ప‌రిస్థితుల‌ను కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలుసుకుంటారు. మొత్తానికి తొలిసారి వినూత్న కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తుండ‌డంతో అధికారులు త‌గిన ఏర్పాట్లు చేశారు.